11,000 మందికి పైగా ఉద్యోగుల తొలగింపు.. కారణం ఇదే

Layoff : ప్రపంచంలోనే ప్రముఖ ఐటీ సర్వీసెస్ కంపెనీల్లో ఒకటైన యాక్సెంచర్ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించి వార్తల్లో నిలిచింది. గత మూడు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆఫీసుల నుండి 11,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కంపెనీ ఆదాయం పెరుగుతున్నప్పటికీ, కార్పొరేట్ డిమాండ్ తగ్గడం, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని పెద్ద ఎత్తున తమ కార్యకలాపాల్లోకి తీసుకురావడం ఈ భారీ తొలగింపులకు ప్రధాన కారణాలుగా చెప్పబడుతున్నాయి.

యాక్సెంచర్ సీఈఓ జూలీ స్వీట్ ఈ లేఆఫ్‌ల వెనుక ఉన్న కారణాన్ని స్పష్టం చేశారు. కంపెనీకి ప్రస్తుతం అవసరమైన కొత్త నైపుణ్యాల కోసం ఇప్పటికే ఉన్న కొందరు ఉద్యోగులకు రీస్కిల్లింగ్ చేయడం సాధ్యం కావడం లేదట. "వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాల డిమాండ్‌కు అనుగుణంగా అన్ని ఉద్యోగులు వేగంగా మారలేరు, వాటికి అలవాటు పడలేరు. అలాంటి వారికి యాక్సెంచర్ బయటి దారి చూపింది" అని జూలీ స్వీట్ వ్యాఖ్యానించారు. అంటే, టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా తమను తాము మార్చుకోలేని ఉద్యోగులను తొలగించడం అనివార్యమని ఆమె పరోక్షంగా తెలిపారు.

2025 జూన్ నెలలో యాక్సెంచర్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 7,91,000 ఉండగా, ఆగస్టు నెలాఖరుకు ఈ సంఖ్య 7,79,000కు తగ్గింది. అంటే కేవలం మూడు నెలల్లోనే 12,000 మంది ఉద్యోగులు తగ్గారని అర్థం. గత మూడు నెలలుగా జరుగుతున్న ఈ లేఆఫ్ ప్రక్రియ ఇంకా ముగియలేదని, నవంబర్ నెల వరకు ఇది కొనసాగవచ్చని చెబుతున్నారు.

ఈ భారీ లేఆఫ్‌ల ద్వారా యాక్సెంచర్ కంపెనీకి ఒక బిలియన్ డాలర్ల (సుమారు రూ.8,300 కోట్లు) కంటే ఎక్కువ నిధులు ఆదా అవుతాయని అంచనా. అదే సమయంలో, AI-సెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్‌లను సమర్థవంతంగా నిర్వహించగల టాలెంటెడ్ ఉద్యోగులను నిలుపుకోవడానికి యాక్సెంచర్ ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా, ఏజెంటిక్ ఏఐ వంటి కొత్త తరం సాధనాలపై కేంద్రీకరించి, అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ లో యాక్సెంచర్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఈ లేఆఫ్‌లు కేవలం యాక్సెంచర్‌లో మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అనేక ఐటీ కంపెనీలలో ఏఐ ప్రభావం కారణంగా ఉద్యోగ మార్పులు జరుగుతున్నాయనే సిగ్నల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story