Adani Group : ఇండియాలో దూసుకుపోతున్న అదానీ బ్రాండ్.. 82శాతం గ్రోత్ తో సెన్సేషన్
82శాతం గ్రోత్ తో సెన్సేషన్

Adani Group : బ్రాండ్ ఫైనాన్స్ 2025కు సంబంధించి విడుదల చేసిన అత్యంత విలువైన భారతీయ బ్రాండ్‌ల ర్యాంకింగ్‌ల ప్రకారం.. భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా అదానీ గ్రూప్ అవతరించింది. ‘మోస్ట్ వాల్యుయబుల్ ఇండియన్ బ్రాండ్స్ 2025’ నివేదిక ప్రకారం.. అదానీ బ్రాండ్ ఏకంగా 82% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. అయితే, టాటా గ్రూప్ మాత్రం మరోసారి దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
అదానీ గ్రూప్ బ్రాండ్ విలువ గత సంవత్సరం 3.55 బిలియన్ డాలర్లు ఉండగా, 2025లో అది ఏకంగా 6.46 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఒక్క సంవత్సరంలోనే బ్రాండ్ విలువలో 2.91 బిలియన్ డాలర్ల పెరుగుదల, అదానీ గ్రూప్ వ్యూహాలలో ఉన్న స్పష్టత, వినూత్న ఆలోచనలు, స్థిరమైన వృద్ధి పట్ల వారి నిబద్ధతను తెలియజేస్తోందని నివేదిక పేర్కొంది. ఇది అదానీ గ్రూప్ వేగవంతమైన పురోగతికి నిదర్శనం.
టాటా గ్రూప్ మరోసారి భారత బ్రాండింగ్ ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. బ్రాండ్ వాల్యూయేషన్ కంపెనీ బ్రాండ్ ఫైనాన్స్ తాజా ‘ఇండియా 100’ నివేదిక ప్రకారం.. టాటా గ్రూప్ భారతదేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది. ఈ సంవత్సరం దాని బ్రాండ్ విలువ 10శాతం పెరిగి, ఏకంగా 30 బిలియన్ డాలర్ల మార్కును దాటిన దేశంలోనే మొదటి బ్రాండ్‌గా రికార్డు సృష్టించింది.
దేశంలోని బలమైన ఆర్థిక పరిస్థితి, అంచనా వేసిన 6-7% జీడీపీ వృద్ధి రేటు కారణంగా, భారతీయ కంపెనీలు తమ బ్రాండ్ విలువను పెంచుకోవడానికి అపారమైన అవకాశాలను పొందుతాయని ఈ నివేదిక అభిప్రాయపడింది. దేశీయ డిమాండ్ పెరుగుదల, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలు, పెట్టుబడుల సహాయంతో, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్నప్పటికీ భారతీయ కంపెనీలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ బలాన్ని తెలియజేస్తుంది.
ముందు వరుసలో ఉన్న ఇతర బ్రాండ్‌లు ఏవి?
ఈ సంవత్సరం నివేదికలో ఒక ప్రత్యేకత ఏమిటంటే, భారతదేశంలోని టాప్ 10 బ్రాండ్‌ల విలువలో రెండు అంకెల వృద్ధి నమోదైంది. ఇన్ఫోసిస్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. దీని బ్రాండ్ విలువ 15% పెరిగి 16.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. హెచ్‌డిఎఫ్‌సి గ్రూప్ మూడో స్థానంలో నిలిచింది. ఇది 37% భారీ వృద్ధిని సాధించి 14.2 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువను అందుకుంది. ఎల్‌ఐసీ నాలుగో స్థానంలో ఉంది. దీని బ్రాండ్ విలువ 35% పెరిగి 13.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. హెచ్‌సీఎల్ టెక్ బ్రాండ్ విలువ 17% పెరిగి 8.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. లార్సెన్ & టూబ్రో గ్రూప్ విలువ 3% పెరిగి 7.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మహీంద్రా గ్రూప్ కూడా టాప్ 10లో స్థానం సంపాదించుకుంది, దాని విలువ 7.2 బిలియన్ డాలర్లుగా ఉంది.
