Adani Power : భారతీయ స్టాక్ మార్కెట్‌లో గౌతమ్ అదానీకి చెందిన అదానీ పవర్ సంచలన రికార్డు సృష్టించింది. మార్కెట్ విలువ పరంగా దేశంలోనే అగ్రగామి ఐటీ సేవల దిగ్గజమైన ఇన్ఫోసిస్ కంపెనీని వెనక్కి నెట్టి అదానీ పవర్ షేర్లు భారీ ఉల్టా పల్టా చేశాయి. ప్రస్తుత 2026 సంవత్సరంలోనే అదానీ పవర్ షేర్ల విలువ ఏకంగా 68 శాతం మేర లాభపడింది. దేశవ్యాప్తంగా మండిపోతున్న ఎండలు, రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్, పవర్‌ఫుల్ ఎల్ నినో ప్రభావం వల్లే అదానీ పవర్ షేర్లలో ఈ రేంజ్ బుల్ రన్ సాధ్యమైందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ భారీ షేర్ల ర్యాలీతో అదానీ పవర్ మొత్తం మార్కెట్ విలువ ఏకంగా రూ.4.85 లక్షల కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ. 4.72 లక్షల కోట్ల వద్దే నిలిచిపోయింది. ఈ ఘన విజయంతో అదానీ పవర్ ఇప్పుడు భారతదేశంలోనే అత్యంత విలువైన టాప్ కంపెనీల జాబితాలో 11వ స్థానానికి ఎగబాకి సరికొత్త రికార్డు సృష్టించింది. ఎండ తీవ్రత ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ పవర్ షేర్ల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.

భారతదేశం ప్రస్తుతం మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భయంకరమైన ఎండలు, వడగాల్పులను ఎదుర్కొంటోంది. ఇటీవల మే 22న విడుదలైన వాతావరణ నివేదికల ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత వేడిగా ఉన్న టాప్ 100 నగరాల జాబితాను తీస్తే, అందులో ఏకంగా 97 నగరాలు ఒక్క భారతదేశంలోనే ఉండటం గమనార్హం (మిగిలిన 3 నగరాలు నేపాల్‌లో ఉన్నాయి). ఈ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల వల్ల దేశవ్యాప్తంగా ఇళ్లు, ఆఫీసుల్లో ఎయిర్ కండిషనర్లు (AC), కూలర్లు, ఫ్యాన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో దేశంలో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పీక్ స్టేజ్‌కు చేరింది.

ఈ భారీ విద్యుత్ డిమాండ్ నేరుగా అదానీ పవర్ లాంటి విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. బుధవారం ట్రేడింగ్‌లో అదానీ పవర్ షేరు దాదాపు 3 శాతం లాభపడి, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో రూ.252 వద్ద సరికొత్త 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. ఈ షేరు కేవలం ఒకే ఒక్క వారంలో 13 శాతం, గడిచిన ఏడాది కాలంలో 126 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఇక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకైతే ఈ కారు మూడు సంవత్సరాలలో 384 శాతం, ఐదు సంవత్సరాల కాలంలో ఏకంగా 1,213 శాతం మైండ్ బ్లోయింగ్ లాభాలను అందించి ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేసింది.

ఒకవైపు ఎండల పుణ్యమా అని పవర్ సెక్టార్ షేర్లు దూసుకుపోతుంటే.. మరోవైపు దేశీయ ఐటీ (IT) రంగం మాత్రం తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందడం ఐటీ కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ 2026 ఏడాది ప్రారంభంలో ప్రముఖ ఏఐ స్టార్టప్ కంపెనీ ఆంత్రోపిక్ తన సరికొత్త క్లాడ్ కోవర్క్ ఏజెంట్ కోసం కొన్ని అడ్వాన్స్‌డ్ ప్లగ్-ఇన్‌లను మార్కెట్లోకి తెచ్చింది. లీగల్ వర్క్స్, సేల్స్, మార్కెటింగ్, డేటా అనాలసిస్ వంటి పనులను ఈ ఏఐ టూల్స్ చాలా సులువుగా ఆటోమేట్ చేయగలవు.

ఈ సరికొత్త ఏఐ టెక్నాలజీ వల్ల భవిష్యత్తులో సాంప్రదాయ ఐటీ సర్వీసెస్, కోడింగ్ కంపెనీల అవసరం చాలా వరకు తగ్గిపోతుందనే భయం గ్లోబల్ ఇన్వెస్టర్లలో మొదలైంది. దీంతో ఇన్ఫోసిస్ వంటి ఐటీ షేర్లను ఇన్వెస్టర్లు భారీగా విక్రయించడం ప్రారంభించారు. ఫలితంగా ఇన్ఫోసిస్ షేర్లు ఈ 2026 సంవత్సరంలోనే ఇప్పటివరకు దాదాపు 29 శాతం మేర కుప్పకూలాయి. ఈ షేరు గడిచిన వారంలో 3 శాతం, ఏడాది కాలంలో 26 శాతం పడిపోయింది. అంతేకాకుండా లాంగ్ టర్మ్‌లో చూసినా.. మూడు సంవత్సరాలలో 12 శాతం, ఐదేళ్ల కాలంలో 17 శాతం నష్టాలను మిగిల్చి ఐటీ ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశకు గురిచేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story