Rohit Sharma : ఈ కంపెనీలో భారీ పెట్టుబడులు పెట్టిన స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ
భారీ పెట్టుబడులు పెట్టిన స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ

Rohit Sharma : క్రికెట్ ప్రపంచంలో 'హిట్‌మ్యాన్' గా పేరుగాంచిన రోహిత్ శర్మ ఇప్పుడు వ్యాపార ప్రపంచంలోనూ తన కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ ఇటీవల 'ప్రొజో' అనే సప్లై చైన్ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. మంగళవారం ఈ కంపెనీ రోహిత్ శర్మ తమ సంస్థలో వ్యూహాత్మక పెట్టుబడి పెట్టారని ప్రకటించింది. అయితే, ఆయన ఎంత డబ్బు పెట్టారనేది మాత్రం చెప్పలేదు. 2016లో స్థాపించిన ప్రొజో ఏదో చిన్న స్టార్టప్ కాదు. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న సప్లై చైన్, లాజిస్టిక్స్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటోంది. ప్రొజోకు ప్రస్తుతం 42 టెక్-ఎనేబుల్డ్ వేర్‌హౌస్‌లు ఉన్నాయి. ఇవి 22 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తరించి ఉన్నాయి. అంతేకాదు, ఈ కంపెనీ 24,000 పైగా పిన్ కోడ్‌ల వరకు డెలివరీ చేస్తుంది. ప్రస్తుతం రూ.250 కోట్ల రెవెన్యూ రన్-రేట్ తో పనిచేస్తోంది.
ప్రొజో ఇప్పటివరకు మొత్తం 20 మిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.160 కోట్లు) నిధులు సేకరించింది. ఈ నిధులలో సిక్స్త్ సెన్స్ వెంచర్స్, జాఫ్‌కో ఆసియా వంటి పెద్ద పెట్టుబడిదారులు పాలుపంచుకున్నారు. రోహిత్ శర్మ ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టడంతో ప్రొజో భవిష్యత్తు చాలా బాగుందని విశ్లేషకులు అంటున్నారు. రోహిత్ శర్మ చేసిన ఈ పెట్టుబడి అతని కెరీర్‌లో ఒక కొత్త మలుపు. క్రికెట్‌లో తన అద్భుతమైన విజయాల తర్వాత, ఇప్పుడు వ్యాపార ప్రపంచంలోనూ తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు. రోహిత్ ఎప్పుడూ తన తెలివితేటలు, వ్యూహాత్మక ఆలోచనలతో అందరినీ ఆకట్టుకున్నారు. మైదానంలో బౌలర్లను చితకబాదడంలో అయినా, ఇప్పుడు వ్యాపారంలో సరైన చోట డబ్బు పెట్టడంలో అయినా అతని సమయస్ఫూర్తి కనిపిస్తుంది.
ప్రొజోలో పెట్టుబడి పెట్టడం ద్వారా రోహిత్ కేవలం క్రికెటర్ మాత్రమే కాదు, ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా అని చూపించారు. సప్లై చైన్, లాజిస్టిక్స్ రంగం భారతదేశంలో చాలా వేగంగా పెరుగుతోంది. రోహిత్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో తెలివైన ప్లాన్ వేశాడు. లాభాలు తెచ్చిపెట్టడమే కాకుండా, ప్రొజోకు ఒక పెద్ద బ్రాండ్ పేరును కూడా ఇస్తుంది. ఇది కంపెనీ అభివృద్ధికి మరింత సహాయపడుతుంది.
రోహిత్ శర్మ ఇటీవల టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. టీ20 ఫార్మాట్ నుండి కూడా అతను గతంలోనే రిటైర్ అయ్యారు. అయితే, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అతని సేవలను గుర్తించి, అతని A+ గ్రేడ్ కాంట్రాక్ట్‌ను కొనసాగించింది. A+ గ్రేడ్ కాంట్రాక్ట్ కింద ఆటగాళ్లకు సంవత్సరానికి రూ.7 కోట్ల రీటెయినర్‌షిప్ లభిస్తుంది. ఒకవేళ రోహిత్, విరాట్‌లను A గ్రేడ్‌కు డిమోట్ చేస్తే, వారికి రూ.5 కోట్లు మాత్రమే లభిస్తాయి.
