AI Price Crisis : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చ జరుగుతోంది. ఏఐ వస్తే మనుషుల ఉద్యోగాలు ఊడిపోతాయని, కంపెనీలకు బోలెడంత పైసలు మిగులుతాయని అందరూ భావించారు. కానీ క్షేత్రస్థాయిలో సీన్ పూర్తిగా రివర్స్ అవుతోంది. సాంకేతిక రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మైక్రోసాఫ్ట్, ఉబెర్, ఎన్విడియా లాంటి దిగ్గజ కంపెనీలకు ఏఐ టూల్స్ వాడుతున్నందుకు వస్తున్న బిల్లులు చూసి మైండ్ బ్లాక్ అవుతోంది. చాలా చోట్ల ఈ ఏఐ మెషిన్లను నడపడానికి అవుతున్న ఖర్చు, అక్కడ పనిచేసే ఉద్యోగుల జీతాల కంటే ఎక్కువైపోవడం ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

మైక్రోసాఫ్ట్ వెనకడుగు.. ఫ్రీ యాక్సెస్ కట్

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కేవలం ఆరు నెలల క్రితం తన వేలాది మంది డెవలపర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు, డిజైనర్లకు క్లాడ్ కోడ్ అనే అడ్వాన్స్‌డ్ ఏఐ టూల్ యాక్సెస్‌ను ఉచితంగా ఇచ్చింది. దీనివల్ల కోడింగ్ పనులు వేగంగా జరుగుతాయని కంపెనీ ఆశించింది. ఉద్యోగులు కూడా పోటీ పడి మరీ ఈ టూల్‌ను విచ్చలవిడిగా వాడేశారు. ది వర్జ్ నివేదిక ప్రకారం.. ఈ టూల్ వాడకం ఏ స్థాయికి చేరిందంటే, దానికి అవుతున్న ఖర్చును భరించలేక మైక్రోసాఫ్ట్ ఇప్పుడు తన సొంత ఇంజనీర్ల నుంచే ఆ యాక్సెస్‌ను వెనక్కి తీసేసుకుంటోంది. మెజారిటీ క్లాడ్ కోడ్ లైసెన్సులను రద్దు చేస్తూ, వారిని తక్కువ ఖర్చుతో కూడిన గిట్‌హబ్ కోపైలట్ వైపు మళ్లిస్తోంది.

నాలుగే నెలల్లో బడ్జెట్ స్వాహా.. ఉబెర్ షాకింగ్ స్టోరీ

ఈ ఏఐ ఖర్చుల తలనొప్పి ఒక్క మైక్రోసాఫ్ట్‌తోనే ఆగలేదు. ప్రముఖ రైడ్-హెయిలింగ్ సంస్థ ఉబెర్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఉబెర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ప్రవీణ్ నెపల్లి నాగా ఇటీవల ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. కంపెనీ తన ఉద్యోగుల కోడింగ్ అవసరాల కోసం కేటాయించిన 2026 ఏడాది మొత్తం ఏఐ బడ్జెట్.. కేవలం నాలుగు నెలల్లోనే పూర్తిగా ఖర్చయిపోయిందట. ఆఫీసుల్లో టీమ్‌ల మధ్య పోటీ పెంచడానికి, ఎవరు ఎక్కువ ఏఐ వాడితే వారికి లీడర్‌బోర్డుల్లో టాప్ ప్లేస్ ఇస్తామని ఉబెర్ మొదట్లో ప్రోత్సహించింది. తీరా చూస్తే ఆ ఉత్సాహమే ఇప్పుడు కంపెనీ బడ్జెట్‌కు ముప్పు తెచ్చింది.

ఇంతకీ ఏఐ బిల్లులు అంతలా ఎందుకు పెరుగుతున్నాయి?

ఈ భారీ ఖర్చుల వెనుక ఉన్న అసలు రహస్యం ఏఐ కంపెనీల ప్రైసింగ్ పాలసీలోనే ఉంది. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLM) అన్నీ టోకెన్ల ప్రాతిపదికన చార్జ్ చేస్తాయి. ఒక టోకెన్ అంటే ఏఐ ప్రాసెస్ చేసే టెక్స్ట్ అతి చిన్న భాగం. ఉద్యోగులు ఎంత వేగంగా, ఎంత ఎక్కువ డేటాను ఏఐ ద్వారా జనరేట్ చేయిస్తే అంతలా టోకెన్ల వినియోగం పెరుగుతుంది, బిల్లు కూడా అంతకంతకూ కొండలా పేరుకుపోతుంది. అమెజాన్, మెటా లాంటి కంపెనీలు కూడా తమ ఉద్యోగులు ఎవరు ఎక్కువ ఏఐ వాడుతున్నారనేది నిరంతరం ట్రాక్ చేస్తున్నాయి.

భవిష్యత్తులో ఈ ఖర్చులు ఇంకా పెరుగుతాయా?

ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ గోల్డ్‌మన్ సాక్స్ అంచనా ప్రకారం.. 2030 నాటికి స్వతంత్రంగా పనిచేసే ఏజెంటిక్ ఏఐ సిస్టమ్స్ రాబోతున్నాయి. వీటివల్ల టోకెన్ల వినియోగం ఏకంగా 24 రెట్లు పెరుగుతుంది. మరో రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ ప్రకారం.. భవిష్యత్తులో టోకెన్ల ధరలు 90 శాతం వరకు తగ్గినప్పటికీ, వాడే టోకెన్ల సంఖ్య ఊహించని రేంజ్‌లో పెరిగిపోవడం వల్ల కంపెనీల మొత్తం బిల్లులు ఎప్పటికీ తగ్గవని తేల్చి చెప్పింది.

మనుషుల కంటే కంప్యూటర్లే కాస్లీ

ఈ వ్యవహారంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ చిప్స్ తయారీ సంస్థ అయిన ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ బ్రయాన్ కాటన్జారో చేసిన వ్యాఖ్యలు మరింత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. తమ టీమ్‌లో పని చేసే హ్యూమన్ రిసోర్స్ (ఉద్యోగుల జీతభత్యాల) ఖర్చు కంటే, ఏఐని రన్ చేయడానికి వాడే కంప్యూట్ పవర్ ఖర్చే చాలా ఎక్కువైపోయిందని ఆయన ఒప్పుకున్నారు. ఏఐ విప్లవాన్ని నడిపిస్తున్న కంపెనీలకే ఈ రేంజ్‌లో బిల్లులు వస్తుంటే.. రాబోయే రోజుల్లో సాధారణ ఐటీ కంపెనీల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story