AI Chip Stocks : ఏఐ చిప్ కంపెనీల ఇన్వెస్టర్లకు హెచ్చరిక.. మోర్గాన్ స్టాన్లీ షాకింగ్ నివేదిక
మోర్గాన్ స్టాన్లీ షాకింగ్ నివేదిక

AI Chip Stocks : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో గత కొన్ని సంవత్సరాలుగా గ్లోబల్ మార్కెట్లో చిప్ తయారీ కంపెనీల షేర్లు భారీ లాభాలను ఆర్జించాయి. అయితే, ఈ రంగానికి చెందిన స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు ఇకపై జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ హెచ్చరించింది. రాబోయే రోజుల్లో ఏఐ చిప్స్ తయారు చేసే కంపెనీల మార్కెట్ పట్టు, ధరలను నిర్ణయించే శక్తి క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ లీసా షాలెట్ ఇన్వెస్టర్లను అప్రమత్తం చేశారు.
లీసా షాలెట్ విశ్లేషణ ప్రకారం.. ఏఐ డేటా సెంటర్లలో ఉపయోగించే టెక్నాలజీ చాలా వేగంగా మారుతోంది. గతంలో మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, మెటా వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు ఏఐ చిప్స్ కోసం పూర్తిగా బయటి సెమీకండక్టర్ కంపెనీలపైనే ఆధారపడేవి. కానీ ఇప్పుడు ఈ టెక్ కంపెనీలన్నీ తమ సొంత అవసరాలకు అనుగుణంగా, తక్కువ ఖర్చుతో కూడిన ఏఐ చిప్స్‌ను స్వయంగా డిజైన్ చేసుకోవడం ప్రారంభించాయి. ఈ కొత్త ట్రెండ్ గనుక మార్కెట్లో వేగంగా పుంజుకుంటే, ప్రస్తుతం టాప్‌లో ఉన్న సాంప్రదాయ చిప్ తయారీ కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్ తగ్గి, వారి లాభాల మార్జిన్లపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది.
ఏఐ టెక్నాలజీనే భవిష్యత్తు అనే నమ్మకంతో ఇన్వెస్టర్లు గత రెండేళ్లుగా సెమీకండక్టర్ కంపెనీలలో భారీగా పెట్టుబడులు పెట్టారు. దీంతో ఈ రకమైన షేర్లు రికార్డు స్థాయి గరిష్టాలకు చేరాయి. అయితే, ప్రస్తుత మార్కెట్ ధరలు అవసరానికి మించి చాలా ఎక్కువగా ఉన్నాయని మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో స్పష్టం చేసింది. బ్లూమ్‌బెర్గ్ గణాంకాల ప్రకారం.. ఫిల్డెల్ఫియా సెమీకండక్టర్ ఇండెక్స్ ప్రైస్-టు-ఎర్నింగ్స్ (P/E) రేషియో 2022 తర్వాత మూడు రెట్లకు పైగా పెరిగింది. దీని అర్థం ఇన్వెస్టర్లు ఈ షేర్ల కోసం చాలా ఎక్కువ ప్రీమియం చెల్లిస్తున్నారు. త్వరలోనే మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ లేదా భారీ కరెక్షన్ వచ్చే అవకాశం ఉందని, కాబట్టి కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు ఆచితూచి అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

