AI Cyber Scams: ఏఐ టెక్నాలజీతో భారీ సైబర్ మోసాలు.. ఎన్ఎఫ్బీసీ కంపెనీలను ముంచేస్తున్న కేటుగాళ్లు
ఎన్ఎఫ్బీసీ కంపెనీలను ముంచేస్తున్న కేటుగాళ్లు

AI Cyber Scams: ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, సైబర్ నేరగాళ్లు దానిని అదే స్థాయిలో నేరాల కోసం వాడుకుంటున్నారు. దేశవ్యాప్తంగా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలను(NBFC) టార్గెట్ చేస్తూ గత మూడు నెలల్లో ఏకంగా రూ.300 కోట్లకు పైగా సైబర్ మోసాలు జరిగినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలోని 12 కంపెనీల నుంచే రూ.65 కోట్లకు పైగా నగదును కేటుగాళ్లు కాజేశారు. కస్టమర్లకు మంజూరైనప్పటికీ ఇంకా పంపిణీ చేయని లోన్ మొత్తాన్ని ఏఐ టూల్స్ సాయంతో వేరే ఖాతాలకు మళ్లిస్తూ ఈ భారీ మోసాలకు పాల్పడుతున్నారు.
ఏఐ టూల్స్, మాల్వేర్ సాయంతో సిస్టమ్ హ్యాకింగ్
ఈ సైబర్ దొంగలు చాలా తెలివిగా ఎన్ఎఫ్బీసీ సంస్థల లోన్ యాప్‌లు లేదా వెబ్సైట్ ఫ్రంట్ ఎండ్‌ను టార్గెట్ చేస్తున్నారు. మాల్వేర్ సాయంతో కంపెనీ సిస్టమ్‌లోకి ప్రవేశించి ఆమోదం పొందిన లోన్ల వివరాలను సేకరిస్తున్నారు. ఆ తర్వాత సిస్టమ్‌కు ఫేక్ కమాండ్స్ పంపి అసలైన కస్టమర్ బ్యాంక్ అకౌంట్ బదులు తమ మ్యూల్ అకౌంట్ల నంబర్లను జోడిస్తున్నారు. దీనివల్ల లోన్ డబ్బు నేరుగా నేరస్తుల ఖాతాలకు చేరుకుంటోంది. అంతేకాకుండా క్లౌడ్ సర్వర్ల ఫైర్‌వాల్ లొసుగులను ఆసరాగా చేసుకుని పబ్లిక్ క్లౌడ్ సర్వీస్ ద్వారా ఈ దాడులు చేస్తున్నారు. ఒక ఘటనలో ఏకంగా చైనీస్ ఏఐ ప్లాట్‌ఫారమ్ సైబర్స్ట్రైక్ ఏఐని ఉపయోగించి కమాండ్ స్క్రిప్ట్స్ పంపినట్లు పోలీసు విచారణలో తేలింది.
వాయిస్ క్లోనింగ్ అలాగే డీప్ ఫేక్ వీడియోలతో ప్రజలకు కుచ్చుటోపి
కేవలం కంపెనీలే కాకుండా సాధారణ ప్రజలను కూడా ఏఐ మోసాలు తీవ్రంగా భయపెడుతున్నాయి. ప్రముఖుల గొంతును, ముఖాన్ని అచ్చం అలాగే పోలి ఉండేలా డీప్ ఫేక్ వీడియోలు, వాయిస్ క్లాన్‌లను సృష్టించి మోసాలు చేస్తున్నారు. ప్రముఖుల ఫేక్ వీడియోలు సృష్టించి ఆన్లైన్ ట్రేడింగ్‌లో భారీ లాభాలంటూ నమ్మిస్తూ ప్రజల నుంచి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. స్నేహితుల గొంతుతో ఫోన్ చేసి అత్యవసరమంటూ డబ్బులు గుంజుతున్న ఉదంతాలు కోకొల్లలుగా వెలుగుచూస్తున్నాయి. వ్యాపారవేత్తలు, సామాన్యులు అనే తేడా లేకుండా అందరూ ఈ ఏఐ ఉచ్చులో చిక్కుకుని నిలువునా మోసపోతున్నారు.
సైబర్ మోసాల నుంచి సురక్షితంగా ఉండే మార్గాలు
ఇలాంటి అధునాతన ఏఐ మోసాల బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తీవ్ర అప్రమత్తత పాటించాలి. ఎవరి నుంచైనా అనుమానాస్పద ఫోన్ కాల్స్ వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే స్పందించకుండా మరో నంబర్ ద్వారా వారిని సంప్రదించి నిజానిజాలు నిర్ధారించుకోవాలి. సోషల్ మీడియాలో వచ్చే స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ ప్రకటనలను గుడ్డిగా నమ్మవద్దు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓటీపీ, పిన్ నంబర్లు, వ్యక్తిగత బ్యాంక్ వివరాలను ఎవరికీ షేర్ చేయవద్దు. ఒకవేళ పొరపాటున మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలి లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి.

