AI Investment: ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించిన చర్చ జోరుగా సాగుతోంది. ప్రముఖ ఆర్థిక సంస్థ యూబీఎస్ గ్లోబల్ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని ఆరు అతిపెద్ద క్లౌడ్ టెక్ కంపెనీలు 2026 నుంచి 2030 మధ్య కాలంలో ఏఐ అభివృద్ధి కోసం ఏకంగా 7.7 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నాయి. ఇందులో సుమారు 6.8 ట్రిలియన్ డాలర్లు పూర్తిగా అదనపు పెట్టుబడి కిందకు వస్తాయి. అయితే ఇంత భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్న ఈ సంస్థలు ఆశించిన స్థాయిలో రాబడిని పొందగలవా అనే ప్రశ్న ఇప్పుడు మార్కెట్‌లో గట్టిగా వినిపిస్తోంది.

పెట్టుబడిపై రాబడి పడిపోయే ప్రమాదం

గతంలో సాఫ్ట్‌వేర్, సోషల్ మీడియా, ఈ-కామర్స్ రంగాల ద్వారా టెక్ కంపెనీలు భారీగా లాభాలు ఆర్జించాయి. ఆ వ్యాపారాలకు పెద్దగా భవనాలు లేదా భారీ యంత్రాలు అవసరం పడలేదు. కానీ ఏఐ కోసం భారీ డేటా కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి వస్తోంది. దీనివల్ల కంపెనీల ఆస్తుల భారం విపరీతంగా పెరుగుతోంది. ఈ మార్పు కారణంగా కంపెనీల పెట్టుబడి రాబడి సుమారు 20 నుంచి 25 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఉత్పాదకత పెరిగితే సరిపోదని, ఆ టెక్నాలజీ ద్వారా నేరుగా లాభాలు సంపాదించడం కంపెనీలకు అతిపెద్ద సవాలుగా మారుతుంది.

చరిత్ర పునరావృతం కానుందా?

గతంలో టెలికాం, డాట్‌కామ్ బూమ్ సమయంలో భారీ నెట్‌వర్క్‌లు ఏర్పాటయ్యాయి కానీ ఆశించిన స్థాయిలో కంపెనీలు నేరుగా లాభాలు అందుకోలేకపోయాయి. కేవలం ఇంటర్నెట్, ఈ-కామర్స్ సేవలు అందించే ఇతర సంస్థలే ఆ టెక్నాలజీ ద్వారా అసలైన లాభాలు చవిచూశాయి. సరిగ్గా అదే పరిస్థితి ఇప్పుడు ఏఐ రంగానికి కూడా ఎదురుకావచ్చని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. అయినప్పటికీ పాత టెలికామ్ కంపెనీలతో పోలిస్తే ప్రస్తుత టెక్ దిగ్గజాల వద్ద డబ్బు సంపాదించేందుకు అనేక ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

భారతీయ మార్కెట్‌పై ప్రభావం

ప్రపంచవ్యాప్తంగా టెక్ షేర్లలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ, భారతీయ స్టాక్ మార్కెట్ మాత్రం చాలా పటిష్టంగా నిలదొక్కుకుంటోంది. గ్లోబల్ ఏఐ ఖర్చుల ఒత్తిడి నుంచి భారత మార్కెట్ ఇప్పటివరకు సురక్షితంగా బయటపడింది. మరోవైపు డేటా సెంటర్ల నిర్వహణకు నిరంతరం అవసరమయ్యే విద్యుత్ సరఫరా రాబోయే రోజుల్లో పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. రాబోయే కాలంలో ఏఐ రంగంలో సరైన వ్యూహాలు అమలు చేసే కంపెనీలే గెలుపొందుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Next Story