AI Layoffs: ఏఐ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో తీవ్రమైన మార్పులను వేగంగా తీసుకువస్తోంది. ఆటోమేషన్ ప్రక్రియ క్రమంగా పెరుగుతున్న కొద్దీ ఉద్యోగాల కోత భయం కూడా పతాక స్థాయికి చేరుకుంటోంది. అయితే ఈ లేఆఫ్స్ ముప్పు పురుషులతో పోలిస్తే మహిళలపైనే ఎక్కువగా ఉందనే సంచలన విషయాలు అంతర్జాతీయ శ్రామిక సంస్థ(ILO) నిర్వహించిన తాజా పరిశోధనల ద్వారా వెలుగులోకి వచ్చాయి. కార్పొరేట్ ఆఫీసులలో అడ్మినిస్ట్రేషన్, క్లరికల్ అలాగే రికార్డు నిర్వహణ లాంటి రూటీన్ పనులలో శతాబ్దాలుగా మహిళల భాగస్వామ్యమే అత్యధికంగా ఉంటూ వస్తోంది. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి పనులనే ఏఐ టెక్నాలజీ ఆటోమేట్ చేస్తుండటంతో ఈ ఉద్యోగాలకు తీవ్ర ముప్పు వాటిల్లుతోంది.

అంతర్జాతీయ శ్రామిక సంస్థ నివేదిక ప్రకారం.. అధిక ఆదాయం కలిగిన సంపన్న దేశాలలో పనిచేస్తున్న ప్రతి 10 మంది మహిళలలో ఒకరు ఏఐ వల్ల తమ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు. రికార్డులు భద్రపరచడం, ఫైళ్లను నిర్వహించడం, సాధారణ సమాచారాన్ని ప్రాసెస్ చేయడం వంటి పనులలో మహిళల సంఖ్యే అత్యధికంగా ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ఫర్ విమెన్స్ పాలసీ రీసెర్చ్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం రోజువారీగా సాగే రూటీన్ పనులు, నంబర్లు సరిచూడటం, పాటర్న్స్ గుర్తించడం పైనే ఏఐ దృష్టి కేంద్రీకరించింది. విచారించదగ్గ విషయమేమిటంటే నేటికీ దాదాపు 90 శాతం సెక్రటరీ అలాగే క్లర్క్ ఉద్యోగాలలో మహిళలే కొనసాగుతున్నారు.

గతంలో వచ్చిన సాంకేతిక విప్లవాలు ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం చూపాయో చరిత్రను పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. 1940వ దశకంలో అమెరికాలో టెలిఫోన్ ఆపరేటర్ ఉద్యోగాలలో 95 శాతం వరకు మహిళలే చేసేవారు. అప్పట్లో ఈ పనులకు మంచి వేతనాలు లభించేవి. కానీ ఆటోమేటెడ్ టెలిఫోన్ స్విచింగ్ సిస్టమ్‌లు అందుబాటులోకి రావడంతో ఏకంగా 75,000 మంది టెలిఫోన్ ఆపరేటర్లు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. అనుభవజ్ఞులైన అనేకమంది మహిళలు తక్కువ జీతాలకే చిన్న పనులకు పరిమితమవ్వడం లేదా శాశ్వతంగా ఇళ్లకే పరిమితం కావడం జరిగింది. ఈ చారిత్రక పరిణామం నేటి ఏఐ యుగానికి ఒక పెద్ద హెచ్చరికగా నిలుస్తోంది.

1950 నుంచి 1980 మధ్య కాలంలో వాషింగ్ మెషీన్లు వంటి గృహోపకరణాలు రావడం వల్ల ఇంట్లో పనిచేసే సమయం తగ్గి, మహిళలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలలో చేరడానికి దోహదపడింది. ఆ తర్వాత 1980వ దశకంలో పర్సనల్ కంప్యూటర్లు, వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్లు వచ్చినప్పుడు కూడా స్టెనోగ్రాఫర్లు, టైపిస్టుల ఉద్యోగాలు తగ్గినప్పటికీ, మహిళలు కొత్త నైపుణ్యాలను నేర్చుకుని కంపెనీలలో ఉన్నత పదవులను అధిరోహించగలిగారు. అయితే ప్రస్తుతం ఏఐ అత్యంత వేగంగా సంక్లిష్టమైన ప్రొఫెషనల్ పనులలోకి ప్రవేశిస్తోంది. కొత్త ఉద్యోగాలు వస్తున్నప్పటికీ, పాత నైపుణ్యాలతోనే ఉన్న ఉద్యోగులకు తగిన రీతిలో రీ-స్కిల్లింగ్ కల్పించడం ప్రభుత్వం అలాగే కంపెనీల ముందున్న అతిపెద్ద సవాలుగా మారింది.

Next Story