Air India : పశ్చిమాసియాలో ముదురుతున్న ఇరాన్ ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి వివాదం ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో జెట్ ఫ్యూయల్ ధరలు కొండెక్కి కూర్చోవడంతో.. విమానయాన దిగ్గజం ఎయిర్ ఇండియా బుధవారం ఒక సంచలన ప్రకటన చేసింది. రాబోయే జూన్ నుంచి ఆగస్టు 2026 మధ్య కాలంలో కొన్ని ఎంపిక చేసిన దేశీయ రూట్లలో సైతం తమ విమాన సర్వీసులను తాత్కాలికంగా తగ్గించుకుంటున్నట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది. అంతకుముందే ఇంటర్నేషనల్ ఫ్లైట్లలో భారీ కోత విధించిన టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా.. ఇప్పుడు దేశీయ మార్గాల్లో కూడా విమానాల ఫ్రీక్వెన్సీని పరిమితం చేయడంతో ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది.

ఈ తాత్కాలిక మార్పులు కేవలం విమానయాన సంస్థ ఆపరేషనల్ స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి, ప్రయాణికులకు చివరి నిమిషంలో జరిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి మాత్రమేనని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. ఇరాన్ సంక్షోభం కారణంగా గల్ఫ్ దేశాల మీదుగా వెళ్లే కొన్ని వైమానిక మార్గాలపై తీవ్ర ఆంక్షలు విధించారు. దీనివల్ల విమానాలను వేరే సుదీర్ఘ మార్గాల గుండా మళ్లించాల్సి వస్తోంది. ఇలా రూట్లు మారడం వల్ల విమాన ప్రయాణ సమయం పెరగడంతో పాటు విపరీతమైన ఇంధనం ఖర్చవుతోంది. ఈ అదనపు నిర్వహణ భారాన్ని భరించలేకే సర్వీసులను కుదించాల్సి వచ్చిందని కంపెనీ యాజమాన్యం తమ ప్రకటనలో పేర్కొంది.

విమానాల రద్దు కారణంగా ఇబ్బంది పడే ప్రయాణికుల కోసం ఎయిర్ ఇండియా కొన్ని ఊరట కలిగించే ఆప్షన్లను ప్రకటించింది. రద్దయిన ఫ్లైట్ల కస్టమర్లను వీలైనంత వరకు తమ ఇతర ప్రత్యామ్నాయ విమాన సర్వీసులలో సర్దుబాటు చేయడానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంది. ఒకవేళ అది కుదరకపోతే.. ప్రయాణికులు ఎలాంటి అదనపు రుసుము (ఎక్స్‌ట్రా ఛార్జ్) చెల్లించకుండానే తమ ప్రయాణ తేదీని మార్చుకోవచ్చు. లేదా తాము బుక్ చేసుకున్న టికెట్ మొత్తాన్ని ఒక్క రూపాయి కూడా కట్ అవ్వకుండా పూర్తిగా వెనక్కి తీసుకునే బంపర్ ఆఫర్‌ను కూడా కల్పించింది. మార్కెట్ పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి రాగానే రద్దయిన అన్ని సర్వీసులను యథావిధిగా పునరుద్ధరిస్తామని సంస్థ హామీ ఇచ్చింది.

ఈ దేశీయ సర్వీసుల కోతకు కొన్ని రోజుల ముందే ఎయిర్ ఇండియా ఏకంగా 29 అంతర్జాతీయ రూట్లలో తన విమానాలను పూర్తిగా నిలిపివేసింది. ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాలకు వెళ్లే అత్యంత కీలకమైన రూట్లు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల నుండి చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో, టొరంటో, ప్యారిస్, సింగపూర్, బ్యాంకాక్, మెల్బోర్న్ వంటి ప్రపంచ ప్రసిద్ధ నగరాలను కలిపే సర్వీసులను ఎయిర్ ఇండియా తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టింది. అయితే ఈ భారీ రద్దుల తర్వాత కూడా ప్రపంచంలోని 5 ఖండాల వ్యాప్తంగా నెలకు 1,200 కంటే ఎక్కువ అంతర్జాతీయ విమానాలను విజయవంతంగా నడుపుతామని ఎయిర్ ఇండియా ధీమా వ్యక్తం చేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story