Air India : ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం.. రోజుకు 100 విమానాలు రద్దు
రోజుకు 100 విమానాలు రద్దు

Air India : ఆకాశంలో విహరించాలనుకునే ప్రయాణికులకు ఎయిర్ ఇండియా పెద్ద షాక్ ఇచ్చింది. విమాన ఇంధన ధరలు చుక్కలను తాకుతుండటంతో, సంస్థ భారీ కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఖర్చులను తగ్గించుకోవడమే లక్ష్యంగా రోజువారీ విమాన సర్వీసుల్లో ఏకంగా 100 విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం మే 1, 2026 నుంచి అమల్లోకి రావడంతో విదేశీ ప్రయాణికులపై దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది. అంతర్జాతీయ మార్కెట్లో జెట్ ఫ్యూయల్ ధరలు అమాంతం పెరిగిపోవడంతో విమానయాన సంస్థలు కుదేలవుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. అంతర్జాతీయ విమాన ఇంధన ధర ఒక్క కిలోలీటరుకు 76.55 డాలర్లు పెరిగింది. దీనివల్ల వస్తున్న అదనపు భారాన్ని భరించలేక ఎయిర్ ఇండియా తన రోజువారీ 1,100 సర్వీసుల్లో 100 విమానాలను తగ్గించుకోవాలని నిర్ణయించింది.
ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ఖర్చు ఎక్కువగా ఉండే రూట్లలో ఈ కోత ఉండనుంది. యూరప్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలకు వెళ్లే విమాన సర్వీసులను జూన్ షెడ్యూల్ నుంచి తగ్గించనున్నారు. ఢిల్లీలో విమాన ఇంధనం ధర మార్చి నెలతో పోలిస్తే రెట్టింపు కావడంతో నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఒక విమానయాన సంస్థ మొత్తం ఖర్చులో 40 శాతం కేవలం ఇంధనం కోసమే వెచ్చించాల్సి రావడం గమనార్హం.
ఎయిర్ ఇండియాకు నష్టాలు పెరగడానికి పాకిస్థాన్ గగనతలం మూసివేత కూడా ఒక ప్రధాన కారణం. దీనివల్ల యూరప్, అమెరికా వెళ్లే విమానాలు సుదీర్ఘ మార్గంలో ప్రయాణించాల్సి వస్తోంది. ఫలితంగా ఇంధన వినియోగం పెరగడమే కాకుండా, క్రూ సభ్యుల ఖర్చులు కూడా భారంగా మారాయి. ఎయిర్ ఇండియా ఇప్పటికే దాదాపు రూ.20,000 కోట్ల నష్టాల్లో ఉందని, టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఈ సంస్థను గట్టెక్కించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని సమాచారం.
ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ వంటి సంస్థల సమాఖ్య ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని పన్నులు తగ్గించకపోతే, మరిన్ని సర్వీసులు నిలిపివేయాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి దేశీయ మార్గాల్లో ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించినా, అంతర్జాతీయ విమానాలకు మాత్రం ఎలాంటి రాయితీలు లేవు. దీనివల్ల రాబోయే రోజుల్లో విమాన టికెట్ల ధరలు మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

