Airtel: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు షాక్.. దేశంలోనే నంబర్ వన్ బ్రాండ్‌గా ఎయిర్‌టెల్
నంబర్ వన్ బ్రాండ్‌గా ఎయిర్‌టెల్

Airtel: దేశంలో అత్యంత విలువైన బ్రాండ్ల జాబితాలో ఎయిర్‌టెల్ తొలిసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. కాంతార్ విడుదల చేసిన 2026 బ్రాండ్‌జెడ్ నివేదిక ప్రకారం.. ఎయిర్‌టెల్ బ్రాండ్ విలువ గత ఏడాదితో పోలిస్తే 5 శాతం పెరిగి 43.2 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో 35.6 బిలియన్ డాలర్ల విలువతో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది. 2014లో ఈ ర్యాంకింగ్స్ ప్రారంభమైన తర్వాత ఒక టెలికాం సంస్థ అగ్రస్థానానికి చేరడం ఇదే తొలిసారి. 2020 నుంచి చూస్తే ఎయిర్‌టెల్ బ్రాండ్ విలువ ఏకంగా 210 శాతం పెరిగింది. కేవలం మొబైల్ కనెక్టివిటీ సేవలకే పరిమితం కాకుండా డిజిటల్ సేవల రంగంలోనూ విస్తరించడం సంస్థకు కలిసొచ్చింది.
టాప్ 100 బ్రాండ్ల విలువలో 12 శాతం తగ్గుదల
ఎయిర్‌టెల్ అగ్రస్థానానికి చేరినప్పటికీ దేశంలోని ప్రముఖ బ్రాండ్ల మొత్తం విలువ మాత్రం తగ్గింది. భారత్‌లోని టాప్ 100 బ్రాండ్ల కలిపిన విలువ 460.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 12 శాతం తక్కువ. ఈ మొత్తం విలువ భారత జీడీపీలో సుమారు 11 శాతానికి సమానం. ముఖ్యంగా సాంకేతిక సేవలు, ఆర్థిక సేవల రంగాల్లోని కొన్ని పెద్ద సంస్థల బ్రాండ్ విలువ తగ్గడం దీనికి ప్రధాన కారణంగా నివేదిక పేర్కొంది. ఆటోమొబైల్, రిటైల్ రంగాల్లో కొన్ని బ్రాండ్లు వృద్ధి సాధించినా.. టెక్నాలజీ, ఆర్థిక సేవల రంగాల్లో వచ్చిన తగ్గుదలను అవి భర్తీ చేయలేకపోయాయి.
టాప్ 10లో ఏ సంస్థకు ఎన్నో స్థానం?
2026 జాబితాలో ఎయిర్‌టెల్ మొదటి స్థానంలో ఉండగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రెండో స్థానంలో నిలిచింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 24.1 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 23.6 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో, ఐసీఐసీఐ బ్యాంక్ 20.1 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్ ఆరో స్థానంలో, ఇన్ఫోసిస్ ఏడో స్థానంలో నిలిచాయి. ఎల్‌ఐసీ ఎనిమిదో స్థానం, ఏషియన్ పెయింట్స్ తొమ్మిదో స్థానం దక్కించుకోగా, ఫ్లిప్‌కార్ట్ పదో స్థానంలో నిలిచింది. ఆర్థిక సేవల రంగం మొత్తం టాప్ 100 బ్రాండ్ల విలువలో 29 శాతం వాటాతో అతిపెద్ద విభాగంగా కొనసాగుతోంది.
మీషో, రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్లకు భారీ వృద్ధి
ఈ ఏడాది బ్రాండ్ విలువలో అత్యధిక వృద్ధి సాధించిన సంస్థగా మీషో నిలిచింది. ఈ సంస్థ విలువ 64 శాతం పెరిగి 1.9 బిలియన్ డాలర్లకు చేరింది. జాబితాలో 59వ స్థానం దక్కించుకుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ విలువ కూడా 60 శాతం పెరిగి 3.8 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ సంస్థ 30వ స్థానంలో నిలిచింది. టీవీఎస్, ఫోన్‌పే, ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్, క్రెడ్, పేటీఎం, బజాజ్ ఆటో, ఫ్లిప్‌కార్ట్ కూడా మంచి వృద్ధి సాధించిన బ్రాండ్ల జాబితాలో ఉన్నాయి. మరోవైపు బ్లింకిట్ తొలిసారి టాప్ 100 జాబితాలోకి ప్రవేశించి 27వ స్థానాన్ని దక్కించుకుంది. దీని బ్రాండ్ విలువ 4.3 బిలియన్ డాలర్లుగా ఉంది.
ప్రపంచ బ్రాండ్ల విలువ పెరిగితే.. భారత్‌లో ఎందుకు తగ్గింది?
ప్రపంచవ్యాప్తంగా టాప్ బ్రాండ్ల మొత్తం విలువ 22 శాతం పెరిగిన సమయంలో భారత్‌లో మాత్రం తగ్గుదల కనిపించింది. అంతర్జాతీయంగా కృత్రిమ మేధ, టెక్నాలజీ వేదికల సంస్థలు భారీ వృద్ధి సాధించడం దీనికి ప్రధాన కారణం. ఈ రంగాల్లో భారత బ్రాండ్ల వాటా తక్కువగా ఉందని కాంతార్ తెలిపింది. పెరుగుతున్న ధరలు కూడా వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయని నివేదికలో పేర్కొంది. వినియోగదారులకు తమ బ్రాండ్ ఎందుకు ప్రత్యేకమో స్పష్టంగా తెలియజేసిన సంస్థలు సగటున 7 శాతం వృద్ధి సాధించగా, ఆ ప్రత్యేకతలో మార్పు లేని లేదా తగ్గిన బ్రాండ్ల విలువ 13 శాతం పడిపోయింది. ప్రపంచ టాప్ 100 బ్రాండ్ల జాబితాలో భారత్ నుంచి ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్ మాత్రమే చోటు దక్కించుకున్నాయి. జియో షేర్ మార్కెట్‌లో లిస్టింగ్ ప్రక్రియకు ముందే దాని విలువను అంచనా వేయడంతో ఈసారి జాబితాలో చేర్చలేదు.

