Airtel : కస్టమర్లకు ఎయిర్‌టెల్ షాక్..ఇక పై అన్‌లిమిటెడ్ 5G ప్లాన్స్ బెనిఫిట్స్ కట్
ఇక పై అన్‌లిమిటెడ్ 5G ప్లాన్స్ బెనిఫిట్స్ కట్

Airtel : ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ మరోసారి తమ కోట్లాది యూజర్లకు గట్టి షాక్ ఇచ్చింది. కంపెనీ తమ ప్రస్తుత ప్లాన్స్‌లో లభించే ప్రయోజనాలను తగ్గించింది. ముఖ్యంగా గత ఏడాది జూలైలో ఎయిర్‌టెల్ తీసుకువచ్చిన అన్‌లిమిటెడ్ 5G బూస్టర్ ప్యాక్స్ లో లభించే బెనిఫిట్స్‌ను ఇప్పుడు గణనీయంగా తగ్గించారు. ధర పెంచకుండానే ప్లాన్లలోని ప్రయోజనాలను తగ్గించడం ద్వారా, కంపెనీలు తమ ప్లాన్లను పరోక్షంగా ఖరీదు చేస్తున్నాయని వినియోగదారులు భావిస్తున్నారు. ఈ మార్పుల ప్రకారం ప్రస్తుతం రోజుకు 2GB లేదా అంతకంటే ఎక్కువ డేటా ఉన్న ప్లాన్ ఉన్న ఎయిర్‌టెల్ యూజర్లకు మాత్రమే అన్‌లిమిటెడ్ 5G డేటా ప్రయోజనం లభిస్తోంది. రోజుకు 1GB లేదా 1.5GB డేటా ప్లాన్స్‌ను ఉపయోగించే వారికి ఈ అప్‌గ్రేడ్ అవకాశం లేదు.
ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ 5G డేటా ప్లాన్స్‌లో రూ. 51, రూ. 101, రూ. 151 యాడ్-ఆన్ ప్యాక్‌లు ఉన్నాయి. ఈ యాడ్-ఆన్ ప్యాక్‌ల వాలిడిటీ మీ బేస్ ప్లాన్ వాలిడిటీతో సమానంగా ఉంటుంది. ఈ ప్యాక్‌ల ద్వారా లభించే అన్‌లిమిటెడ్ 5G డేటా అనేది మీ బేస్ ప్లాన్‌లో లభించే డేటాకు అదనంగా లభిస్తుంది. అయితే, ఈ డేటాను కేవలం ఎయిర్‌టెల్ 5G నెట్‌వర్క్‌లో మాత్రమే ఉపయోగించవచ్చు. తాజాగా చేసిన మార్పుల ప్రకారం.. గతంలో ఈ యాడ్-ఆన్ ప్యాక్‌లతో కంపెనీ అదనంగా అందించే హై-స్పీడ్ డేటా ఇప్పుడు భారీగా తగ్గింది.
తగ్గిన అదనపు డేటా వివరాలు పరిశీలిస్తే.. రూ. 51 ప్లాన్‌లో గతంలో 3 GB హై-స్పీడ్ డేటా లభించగా, ఇప్పుడు కేవలం 1 GB మాత్రమే లభిస్తోంది (2 GB కోత). అదేవిధంగా, రూ. 101 ప్లాన్‌లో 6 GB బదులు కేవలం 2 GB మాత్రమే (4 GB కోత), రూ. 151 ప్లాన్‌లో 9 GB బదులు కేవలం 3 GB మాత్రమే (6 GB కోత) అదనపు డేటా లభిస్తోంది. ఈ కోతలతో, ఎయిర్‌టెల్ తమ 5G సేవలను వాడుకలోకి తెచ్చే వినియోగదారుల సంఖ్యను నియంత్రించడంతో పాటు, భవిష్యత్తులో ప్లాన్ల ధరల పెంపునకు మెల్లగా శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తోంది. అర్హత ఉన్న బేస్ ప్లాన్‌లను ఉపయోగిస్తున్న వినియోగదారులకు మాత్రమే ఈ యాడ్-ఆన్ ప్యాక్‌లు కనిపిస్తాయి.

