Amazon AWS : దుబాయ్‌లో క్షిపణుల వర్షం..అమెజాన్ డేటా సెంటర్ ధ్వంసం..యుద్ధ సెగతో నిలిచిన పవర్
అమెజాన్ డేటా సెంటర్ ధ్వంసం..యుద్ధ సెగతో నిలిచిన పవర్

Amazon AWS : పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై జరుపుతున్న దాడులకు ప్రతిగా.. ఇరాన్ తన క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. తాజాగా ఈ యుద్ధ సెగ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి కూడా తాకింది. ఈ దాడుల ప్రభావంతో ప్రపంచ దిగ్గజ సంస్థ అమెజాన్‌కు చెందిన క్లౌడ్ యూనిట్ AWS డేటా సెంటర్ తీవ్రంగా దెబ్బతింది. యూఏఈలోని డేటా సెంటర్ ప్రాంగణంలోకి గుర్తుతెలియని వస్తువులు దూసుకురావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భద్రతా దృష్ట్యా ఆ సెంటర్‌కు పవర్ సప్లై నిలిపివేయాల్సి వచ్చింది.
ఈ ఘటనపై అమెజాన్ ప్రతినిధులు స్పందిస్తూ.. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో mec1-az2 అనే అవైలబిలిటీ జోన్‌పై కొన్ని వస్తువులు వచ్చి పడ్డాయని, దానివల్ల పెద్ద ఎత్తున నిప్పురవ్వలు ఎగిసిపడి మంటలు వ్యాపించాయని తెలిపారు. అయితే, ఇది ఇరాన్ జరిపిన మిసైల్ దాడి వల్లే జరిగిందా? అని అడగగా.. సంస్థ అటు ధృవీకరించలేదు, ఇటు ఖండించలేదు. ఫైర్ డిపార్ట్‌మెంట్ రంగంలోకి దిగి మంటలను ఆర్పే క్రమంలో డేటా సెంటర్‌కు విద్యుత్ సరఫరాను కట్ చేసింది. దీనివల్ల ఆ ప్రాంతంలో నెట్‌వర్క్ కనెక్టివిటీకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితి మళ్ళీ సాధారణ స్థితికి రావడానికి చాలా గంటలు పడుతుందని సంస్థ పేర్కొంది.
ఇరాన్ జరిపిన ఈ ప్రతీకార దాడులు కేవలం డేటా సెంటర్లకే పరిమితం కాలేదు. దుబాయ్‌లోని ఎయిర్‌పోర్టులు, ఓడరేవులు, జనసంచారం ఉండే నివాస ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకున్నాయి. శనివారం వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న దుబాయ్ నగరం, ఈ దాడులతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒక ఫైవ్ స్టార్ రిసార్ట్‌లో భారీగా మంటలు చెలరేగగా, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బూర్జ్ ఖలీఫాకు కూడా ముప్పు పొంచి ఉందనే వార్తలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అబుదాబి ఎయిర్‌పోర్ట్ సమీపంలో జరిగిన దాడిలో ఒక వ్యక్తి మరణించగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
అసలు ఈ డేటా సెంటర్ల పనితీరు ఏంటి? ఎందుకు ఇవి అంత ముఖ్యం? అనే విషయానికి వస్తే.. డేటా సెంటర్ అంటే వేల సంఖ్యలో సర్వర్లు, కంప్యూటింగ్ పరికరాలు, డేటా స్టోరేజీ యంత్రాలు ఉండే ఒక అత్యంత సురక్షితమైన భవనం. మనం ఇంటర్నెట్‌లో చేసే ప్రతి పని, అంటే ఫోటోలు దాచుకోవడం నుంచి అప్లికేషన్లు వాడటం వరకు అన్నీ ఈ సర్వర్ల ద్వారానే ప్రాసెస్ అవుతాయి. ఇలాంటి కీలకమైన చోట దాడులు జరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ సేవలకు అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. ప్రస్తుతం యూఏఈలో నెలకొన్న ఈ యుద్ధ వాతావరణం పర్యాటక రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది.

