అయితే ఆగిపోయాకనే వస్తుందేమో

Middle East War : మిడిల్ ఈస్ట్ ఇప్పుడు అగ్నిగుండంలా మారింది. ఫిబ్రవరి 28 నుంచి అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం రోజురోజుకూ భీకరంగా మారుతోంది. అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారన్న వార్తలతో ఇరాన్ మరింత రెచ్చిపోతోంది. ఇటు ఇజ్రాయెల్‌పై నేరుగా క్షిపణులు వదులుతూనే, అటు గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను, చమురు క్షేత్రాలను, గ్యాస్ ప్లాంట్‌లను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతోంది. ఈ యుద్ధ ప్రభావం ఇప్పుడు ఆ ప్రాంతంలోని వ్యాపార సామ్రాజ్యంపై కోలుకోలేని దెబ్బ కొట్టింది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బ్రాండ్‌లన్నీ దుకాణాలు మూసివేసి ప్రాణాలు కాపాడుకునే పనిలో పడ్డాయి.

ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ కథనం ప్రకారం.. యుద్ధం మొదలైన కేవలం 24 గంటల్లోనే గల్ఫ్ దేశాల్లోని గ్లోబల్ బ్రాండ్ మార్కెట్ కుప్పకూలింది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‎కు భారీ షాక్ తగిలింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్‌లోని అమెజాన్ డేటా సెంటర్లపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. దీంతో ఆ సంస్థ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. అబుదాబిలోని తన మెయిన్ వేర్‌హౌస్‌ను అమెజాన్ మూసివేసింది. డెలివరీలు ఆగిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. సౌదీ అరేబియా, జోర్డాన్ వంటి దేశాల్లోని తమ సిబ్బందిని ఇళ్ల నుంచి బయటకు రావద్దని అమెజాన్ ఆదేశించింది.

కేవలం ఆన్‌లైన్ వ్యాపారమే కాదు, విలాసవంతమైన లగ్జరీ బ్రాండ్ల స్టోర్లు కూడా మూతపడుతున్నాయి. వెర్సాచే, జిమ్మీ చూ, సెఫోరా వంటి దాదాపు 900 స్టోర్లను నిర్వహించే చాలహౌబ్ గ్రూప్ తన వ్యాపారాలను నిలిపివేసింది. బహ్రెయిన్‌లో వారి స్టోర్లు పూర్తిగా మూతపడగా, దుబాయ్, సౌదీలో తెరిచి ఉన్నా సిబ్బంది సంఖ్యను బాగా తగ్గించేశారు. గూచీ బ్రాండ్ యజమాని కెరింగ్ కూడా యూఏఈ, కువైట్, ఖతార్‌లలో తమ కార్యకలాపాలను తాత్కాలికంగా ఆపేసింది. ఈ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్‌వీఎంహెచ్, హెర్మేస్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు 4 నుండి 6 శాతం వరకు పడిపోయాయి.

టెక్ దిగ్గజం యాపిల్ కూడా దుబాయ్‌లోని తన స్టోర్లను గురువారం వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. స్వీడన్ ఫ్యాషన్ బ్రాండ్ హెచ్ అండ్ ఎమ్ ఇజ్రాయెల్, బహ్రెయిన్‌లలో దుకాణాలు మూసేసింది. అలాగే డెటాల్, లైజోల్ వంటి ఉత్పత్తులను తయారు చేసే రెకిట్ సంస్థ తన ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది. బహ్రెయిన్‌లోని తమ తయారీ ప్లాంట్‌ను కూడా మూసివేసి, బిజినెస్ ట్రావెల్స్‌ను రద్దు చేసింది. దుబాయ్, బహ్రెయిన్, ఒమన్ వంటి దేశాల్లోని పెద్ద మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు ఇప్పుడు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కొనుగోలుదారులు లేక, భద్రత కరువై పేరున్న బ్రాండ్లన్నీ తాళాలు వేసుకున్నాయి.

ఆకాశంలో క్షిపణులు, డ్రోన్లు తిరుగుతుండటంతో జనం ప్రాణ భయంతో వణికిపోతున్నారు. దుబాయ్‌లో ఉన్న విదేశీయులు ఎలాగైనా తమ స్వదేశాలకు వెళ్లిపోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే, ప్రజల్లో ధైర్యం నింపేందుకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వయంగా రంగంలోకి దిగారు. సోమవారం రాత్రి ఆయన అంగరక్షకులు లేకుండానే దుబాయ్ మాల్‌కు చేరుకుని, అక్కడ అందరి ముందే భోజనం చేశారు. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన ఈ చర్య ద్వారా సందేశమిచ్చారు. అయినప్పటికీ, యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియక వ్యాపార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story