Smartphone: అమెజాన్ సర్వేలో షాకింగ్ నిజాలు.. 82 శాతం మంది ఏఐ చూసే కొత్త ఫోన్ కొంటున్నారు
కొత్త ఫోన్ కొంటున్నారు

Smartphone: భారత స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల ఆలోచనా విధానంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. కేవలం మెగాపిక్సల్స్, రామ్ ఆధారంగా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు చూసే కస్టమర్లు ఫోన్లు కొనుగోలు చేస్తున్నారు. అమెజాన్ ఇండియా నిర్వహించిన బెస్ట్ ఇన్ టెక్ సర్వేలో ఏకంగా 82 శాతం మంది ఏఐకే ప్రాధాన్యమిస్తున్నారని సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
ఏఐ మోజులో కస్టమర్లు.. ఏ ఫీచర్‌కు డిమాండ్ ఎక్కువ?
జూలై 2026లో 40 వేల మందికి పైగా వినియోగదారులపై నిర్వహించిన ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. వినియోగదారులకు రోజువారీ పనుల్లో ఉపయోగపడే కాంటెక్స్ట్ ఆధారిత ఫీచర్లు ఎక్కువగా కావాలి. స్క్రీన్‌పై సమాచారాన్ని వెతకడం, మెసేజ్‌లకు జవాబులు సూచించడం వంటి కాంటెక్స్చువల్ అసిస్టెన్స్ ఫీచర్లను 25 శాతం మంది ఇష్టపడుతున్నారు. జనరేటివ్ ఫోటో ఎడిటింగ్‌ను 18 శాతం మంది, విజువల్ సెర్చ్‌ను 17 శాతం మంది కోరుకుంటున్నారు. ఫోన్ ఛార్జింగ్‌ను ఆదా చేసే అడాప్టివ్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ ఫీచర్‌కు 11 శాతం మంది ఓటేశారు.
పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్‌కే ఫస్ట్ ప్రయారిటీ
ఏఐ ఫీచర్ల క్రేజ్ పెరిగినప్పటికీ, ఫోన్ ప్రాథమిక పనితీరు ప్రాధాన్యత తగ్గలేదు. సర్వేలో పాల్గొన్న వారిలో 87 శాతం మంది ఫోన్ వేగం, పర్ఫార్మెన్స్ అత్యంత కీలకమని స్పష్టం చేశారు. 79 శాతం మంది బ్యాటరీ బ్యాకప్‌కు ప్రాధాన్యమిస్తుండగా, 77 శాతం మంది కెమెరా క్వాలిటీని చూస్తున్నారు. ప్రస్తుతం వాడుతున్న ఫోన్లలో బ్యాటరీ త్వరగా అయిపోవడమే తమ అతిపెద్ద సమస్యని 22 శాతం మంది వాపోయారు. బ్యాటరీ తర్వాత కెమెరా, ఫోన్ హ్యాంగ్ అవ్వడంపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి.
ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై పెరిగిన మోజు
ప్రస్తుతం ప్రతీ ముగ్గురిలో ఒకరు తమ తదుపరి ఫోన్ కోసం రూ.50,000 కంటే ఎక్కువ ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. రూ.25,000 నుంచి రూ.50,000 బడ్జెట్ విభాగం అత్యంత ప్రజాదరణ పొందింది, ఏకంగా 42 శాతం మంది ఈ కేటగిరీపై ఆసక్తి చూపుతున్నారు. రూ.50,000 నుంచి రూ.75,000 బడ్జెట్‌లో 15 శాతం మంది, రూ.5,000 పైబడిన ప్రీమియం ఫోన్లను 17 శాతం మంది కొనుగోలు చేయాలనుకుంటున్నారు. రూ.15,000 కంటే తక్కువ ధరకు లభించే ఫోన్లను కొనేందుకు కేవలం 7 శాతం మంది మాత్రమే మొగ్గు చూపుతున్నారు.
చిన్న పట్టణాల్లో ఊపందుకున్న ఖరీదైన ఫోన్ల అమ్మకాలు
వినియోగదారులు ఒకసారి కొన్న మొబైల్‌ను ఎక్కువ కాలం ఉపయోగిస్తున్నారు. 54 శాతం మంది రెండు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కాలం తమ వద్ద ఉన్న ఫోన్‌నే వాడుతున్నారు. ఆసక్తికరమైన అంశం ఏంటంటే, టైర్-2, టైర్-3 నగరాల్లో రూ.75,000 కంటే ఎక్కువ విలువైన ఫోన్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. మెట్రో నగరాల్లో 18 శాతం మంది ఖరీదైన ఫోన్లను కొనుగోలు చేస్తుంటే, ద్వితీయ శ్రేణి నగరాల నుంచి 17 శాతం, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి 15 శాతం మంది లగ్జరీ ఫోన్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

