Amazon Layoffs : అమెజాన్‌లో మళ్లీ భారీ తొలగింపులు.. భారత్‌లో 1000 మందికి షాక్
భారత్‌లో 1000 మందికి షాక్

Amazon Layoffs : ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్, టెక్నాలజీ దిగ్గజాలలో ఒకటైన అమెజాన్ మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రకటించిన 14,000 ఉద్యోగుల తొలగింపులో భాగంగా భారతదేశంలో కూడా సుమారు 800 నుంచి 1,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ తొలగింపునకు ప్రధాన కారణం కృత్రిమ మేధస్సు (AI) వినియోగాన్ని పెంచడం ద్వారా సంస్థలో ఖర్చు తగ్గించుకోవడం, సామర్థ్యాన్ని పెంచడం అని తెలుస్తోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీలలో ఒకటైన అమెజాన్, తన అంతర్జాతీయ కోతల్లో భాగంగా భారతదేశంలోనూ ఉద్యోగులను తగ్గించాలని నిర్ణయించింది. గ్లోబల్ స్థాయిలో ప్రకటించిన 14,000 మంది ఉద్యోగుల తొలగింపులో భారతదేశంలో సుమారు 800 నుంచి 1,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. AI టెక్నాలజీని వేగంగా ఉపయోగించడం ద్వారా పనిలో సామర్థ్యాన్ని పెంచాలని, ఖర్చులను తగ్గించుకోవాలని అమెజాన్ లక్ష్యంగా పెట్టుకుంది.
భారతదేశంలో జరగబోయే ఈ తొలగింపులు కార్పొరేట్ విభాగాలపై ప్రభావం చూపనున్నాయి. ఫైనాన్స్, మార్కెటింగ్, మానవ వనరులు, టెక్ విభాగాలలో పనిచేసే ఉద్యోగులు ఎక్కువగా ఈ ప్రభావానికి లోనవుతారు. ముఖ్యంగా అమెజాన్ అంతర్జాతీయ యూనిట్లకు నేరుగా రిపోర్ట్ చేసే బృందాలలో ఈ కోతలు ఎక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది.
సీటెల్‌లో ఉన్న అమెజాన్ మెయిన్ ఆఫీసు నుంచి సంస్థ సీఈఓ ఆండీ జెస్సీ ఉద్యోగులకు అంతకుముందే ఒక మెయిల్ పంపారు. సంస్థలోని అనవసరమైన లెవల్స్ తగ్గించడం, ఓనర్ షిప్ పెంచడం, ఆఫీసర్లను తగ్గించడం వంటి లక్ష్యాలపై కంపెనీ దృష్టి సారించిందని ఆయన ఆ నోట్‌లో పేర్కొన్నారు. ఈ విధానం ప్రకారమే తాజా తొలగింపుల ప్రక్రియ మొదలుపెట్టబడింది. అమెజాన్ భారతదేశంలో ఉద్యోగులను తొలగించడం ఇది మొదటిసారి కాదు. 2023లో కూడా ప్రపంచవ్యాప్తంగా జరిగిన 9,000 మంది ఉద్యోగుల తొలగింపులో భాగంగా, అమెజాన్ భారతదేశంలో 500 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది.
ఇటీవలి సంవత్సరాలలో అమెజాన్ ఇండియా ఆదాయం పెరిగినా, కోవిడ్ తర్వాత వృద్ధి నెమ్మదించింది. అయితే, ఉద్యోగుల ఖర్చు, మార్కెటింగ్ ఖర్చులు తగ్గించడం వల్ల ఫైనాన్స్ సంవత్సరం 2025లో సంస్థ నష్టాలు తగ్గాయని అమెజాన్ సెల్లర్ సర్వీసెస్, అమెజాన్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ వంటి ప్రధాన యూనిట్లు ప్రకటించాయి. ఖర్చులు తగ్గిస్తున్నప్పటికీ, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్ వంటి కంపెనీల నుంచి తీవ్ర పోటీ ఉన్న క్విక్ కామర్స్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో మాత్రం పెట్టుబడులు కొనసాగిస్తామని అమెజాన్ స్పష్టం చేసింది.

