Amazon Layoff : ఉద్యోగాలు ఇచ్చే వారికే షాక్.. హెచ్ఆర్ విభాగంలో భారీ కోతలకు సిద్ధమైన అమెజాన్
హెచ్ఆర్ విభాగంలో భారీ కోతలకు సిద్ధమైన అమెజాన్

Amazon Layoff : ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థలలో ఒకటైన అమెజాన్ మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమవుతోంది. ఈసారి ఏకంగా ఉద్యోగాలు ఇప్పించే హ్యూమన్ రిసోర్స్ విభాగంపై వేటు పడనుంది. అమెజాన్ తన హెచ్ఆర్ విభాగంలో దాదాపు 15 శాతం మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. ముఖ్యంగా పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ టీమ్ పైనా ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ దీపావళి పండుగ ముందు ఈ వార్త ఆ ఉద్యోగులకు పెద్ద షాక్‌గా మారనుంది.
ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ హెచ్ఆర్ విభాగంలో 10,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 15 శాతం మందిని తొలగించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. అయితే, ఈ తొలగింపులు హెచ్ఆర్ విభాగంలోనే కాకుండా, ఇతర విభాగాలలో కూడా ఉండే అవకాశం ఉంది. ఈ తొలగింపుల వార్త... కంపెనీ రాబోయే పండుగ సీజన్ కోసం అమెరికా ఫుల్‌ఫిల్‌మెంట్, ట్రాన్స్‌పోర్టేషన్ నెట్‌వర్క్‌లో 2,50,000 మంది ఉద్యోగులను నియమించుకుంటామని ప్రకటించిన వెంటనే రావడం గమనార్హం.
ప్రపంచంలోని అనేక పెద్ద కంపెనీల మాదిరిగానే, అమెజాన్ కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున లేఆఫ్స్ దశను ఎదుర్కొంటోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఇటీవలే అమెజాన్ వండరీ పాడ్‌కాస్ట్ విభాగంలో దాదాపు 110 మందిని తొలగించారు. వండరీ డివిజన్‌లో సీఈఓ కూడా తన ఉద్యోగాన్ని విడిచిపెట్టడం ఈ మార్పుల తీవ్రతను తెలియజేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిధి పెరుగుతున్న కొద్దీ, కంపెనీలు తమ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకునే పనిలో ఉన్నాయి. అమెజాన్ కూడా దీనికి మినహాయింపు కాదు. ఏఐ వినియోగాన్ని పెంచేందుకు కంపెనీ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఈ ఏడాది క్లౌడ్, డేటా సెంటర్ల నిర్మాణం కోసం దాదాపు 100 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని అమెజాన్ ప్లాన్ చేస్తోంది. ఈ మార్పుల మధ్య ఉద్యోగుల తొలగింపులు వేగంగా జరుగుతున్నాయి. 2022 చివరి నుంచి 2023 మధ్యలోనే సుమారు 27,000 మంది ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది.
