Donald Trump : భారత్ కాదు అమెరికాదే డెడ్ ఎకానమీ.. అమెరికన్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు!
అమెరికన్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు!

Donald Trump : ఒకప్పుడు భారత్‌ను డెడ్ ఎకానమీ అని అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కానీ, ఇప్పుడు అమెరికన్ డాలర్‌కే ప్రమాదం ముంచుకొస్తోందని ఒక అమెరికన్ ఆర్థికవేత్త హెచ్చరించారు. అమెరికన్ ఆర్థికవేత్త జెరాల్డ్ సెలెంటే ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా వంటి దేశాలు ఆర్థికంగా బలంగా మారుతున్నాయని, దీనివల్ల అమెరికా డాలర్ తన ప్రాముఖ్యతను కోల్పోతోందని ఆయన అన్నారు. క్యూబా-అమెరికన్ జర్నలిస్ట్ రిక్ సాంచెజ్‌తో ఒక పాడ్‌కాస్ట్‌లో జెరాల్డ్ సెలెంటే మాట్లాడుతూ.. భారత్ ఇప్పుడు స్వయం సమృద్ధిగా మారుతోందని ప్రశంసించారు. రష్యా నుండి చమురు కొనే భారత్ నిర్ణయం సరైనదే. భారత్ ఇప్పుడు తన ఉత్పత్తులను తానే తయారు చేసుకుని, కొనుగోలు చేస్తోంది. ఇది గతంలో అమెరికాలో జరిగినట్టే ఉంది అని ఆయన అన్నారు. అలాగే, భారత్, బ్రెజిల్ వంటి దేశాలపై రష్యా నుంచి చమురు కొన్నందుకు అమెరికా 50% టారిఫ్ విధించింది. దీంతో వాషింగ్టన్, బ్రిక్స్ దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగింది.
అమెరికా తన ప్రపంచ ఆర్థిక శక్తిని కోల్పోతోందని సెలెంటే అభిప్రాయపడ్డారు. “గతంలో చైనాకు భారీ పరిశ్రమలు లేదా హై-టెక్ సామర్థ్యం లేదు. కానీ, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వంటి రంగాల్లో అది ప్రపంచ నాయకుడిగా ఉంది. దీని అర్థం, వారు కూడా స్వయం సమృద్ధిగా మారుతున్నారు” అని ఆయన అన్నారు. ఇతర దేశాల ఆర్థిక నిర్ణయాల్లో అమెరికా ఎందుకు జోక్యం చేసుకుంటుంది.. అసలు ఇతరులకు చెప్పే హక్కు అమెరికాకు లేదన్నారు.
అమెరికన్ డాలర్ భవిష్యత్తు ప్రమాదంలో ఉందని సెలెంటే హెచ్చరించారు. దీనిని ఆయన డాలర్ డెడ్ గా అభివర్ణించారు. 2018లో ట్రంప్ హయాంలో వడ్డీ రేట్లను తగ్గించడం కూడా దీనికి ఒక కారణమని ఆయన అన్నారు. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనమవుతోందని, డాలర్ పతనం కూడా మొదలైందని తెలిపారు. బ్రిక్స్ దేశాలు కూడా అమెరికన్ డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ వంటి పాశ్చాత్య సంస్థలపై ఆధారపడకుండా ఒక కొత్త ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని వారు చూస్తున్నారు. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో అమెరికన్ డాలర్‌కు పెద్ద సవాలుగా మారనున్నాయని సెలెంటే చెప్పారు.
