Amitabh Bachchan : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గత కొన్ని సంవత్సరాలుగా ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో వరుసగా భూములు కొనుగోలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఈ భూముల కొనుగోలు వెనుక జరిగిన ఒక అత్యంత ఆసక్తికరమైన సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా(HoABL) వ్యవస్థాపకుడు, చైర్మన్ అభినందన్ లోధా.. బిగ్ బీ అయోధ్య ల్యాండ్ డీల్‌కు సంబంధించిన ఒక క్రేజీ విషయాన్ని పంచుకున్నారు. 2023వ సంవత్సరంలో అమితాబ్ బచ్చన్ తనకు అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఫోన్ చేసి, అయోధ్యలో స్థలం కొనాలనే తన కోరికను బయటపెట్టారని, ఆ మరుసటి రోజే ఏకంగా 15 కోట్ల రూపాయలను అడ్వాన్స్‌గా బదిలీ చేశారని లోధా వెల్లడించారు.

ఆస్ట్రేలియాలో ఉంటే అమితాబ్ నుంచి మిస్డ్ కాల్స్

ఇటీవల జరిగిన హిందుస్థాన్ టైమ్స్ ఇండియా నెక్స్ట్ రియల్ ఎస్టేట్ సమిట్ 2026 వేదికగా అభినందన్ లోధా ఈ ఆసక్తికరమైన కథనాన్ని అందరితో పంచుకున్నారు. ఆ సమయం నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. “ఆ రోజుల్లో నేను ఒక పనిమీద ఆస్ట్రేలియాలో ఉన్నాను. అక్కడ తెల్లవారుజామున నా మొబైల్ చూసుకుంటే అమితాబ్ బచ్చన్ గారి పేరుతో కొన్ని మిస్డ్ కాల్స్, ఒక మెసేజ్ ఉన్నాయి. ఆ మెసేజ్‌లో ‘నేను అమితాబ్ బచ్చన్‌ను మాట్లాడుతున్నాను, మీకు సమయం దొరికినప్పుడు నాకు తిరిగి కాల్ చేయండి’ అని రాసి ఉంది. బాలీవుడ్ సూపర్ స్టార్ నుంచి అలాంటి మెసేజ్ చూసేసరికి నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆయనకు రిటర్న్ కాల్ చేశాను” అని లోధా వివరించారు.

ఉత్తరప్రదేశ్ బిడ్డగా అయోధ్యలో సొంత స్థలం

ఆ ఫోన్ కాల్ సంభాషణలో అమితాబ్ బచ్చన్ తన మనసులోని మాటను లోధాతో పంచుకున్నారు. తాను పుట్టి పెరిగింది ఉత్తరప్రదేశ్ లోనే కాబట్టి, ఆ బంధంతో అయోధ్యలో తనకంటూ కొంత సొంత స్థలం ఉండాలని బలంగా కోరుకుంటున్నట్లు బిగ్ బీ చెప్పారు. దాంతో లోధా స్పందిస్తూ.. ఖచ్చితంగా మీకోసం మంచి స్థలాన్ని చూస్తానని నమ్మకం ఇచ్చారు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ నేరుగా ఆ భూమి ధర ఎంత ఉంటుందని అడిగారు. మొదట అంత పెద్ద నటుడికి రేటు చెప్పడానికి లోధా కాస్త సంకోచించినప్పటికీ, అమితాబ్ దాదాపు 15,000 చదరపు అడుగుల ప్లాట్ కావాలని అడగడంతో, దాని అంచనా ధర సుమారు 15 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ, అమితాబ్ బచ్చన్ ఎలాంటి బేరసారాలు ఆడకుండా మరుసటి రోజే పూర్తి మొత్తాన్ని లోధా కంపెనీకి బదిలీ చేసేశారు.

అయోధ్యలో అమితాబ్ బచ్చన్ కోట్లాది రూపాయల పెట్టుబడులు

అయోధ్యలో అమితాబ్ బచ్చన్ కేవలం ఆ ఒక్క ప్లాట్‌తోనే ఆగకుండా, గడిచిన మూడేళ్లలో తన పెట్టుబడులను భారీగా పెంచుకుంటూ పోయారు. లేటెస్ట్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. ఈ ఏడాది (మార్చి 2026)లో కూడా ఆయన ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా సంస్థ నుంచి సుమారు 35 కోట్ల రూపాయల విలువైన 2.67 ఎకరాల భారీ భూమిని కొనుగోలు చేశారు. అయోధ్యలో అమితాబ్‌కు ఇది మూడవ పెట్టుబడి కాగా, లోధా సంస్థతో నాలుగవ ప్లాట్ ఒప్పందం కావడం విశేషం. ఈ ల్యాండ్ వారి ప్రతిష్టాత్మక ది సరయూ ప్రాజెక్ట్ సమీపంలోనే ఉంది. అంతకుముందు మే 2025లో రూ.40 కోట్లతో 25,000 చదరపు అడుగుల ప్లాట్‌ను, అలాగే 2024లో రూ.14.5 కోట్లతో 10,000 చదరపు అడుగుల ప్లాట్‌ను అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేశారు.

భవిష్యత్ తరాల కోసమే బిగ్ బీ ఇన్వెస్ట్‌మెంట్స్

అమితాబ్ బచ్చన్ అయోధ్యలో ఇంతలా ల్యాండ్స్ కొనడం వెనుక ఉన్న వ్యూహాన్ని అభినందన్ లోధా విశ్లేషించారు. బిగ్ బీ ఇక్కడ కొంటున్న భూములను కేవలం సాధారణ పెట్టుబడిగా కాకుండా, రాబోయే తమ భవిష్యత్ తరాల కోసం ఒక బలమైన ఆస్తిగా భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అయోధ్య నగరంలో ప్రభుత్వం మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తోంది. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల నుంచి భారీగా పెట్టుబడులు వస్తుండటంతో, దీర్ఘకాలిక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన, లాభదాయకమైన నగరాల్లో అయోధ్య అగ్రస్థానంలో నిలుస్తోందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story