Milk Price: నిత్యావసర వస్తువుల ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్య ప్రజలకు ప్రముఖ డెయిరీ సంస్థలు మరోసారి గట్టి షాక్ ఇచ్చాయి. మదర్ డెయిరీ పాల ధరలను పెంచిన వెంటనే, దేశీయ దిగ్గజ సంస్థ అమూల్ కూడా అదే బాటలో నడుస్తూ రేట్లను భారీగా పెంచింది. నవంబర్ 12, 2026 నుంచి అమల్లోకి వచ్చేలా తాజా పౌచ్ పాల ధరలపై 4 నుంచి 5 శాతం మేర పెంపును ప్రకటించింది. అమూల్ లీటరుకు రూ.2 నుంచి రూ.4 వరకు పెంచగా, మదర్ డెయిరీ రూ.2 నుంచి ఏకంగా రూ.6 వరకు ధరలను సవరించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై అదనపు భారం పడనుంది.

అమూల్ పాల కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?

గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) వెల్లడించిన వివరాల ప్రకారం, వినియోగదారులు ఎక్కువగా వాడే అమూల్ తాజా (టోన్డ్ మిల్క్) లీటరుపై రూ.2 పెరిగింది. అలాగే అత్యధిక డిమాండ్ ఉండే అమూల్ గోల్డ్ (ఫుల్ క్రీమ్ మిల్క్) లీటరుపై రూ.4 మేర ధర పెంచారు. పశువుల దాణా, ప్యాకేజింగ్ సామగ్రి, రవాణా ఇంధన ఖర్చులు విపరీతంగా పెరగడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని సంస్థ పేర్కొంది. వినియోగదారుల నుంచి వచ్చే ఆదాయంలో 80 శాతం వాటాను తిరిగి 36 లక్షల మంది పాడి రైతులకే అందిస్తున్నామని, పెరిగిన ధరల వల్ల రైతులకు మరింత గిట్టుబాటు ధర లభిస్తుందని ఫెడరేషన్ స్పష్టం చేసింది.

మదర్ డెయిరీలో లీటరుకు రూ.6 వరకు పెంపు

అటు ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో మదర్ డెయిరీ కూడా అన్ని రకాల పాల ధరలను సవరించింది. వెండింగ్ మెషిన్ల ద్వారా విక్రయించే టోన్డ్ మిల్క్ లీటరు రూ. 58 నుంచి రూ. 60కి చేరింది. ప్యాకెట్ టోన్డ్ మిల్క్ రూ.62కు, డబుల్ టోన్డ్ మిల్క్ రూ.56కు పెరిగింది. ఫుల్ క్రీమ్ ప్యాకెట్ పాల ధర రూ.72 నుంచి రూ.76కు ఎగబాకగా, ఆవు పాల ధర రూ.62 నుంచి రూ.65కి చేరుకుంది. అత్యధికంగా 6.5 శాతం ఫ్యాట్ ఉండే గేదె ఫుల్ క్రీమ్ పాలపై ఏకంగా రూ.6 పెంచడంతో లీటరు ధర రూ.80 నుంచి రూ.86కు చేరి వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది.

పాల ఉత్పత్తి సీజన్‌లోనూ ధరలు ఎందుకు పెరిగాయి?

సాధారణంగా చలికాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో పాల ఉత్పత్తి బాగా ఉండి ధరలు స్థిరంగా ఉంటాయి. కానీ ఈ ఏడాది డెయిరీ రంగంలో సరఫరా కొరత స్పష్టంగా కనిపిస్తోంది. పాల సేకరణ తగ్గడంతో గత కొన్ని నెలలుగా మిల్క్ ఫ్యాట్ ధరలు 20 నుంచి 25 శాతం వరకు పెరిగాయి. పాడి రైతులను ప్రోత్సహించేందుకు అమూల్ సంస్థ మిల్క్ ఫ్యాట్ కొనుగోలు ధరను కిలోకు రూ.1,000కి పెంచింది. దీనివల్ల రైతులకు లీటరుకు రూ.60 కంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. ఫలితంగా పాల ప్రాసెసింగ్ ఖర్చులు తడిసిమోపెడవడంతో కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపై మోపక తప్పలేదు.

Next Story