Anant Ambani : రిలయన్స్ బోర్డులో మార్పులు.. అనంత్ అంబానీకి కీలక బాధ్యతలు.. జీతం రూ.20కోట్లు పైనే
జీతం రూ.20కోట్లు పైనే

Anant Ambani : సాధారణంగా ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లలు ఇప్పటికే కంపెనీలో సెట్ అయ్యారు. అయితే, ఇప్పటివరకు వారందరూ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా మాత్రమే ఉన్నారు. కానీ, ఇప్పుడు ముఖేష్ అంబానీ తన చిన్న కొడుకు అనంత్ అంబానీ పై పూర్తి నమ్మకం ఉంచి, ఆయన్ను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించారు. ఈ పదవిలోకి వచ్చిన తర్వాత అనంత్ అంబానీకి ఏకంగా 10 కోట్ల నుండి 20 కోట్ల రూపాయల వార్షిక జీతం లభిస్తుంది. కానీ, ఆకాష్, ఈషాలకు ఈ స్థాయిలో ప్యాకేజీ లభించదు.
ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లల్లో చిన్నవాడైన అనంత్ అంబానీని ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించారు. దీనితో ఆయనకు సంవత్సరానికి 10 కోట్ల నుండి 20 కోట్ల రూపాయల జీతం, కంపెనీ లాభాలపై కమిషన్, అనేక ఇతర అలవెన్సులు లభిస్తాయి. గత 2023లో దేశంలోని అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లలు కవలలైన ఆకాష్, ఈషా, అనంత్ అందరూ రిలయన్స్ బోర్డులో చేరారు. అప్పుడు వారు నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉన్నారు.
అయితే, ఈ ఏడాది ఏప్రిల్‌లో చిన్నవాడైన అనంత్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించారు. నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉన్నప్పుడు, ఈ ముగ్గురికీ ఎలాంటి జీతం లేదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఒక్కొక్కరికి రూ.4లక్షల ఫీజు, రూ.97 లక్షల లాభాలపై కమిషన్ ఇచ్చారు. కానీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో, 30 ఏళ్ల అనంత్‌కు ఇప్పుడు జీతంతో పాటు ఇతర ముఖ్యమైన సదుపాయాలు కూడా లభిస్తాయి.
ఈ నియామకానికి షేర్‌హోల్డర్ల ఆమోదం కోసం పోస్టల్ బ్యాలెట్ ద్వారా అనుమతి కోరనున్నట్లు రిలయన్స్ ఆదివారం స్టాక్ మార్కెట్‌కు పంపిన నోటీసులో తెలిపింది. 2023లో జరిగిన ఈ నియామకాలు భారతదేశంలోనే అత్యంత విలువైన కంపెనీ వారసత్వ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. 2002లో ముఖేష్ అంబానీ తండ్రి మరణం తర్వాత సోదరుల మధ్య తలెత్తిన సమస్యలను నివారించడానికి, ముఖేష్ అంబానీ ముందుగానే ఈ ఏర్పాట్లు చేస్తున్నారని చాలామంది భావించారు.
ఈషా అంబానీ రిలయన్స్ రిటైల్ బోర్డులో ఉన్నారు. ఇటీవల ప్రారంభించిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లో కూడా ఆమె చేరారు. ఆకాష్ అంబానీ టెలికాం వ్యాపారానికి అధిపతిగా ఉన్నారు. అనంత్ అంబానీ మాత్రం మెటీరియల్స్, పునరుత్పాదక శక్తి విభాగానికి సంబంధించిన పనులను చూసుకుంటున్నారు. ముకేష్ అంబానీ ఆగస్టు 2023లో తన ముగ్గురు పిల్లలను కంపెనీ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా చేర్చినట్లు ప్రకటించారు.
