HDFC Bank: 30 ఏళ్ల చరిత్రలో మొదటిసారి.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పగ్గాలు చేపట్టిన బయటి వ్యక్తి
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పగ్గాలు చేపట్టిన బయటి వ్యక్తి

HDFC Bank: దేశీయ బ్యాంకింగ్ రంగంలో దిగ్గజ ప్రైవేట్ ల్యాండర్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త సారథిని ఎంచుకుంది. ఆ బ్యాంక్ నూతన మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా అనూప్ బాగ్చీ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. నిన్నటి వరకు ఆ పదవిలో ఉన్న శశిధర్ జగదీశన్ తన పదవీకాలాన్ని పూర్తి చేసుకుని సోమవారం తప్పుకోవడంతో ఆయన స్థానంలో అనూప్ బాగ్చీ పగ్గాలు చేపట్టారని బ్యాంక్ వర్గాలు స్టాక్ ఎక్స్ఛేంజ్లకు వెల్లడించాయి.
30 ఏళ్ల చరిత్రలో తొలిసారి
బ్యాంకింగ్ రంగంలో దాదాపు 30 ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ను నడిపించేందుకు ఒక బయటి వ్యక్తికి బాధ్యతలు అప్పగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఐసీఐసీఐ గ్రూప్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం అనూప్ బాగ్చీకి ఉంది. గతంలో ఆయన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్‌కు ఎమ్డీ, సీఈఓగా సేవలు అందించారు. కోర్ ఇన్కమ్ వృద్ధి, మార్జిన్లతో కూడిన సవాళ్లను బ్యాంక్ ఎదుర్కొంటున్న తరుణంలో ఆయన బాధ్యతలు స్వీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
స్టేక్హోల్డర్లతో వరుస సమావేశాలు
పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం జరిగిన అసిస్టెంట్ ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా బాగ్చీ మాట్లాడారు. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీతో 2023లో జరిగిన విలీన ప్రక్రియకు సంబంధించి కొన్ని పనులు ఇంకా బకాయి ఉన్నాయని చెప్పారు. బ్యాంక్ కార్యకలాపాలను, ప్రణాళికలను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ప్రతీ భాగస్వామితో, బోర్డు సభ్యులతో సమావేశం కానున్నట్లు వెల్లడించారు. బ్యాంక్ లోపల ఉన్న నమ్మకమైన, సమర్థవంతమైన నాయకత్వ బృందాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు.
కార్పొరేట్ గవర్నెన్స్ వివాదాలు
కొంతకాలంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలపై పలు విమర్శలు వచ్చాయి. డిపాజిటర్లకు కార్డ్ రేట్ కంటే ఎక్కువ ఇస్తూ వేరే కేటగిరీ కింద చూపించడంపై గత సీఈఓపై జరిమానా కూడా పడింది. మార్చి నెలలో నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అతాను చక్రవర్తి అకస్మాత్తుగా రాజీనామా చేశారు. అయినప్పటికీ, గతంలో పనిచేసిన శశిధర్ జగదీశన్ అందించిన అద్భుతమైన సేవలను, విలీన ప్రక్రియను విజయవంతంగా నడిపించిన తీరును బోర్డు సభ్యులు మనస్ఫూర్తిగా కొనియాడారు.

