Mallu Bhatti Vikramarka : ఏపీహెచ్ఎమ్ఈఎల్ సంస్ధ ప్రపంచంతో పోటీపడాలి
సింగరేణి అనుబంధ సంస్థను సందర్శించిన తెలంగాణ డిప్యూటీ సీయం భట్టి విక్రమార్క

- సంస్థ అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం
- ఇబ్రహీంపట్నంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
ప్రపంచంతో పోటీ పడే స్థాయికి APHMEL (ఆంధ్ర ప్రదేశ్ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్) ఎదగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పట్టణానికి సమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నంలోని సింగరేణి అనుబంధ సంస్థ APHMEL ను సింగరేణి సిఎండి బలరాం తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులతో తదుపరి మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కొత్త పరిశ్రమల విడిభాగాలు తయారీ, పాత విడిభాగాలను మరమ్మతు చేసి సరఫరా చేస్తున్న ఇంజనీరింగ్ సంస్థలకు APHMEL కన్నా మించి మిషనరీ, మానవ వనరులు లేవని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సంస్థలో పనిచేసే అధికారులు, కార్మికులకు కావాల్సింది ఒక నిబద్ధత, ప్రపంచంతో పోటీ పడగలం అన్న ఆలోచన, ఉన్న వ్యవస్థను సక్రమంగా వాడుకోవడం ఎలా అన్న తపన ఉంటే చాలని, మనం కూడా ప్రపంచంతో పోటీ పడగలమని డిప్యూటీ సీఎం భరోసా కల్పించారు. ఈ సంస్థను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు త్వరలోనే ఒక కన్సల్టెన్సీ ని నియమిస్తాం వారు స్థానిక పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక ఇస్తారని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా ఏ తరహాలో ముందుకు పోవాలో ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాం అన్నారు. అధికారులు, సిబ్బంది ఎంత బాగా పనిచేస్తే అంత బాగా లాభాలు సాధిస్తాం, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, రాష్ట్రాల ప్రగతికి దోహదపడవచ్చు అని తెలిపారు. సంస్థను, ఉన్న మిషనరీని పరిశుభ్రంగా ఉంచాలి, యంత్రాలకు ఓవరాలింగ్ చేయాలి, రంగులు వేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. పనిచేసే సిబ్బంది తప్పకుండా భద్రతా చర్యలు పాటించాలని ఆదేశించారు. కార్మికుల శ్రమ, ఉన్నత ఆలోచనలతోనే ఈ పరిశ్రమ ముందుకు పోతుందని తెలిపారు. ఈ పరిశ్రమ సింగరేణి కాలరీస్ కు అవసరమైన కొత్త యంత్రాలు తయారు చేయడం, పాత యంత్రాల మరమ్మత్తు వరకే పరిమితం కాకుండా రాష్ట్రంలోనే కాదు, దేశానికి అవసరమైన ఆర్డర్స్ తీసుకొని BHEL మాదిరిగా APHMEL పనిచేస్తుందని, థర్మల్ పవర్ స్టేషన్స్ కు అవసరమైన యంత్రాలు, యంత్రాల మరమ్మత్తు చేస్తుందని, ఈ సంస్థను భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు.
