20-30 ఏళ్ల అనుభవం ఉన్నా తీసేశారు

Apple Layoffs: ప్రపంచంలోనే అత్యంత పేరున్న టెక్ కంపెనీలలో ఒకటైన యాపిల్‎లో ఉద్యోగుల తొలగింపు వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ లేఆఫ్స్ ముఖ్యంగా సేల్స్ విభాగంలో జరిగాయి. కంపెనీ ప్రతినిధి ఈ విషయాన్ని ధృవీకరిస్తూ.. తమ సేల్స్ టీమ్‌లో కొన్ని మార్పులు చేస్తున్నామని, అందుకోసం ఈ తొలగింపులు అవసరమైన చర్య అని చెప్పారు. ఎంత మందిని తీసేశారనే సంఖ్యను యాపిల్ స్పష్టం చేయనప్పటికీ, పదుల సంఖ్యలో ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది.

కంపెనీ ఈ తొలగింపుల వెనుక కారణాన్ని స్పష్టం చేసింది. వ్యాపారాన్ని మరింత మెరుగుపరచడానికి, నిర్వహణను క్రమబద్ధీకరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాపిల్ తెలిపింది. ఈ లేఆఫ్స్ నేరుగా సేల్స్ టీమ్ పై ప్రభావం చూపింది. ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగులకు 15 రోజుల ముందుగానే సమాచారం అందించారు.

ఒక వైపు యాపిల్ కంపెనీ ఆదాయం పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఇలాంటి సమయంలో తొలగింపులు జరగడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆశ్చర్యకరంగా కంపెనీ సేల్స్ టీమ్ కోసం కొత్త ఉద్యోగులను కూడా నియమించుకుంటున్నట్లు సమాచారం. తొలగించిన ఉద్యోగులలో చాలా మంది గత 20-30 ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తున్న సీనియర్లు ఉండటం గమనార్హం. అంతేకాకుండా కంపెనీ తరపున ప్రభుత్వ ఏజెన్సీలతో కలిసి పనిచేసే అకౌంట్ మేనేజర్‌లను కూడా తొలగించారు. ఈ తొలగింపులు అమెరికా షట్‌డౌన్ సమస్యలతో ముడిపడి ఉన్నాయని కొందరు విశ్లేషిస్తున్నారు.

ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగులకు యాపిల్ ఒక చిన్న అవకాశం ఇచ్చింది. తొలగించబడిన ఉద్యోగులు కంపెనీలోనే మరొక ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చని యాపిల్ తెలిపింది. అయితే ఈ లేఆఫ్స్ ఏ ఏ విభాగాలపై ప్రభావం చూపబోతోందో అనే విషయాన్ని మాత్రం కంపెనీ ఇంకా స్పష్టం చేయలేదు.

PolitEnt Media

PolitEnt Media

Next Story