Apple : ఆపిల్ లవర్స్‌కు భారీ షాక్.. మ్యాక్‌బుక్, ఐప్యాడ్ ధరలను ఒక్కసారిగా పెంచేసిన సంస్థ
ఒక్కసారిగా పెంచేసిన సంస్థ

Apple : ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఆపిల్ తన కస్టమర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారతదేశంలో కూడా తన వివిధ రకాల మ్యాక్‌బుక్, ఐప్యాడ్ మోడళ్ల ప్రారంభ ధరలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. మెమొరీ చిప్స్ తయారీ వ్యయం విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని కంపెనీ వెల్లడించింది. ఆపిల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ లో అప్‌డేట్ చేసిన కొత్త ధరల పట్టిక ప్రకారం, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్ల ధరలు వేల రూపాయల్లో పెరిగిపోయాయి.
మ్యాక్‌బుక్ ప్రో ధర రూ. 50 వేలు అదనం
ఆపిల్ తన సరికొత్త M5 సిరీస్ చిప్స్ కలిగిన మ్యాక్‌బుక్ ప్రో ధరలను దాదాపు 20 శాతం మేర పెంచింది. దీని ప్రకారం, అంతకుముందు రూ.2,49,900కు లభించిన M5 ప్రో చిప్ కలిగిన 14-ఇంచుల మ్యాక్‌బుక్ ప్రో బేసిక్ మోడల్ ధర ఇప్పుడు ఏకంగా రూ.2,99,900కి చేరుకుంది. అంటే ఈ ల్యాప్‌టాప్ కొనాలంటే కస్టమర్లు మునుపటి కంటే రూ.50,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఐప్యాడ్ ఎయిర్‌పై 41 శాతం బాదుడు
ల్యాప్‌టాప్‌ల కంటే ఐప్యాడ్ లపై ధరల ప్రభావం మరింత దారుణంగా పడింది. ముఖ్యంగా 13-ఇంచుల ఐప్యాడ్ ఎయిర్ బేసిక్ మోడల్ ధర ఏకంగా 41.22 శాతం పెరిగింది. గతంలో రూ. 84,900 కు లభించిన ఈ ఐప్యాడ్, ఇప్పుడు కొత్త ప్రైస్ టాగ్ ప్రకారం రూ.1,19,900 కి చేరింది. మ్యాక్‌బుక్ నియో, మ్యాక్‌బుక్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో వై-ఫై వంటి మోడళ్ల ధరల నిర్మాణంలో కూడా పెద్ద మార్పులు వచ్చాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నీల్ షా తెలిపారు.
ధరలు పెరగడానికి అసలు కారణం ఏంటి?
కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ ప్రస్తుతం ముడిపదార్థాల కొరతతో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని ఆపిల్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లు శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఈ ఏఐ డేటా సెంటర్ల కోసం మెమొరీ, స్టోరేజ్ చిప్స్ డిమాండ్ ఊహించని స్థాయికి చేరింది. దీనివల్ల సెమీకండక్టర్ చిప్స్ తయారు చేసే కంపెనీలు తమ ఉత్పత్తిలో ఎక్కువ భాగాన్ని ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కే సరఫరా చేస్తున్నాయి. దీనివల్ల సాధారణ ఎలక్ట్రానిక్స్ వస్తువులకు వాడే చిప్స్ కొరత ఏర్పడి ధరలు పెరిగాయి.
కస్టమర్లపై భారం వేయక తప్పలేదు
చిప్స్ సరఫరా చేసే కంపెనీల ప్రాఫిట్ మార్జిన్లు ప్రస్తుతం చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరాయి. ప్రముఖ మెమొరీ చిప్స్ తయారీ సంస్థ మైక్రాన్ తన గ్రాస్ మార్జిన్ గత ఏడాది ఉన్న 15 శాతం నుంచి ఏకంగా 86 శాతానికి పెరిగిందని వెల్లడించింది. సైబర్ మీడియా రీసెర్చ్ వీపీ ప్రభు రామ్ మాట్లాడుతూ.. "ఆపిల్ కంపెనీ సప్లై చైన్ నిర్వహణలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా గుర్తింపు పొందింది. అలాంటి కంపెనీ కూడా పెరిగిన చిప్స్ ఖర్చు భారాన్ని భరించలేక కస్టమర్లపై వేయడం చూస్తుంటే, మార్కెట్ లో ధరల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు" అని విశ్లేషించారు.
రానున్న రెండేళ్లు ఇదే పరిస్థితి
ఆపిల్ కంపెనీ గత రెండు త్రైమాసికాలుగా ఈ ధరల భారాన్ని తానే భరిస్తూ కస్టమర్లను కాపాడుకుంటూ వచ్చిందని, కానీ ఇప్పుడు పరిస్థితి చేతులు దాటిపోవడంతో ధరలు పెంచక తప్పలేదని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ లో డీరామ్ , నంద్, కంప్యూటింగ్ చిప్స్‌కు ఉన్న విపరీతమైన డిమాండ్ కారణంగా కనీసం రాబోయే రెండేళ్ల వరకు ఈ ధరలు తగ్గేలా కనిపించడం లేదు. ఈ ఏడాది చివర్లో ఆపిల్ తన డివైజ్‌లలో ఆన్-డివైస్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్న తరుణంలో ఈ ధరల పెంపు జరగడం గమనార్హం.
మార్కెట్ ప్రీమియం వైపు మళ్లుతుందా?
ధరల పెంపు వల్ల రాబోయే రోజుల్లో ఆపిల్ ప్రొడక్ట్స్ ఓవరాల్ డిమాండ్‌పై కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే, అర్జంట్‌గా పాత డివైజ్‌లను అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకునే కస్టమర్లు మాత్రం వెనకడుగు వేయరని నీల్ షా అభిప్రాయపడ్డారు. ఎక్కువ డబ్బులు పెడుతున్నప్పుడు తక్కువ కాన్ఫిగరేషన్ ఉన్న మోడల్స్ కొని రాజీపడటం కంటే, మరింత ఎక్కువ బడ్జెట్ కేటాయించి ఆపిల్ పోర్ట్‌ఫోలియోలోని అత్యంత ప్రీమియం వేరియంట్లను కొనుగోలు చేయడానికే కస్టమర్లు మొగ్గు చూపుతారని, దీనివల్ల మార్కెట్ మరింత ప్రీమియం వైపు మారుతుందని అంచనా వేస్తున్నారు.

