Apple : భారత స్టార్టప్‌లకు యాపిల్ అండ.. క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం భారీ పెట్టుబడి
క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం భారీ పెట్టుబడి

Apple : టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌పై వరాల జల్లు కురిపిస్తోంది. కేవలం ఐఫోన్ల తయారీకే పరిమితం కాకుండా, మన దేశ పర్యావరణాన్ని కాపాడేందుకు భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చింది. సుమారు రూ.100 కోట్ల భారీ నిధుల సహాయంతో దేశంలో సరికొత్త హరిత విప్లవానికి శ్రీకారం చుట్టింది. దీనివల్ల లక్షలాది ఇళ్లకు వెలుగులు రావడమే కాకుండా, చిన్న పరిశ్రమల జాతకం కూడా మారిపోనుంది. యాపిల్ సంస్థ క్లీన్‌మ్యాక్స్ అనే రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీతో జతకట్టింది. ఈ భాగస్వామ్యం ద్వారా భారత్‌లో 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పునరుత్పాదక ఇంధన వ్యవస్థను నిర్మించబోతున్నారు. దీనివల్ల ప్రతి ఏడాది సుమారు 1.5 లక్షల భారతీయ గృహాలకు అవసరమైన క్లీన్ ఎనర్జీ అందుబాటులోకి వస్తుంది. గతంలోనే యాపిల్ తన కార్యాలయాలు, స్టోర్లను పూర్తిగా సౌర విద్యుత్తుతో నడిపేలా క్లీన్‌మ్యాక్స్‌తో కలిసి ప్రాజెక్టులు చేపట్టింది. ఇప్పుడు దీనిని తన సప్లై చైన్ మొత్తానికి వర్తింపజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఆరు స్టార్టప్‌లకు మహర్దశ
కేవలం విద్యుత్ ప్రాజెక్టులే కాకుండా, క్షేత్రస్థాయిలో పర్యావరణ మార్పుల కోసం పనిచేస్తున్న ఆరు భారతీయ స్టార్టప్‌లను యాపిల్ ఎంపిక చేసుకుంది ఏక్యుమెన్ సంస్థతో కలిసి ఈ స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం, మెంటర్ షిప్, సాంకేతిక సహకారాన్ని అందించనుంది. చెత్త నిర్వహణ, సర్క్యూలర్ ఎకానమీ వంటి విభాగాల్లో పని చేస్తున్న ఈ చిన్న కంపెనీలు యాపిల్ అండతో పెద్ద సంస్థలుగా ఎదిగే అవకాశం దక్కింది. అభివృద్ధి, పర్యావరణం రెండూ కలిసి వెళ్లాలన్నదే తమ ఉద్దేశమని యాపిల్ ప్రతినిధి సారా చాండ్లర్ పేర్కొన్నారు.
2030 నాటికి కార్బన్ న్యూట్రల్ లక్ష్యం
యాపిల్ సంస్థ తన ఉత్పత్తుల తయారీలో పూర్తిగా పర్యావరణ హితమైన పద్ధతులను అనుసరించాలని భావిస్తోంది. 2030 నాటికి తన మొత్తం సరఫరా వ్యవస్థను కార్బన్ న్యూట్రల్ గా మార్చాలనేది యాపిల్ బిగ్ ప్లాన్. ఇందుకోసం టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్‌కాన్ వంటి భాగస్వాములను కూడా ప్రోత్సహిస్తోంది. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడానికి డబ్ల్యూడబ్ల్యూఎఫ్-ఇండియాతో కలిసి పనిచేస్తోంది. గోవా, కోయంబత్తూర్ వంటి నగరాల్లో వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులను మరింత విస్తరిస్తోంది.
ప్రోత్సాహం అందుకుంటున్న సామాజిక సంస్థలు
యాపిల్ ఇప్పటికే పలు సామాజిక సంస్థలను ప్రోత్సహిస్తూ వస్తోంది. రైతులకు ఉపయోగపడే సప్తకృషి, ఎలక్ట్రిక్ కోల్డ్ స్టోరేజ్ వాహనాలను తయారు చేసే యూటుహ్ ఎనర్జీ , మహిళా డ్రైవర్లను ప్రోత్సహించే మోవో ఫ్లీట్ వంటి సంస్థలకు యాపిల్ అండగా నిలిచింది. పర్యావరణ నివేదిక ప్రకారం.. 2015 నుంచి యాపిల్ ఆదాయం 78 శాతం పెరిగినప్పటికీ, పర్యావరణానికి హాని చేసే గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలను మాత్రం 60 శాతానికి పైగా తగ్గించడం విశేషం.

