iPhone : ఐఫోన్ యూజర్లకు యాపిల్ షాక్..వింటేజ్ లిస్టులోకి ఐఫోన్ 11 ప్రో
వింటేజ్ లిస్టులోకి ఐఫోన్ 11 ప్రో

iPhone : యాపిల్ ఐఫోన్ లవర్లకు ఒక ముఖ్యమైన అలర్ట్. టెక్ దిగ్గజం యాపిల్ తన వింటేజ్ ఉత్పత్తుల జాబితాను తాజాగా అప్‌డేట్ చేసింది. ఇందులో భాగంగా ఒకప్పుడు సంచలనం సృష్టించిన ఐఫోన్ మోడళ్లతో పాటు మరికొన్ని గ్యాడ్జెట్లను ఈ లిస్టులో చేర్చింది. మీ దగ్గర ఉన్న ఫోన్ కూడా ఈ జాబితాలో ఉంటే, భవిష్యత్తులో మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అసలు ఈ వింటేజ్ లిస్ట్ అంటే ఏమిటి? దీనివల్ల యూజర్లపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
యాపిల్ తన తాజా అప్‌డేట్‌లో ఐఫోన్ 11 ప్రోని వింటేజ్ జాబితాలో చేర్చింది. 2019లో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ అప్పట్లో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఒక ఊపు ఊపింది. ఇప్పుడు ఇది లేటెస్ట్ iOS 26 సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తున్నప్పటికీ, వింటేజ్ హోదాను పొందింది. ఐఫోన్ 11 ప్రోతో పాటు ఐఫోన్ 8 ప్లస్ (128GB మోడల్), యాపిల్ వాచ్ సిరీస్ 5, ఐప్యాడ్ ఎయిర్ 3, 2020 మ్యాక్‌బుక్ ఎయిర్ మోడళ్లను కూడా కంపెనీ ఈ లిస్టులో చేర్చింది.
యాపిల్ నిబంధనల ప్రకారం.. ఏదైనా ఒక ఉత్పత్తిని విక్రయించడం నిలిపివేసి 5 ఏళ్లు పూర్తయి, 7 ఏళ్ల లోపు ఉంటే దానిని వింటేజ్ కేటగిరీగా పరిగణిస్తారు. అంటే ఈ ఉత్పత్తులకు యాపిల్ స్టోర్లు, ఆథరైజ్డ్ సర్వీస్ ప్రొవైడర్ల వద్ద రిపేర్ సేవలు లభిస్తాయి, కానీ ఒక చిన్న మెలిక ఉంది. ఆ ఫోన్‌కు సంబంధించిన స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంటేనే వారు రిపేర్ చేస్తారు. ఒకవేళ విడిభాగాలు లేకపోతే, కంపెనీ చేతులెత్తేస్తుంది. అంటే మీ ఫోన్ వింటేజ్ లిస్టులో ఉందంటే, దానికి గ్యారెంటీగా సర్వీస్ దొరుకుతుందని చెప్పలేము.
మీరు ఇప్పటికీ ఐఫోన్ 11 ప్రో లేదా ఐఫోన్ 8 ప్లస్ వాడుతుంటే.. ఒకవేళ స్క్రీన్ పగిలినా లేదా బ్యాటరీ పాడైతే రిపేర్ చేయించుకోవడం మునుపటి అంత సులభం కాదు. విడిభాగాల కొరత ఉంటే కంపెనీ సర్వీస్ సెంటర్లు వాటిని తీసుకోవు. అప్పుడు మీరు స్థానిక షాపుల మీద ఆధారపడాల్సి వస్తుంది, అక్కడ నాణ్యమైన పార్ట్స్ దొరుకుతాయనే నమ్మకం ఉండదు. అందుకే ఇలాంటి ఫోన్లు వాడుతున్న వారు ఇప్పుడు వాటిని ఎక్స్ఛేంజ్ చేసుకొని కొత్త మోడళ్లకు అప్‌గ్రేడ్ అవ్వడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
యాపిల్ ఉత్పత్తుల ప్రయాణంలో వింటేజ్ తర్వాత వచ్చే స్టేజ్ అబ్సోలీట్. ఏదైనా ప్రొడక్ట్ అమ్మకాలు నిలిపివేసి 7 ఏళ్లు దాటిపోతే దానిని అబ్సోలీట్ అంటారు. ఈ లిస్టులోకి ఫోన్ వెళ్ళిందంటే, యాపిల్ అధికారికంగా ఎలాంటి హార్డ్‌వేర్ సపోర్ట్ ఇవ్వదు. కేవలం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు మాత్రమే రావచ్చు. అంటే అబ్సోలీట్ లిస్టులో ఉన్న ఫోన్ పాడైతే అది కేవలం షోపీస్ లాగా మారిపోతుందన్నమాట.

