iPhone Sales : చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఆపిల్ ఆధిపత్యం.. రికార్డు స్థాయి అమ్మకాలు
రికార్డు స్థాయి అమ్మకాలు

iPhone Sales : ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్లు చైనా మార్కెట్లో మళ్ళీ అగ్రస్థానాన్ని సంపాదించుకున్నాయి. 2025 మే నెలలో చైనాలో అమ్ముడైన మొత్తం స్మార్ట్ఫోన్లలో ఐఫోన్ మొదటి స్థానంలో నిలిచింది. ఏప్రిల్,మే నెలల్లో ఐఫోన్ల అమ్మకాలు 15 శాతం పెరిగాయి. కోవిడ్ మహమ్మారి తర్వాత ఏ రెండు నెలల వ్యవధిలోనూ ఐఫోన్ అమ్మకాలు ఇంతగా పెరగడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. ఆపిల్ కంపెనీకి అతిపెద్ద మార్కెట్ అమెరికా కాగా, దాని తర్వాత స్థానంలో చైనా ఉంది. ఈ రెండు పెద్ద మార్కెట్లలో ఏప్రిల్, మే నెలల్లో ఎక్కువ ఐఫోన్లు అమ్ముడయ్యాయి. ఈ కారణంగానే మొత్తం ఐఫోన్ అమ్మకాలు పెరిగాయి.
భారత్‌లోనూ ఐఫోన్ జోరు
మన భారతదేశం కూడా ఐఫోన్‌కు ఒక పెద్ద మార్కెట్‌గా ఎదుగుతోంది. సంవత్సరానికి సంవత్సరం భారతదేశంలో ఐఫోన్ అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. భారతదేశం, జపాన్, మధ్యప్రాచ్య దేశాల మార్కెట్లలో 2025 ఏప్రిల్, మే నెలల్లో ఐఫోన్ అమ్మకాలు 10 శాతం కంటే ఎక్కువగా ఉన్నాయి. రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్ నుండి జూన్ వరకు) ఐఫోన్ పర్ఫామెన్స్ బాగుంది. ఎప్పటిలాగే అమెరికా, చైనా మార్కెట్లు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చైనీస్ కంపెనీల నుంచి తీవ్ర పోటీ
చైనాలో ఐఫోన్‌కు అక్కడి స్థానిక స్మార్ట్‌ఫోన్ కంపెనీల నుంచి తీవ్ర పోటీ ఉంది. 2023 చివరి త్రైమాసికంలో (అక్టోబర్ నుండి డిసెంబర్) ఆపిల్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఏ త్రైమాసికంలోనూ ఆపిల్ మొదటి స్థానానికి రాలేదు. 2024 చివరి త్రైమాసికంలో హువావేతో కలిసి ఆపిల్ అగ్రస్థానాన్ని పంచుకుంది. చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఆరు, ఏడు కంపెనీల మధ్య తీవ్ర పోటీ ఉంది. హువావే, షావోమీ, ఆపిల్, ఒప్పో, వివో, హానర్ కంపెనీలు దాదాపు సమానమైన మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. వీటిలో ఆపిల్ మినహా మిగిలినవన్నీ చైనీస్ కంపెనీలే.
2025 మొదటి త్రైమాసికంలో హువావే, షావోమీ కంపెనీలు 19 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. ఆపిల్, ఒప్పో 15 శాతం వాటాను కలిగి ఉన్నాయి. వివో 14 శాతం, హానర్ 13 శాతం వాటాను కలిగి ఉన్నాయి. చైనాలో ఐఫోన్ మళ్ళీ నంబర్ 1 స్థానాన్ని దక్కించుకోవడం ఆపిల్‌కు ఒక పెద్ద విజయం. ఈ అమ్మకాల వృద్ధి భవిష్యత్తులో ఐఫోన్ మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
