Asha Bhosle Net Worth : మూగబోయిన సంగీత స్వరం.. ఆశా భోంస్లే ఆస్తులెన్నో తెలిస్తే షాకవ్వాల్సిందే
ఆశా భోంస్లే ఆస్తులెన్నో తెలిస్తే షాకవ్వాల్సిందే

Asha Bhosle Net Worth : భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. తన గానంతో దశాబ్దాల పాటు కోట్లాది మందిని అలరించిన లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే (92) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గానకోకిల లతా మంగేష్కర్ సోదరిగా పరిచయమై, తనదైన విలక్షణమైన గొంతుతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆశా తాయి మరణం సంగీత ప్రియులను శోకసంద్రంలో ముంచెత్తింది.
బాలీవుడ్ స్వర్ణ యుగంలో 50, 60, 70వ దశకాల్లో వెస్ట్రన్ మ్యూజిక్‌కు తనదైన శైలిలో ప్రాణం పోశారు ఆశా భోంస్లే. "యే మేరా దిల్ ప్యార్ కా దివానా", "పియా తూ అబ్ తో ఆజా" వంటి క్లాసిక్ హిట్స్‌తో ఆమె సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. లతా మంగేష్కర్ వంటి దిగ్గజం ఉన్న సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన యూనిక్ వాయిస్‌తో ఆమె సత్తా చాటారు. కేవలం దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వైవిధ్యమైన పాటలు, ఐటమ్ నంబర్లు పాడటంలో ఆమెకు ఆమె సాటి.
అక్కతో పోలిస్తే తక్కువ ఫీజు
ఆశా భోంస్లే ప్రస్థానం అంత సులువుగా సాగలేదు. ఆ కాలంలో లతా మంగేష్కర్ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే సింగర్‌గా ఉండేవారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. లతాజీకి ఇచ్చే ఫీజులో ఆశా భోంస్లేకు కేవలం 20 శాతం మాత్రమే దక్కేది. ఉదాహరణకు లతాజీకి ఒక పాటకు 500 రూపాయలు ఇస్తే, ఆశా భోంస్లే 100 నుంచి 150 రూపాయలకే సంతృప్తి పడాల్సి వచ్చేది. అయినప్పటికీ, ఆమె కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగారు. ఫలితంగా భారతదేశంలోని టాప్-5 సంపన్న మహిళా గాయనుల జాబితాలో ఆమె స్థానం సంపాదించుకున్నారు.
తెలివైన బిజినెస్ ఉమెన్
ఆశా భోంస్లే కేవలం సింగర్ మాత్రమే కాదు, తెలివైన వ్యాపారవేత్త కూడా. ఆమె తన వ్యాపారాన్ని అనేక దేశాలకు విస్తరించారు. దుబాయ్, అబుదాబి, బహ్రెయిన్, కువైట్ మరియు యూకే వంటి దేశాలలో ఆమెకు ఆశాస్(Asha's) పేరుతో రెస్టారెంట్ చైన్ ఉంది. ఈ బ్రాండ్ అంతర్జాతీయ స్థాయిలో ప్రీమియం ఇండియన్ వంటకాలకు చిరునామాగా మారింది. పాటల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు ఈ వ్యాపారాల ద్వారా ఆమె భారీగా సంపాదించారు.
ఆమె వదిలి వెళ్ళిన ఆస్తిపాస్తులు
మీడియా నివేదికల ప్రకారం.. ఆశా భోంస్లే నికర ఆస్తి విలువ సుమారు 100 కోట్ల రూపాయలకు పైమాటేనని అంచనా. ఈ సంపదతో ఆమె నేటి తరం సింగర్లు సునిధి చౌహాన్ వంటి వారితో పోటీపడుతున్నారు. ముంబైలోని పెడర్ రోడ్డులో ఉన్న అత్యంత ఖరీదైన ప్రభు కుంజ్ అపార్ట్‌మెంట్‌తో పాటు ముంబై, పూణేలలో ఆమెకు స్థిరాస్తులు ఉన్నాయి. అయితే, ఈ భౌతిక సంపద కంటే ఆమె 12 వేలకు పైగా పాడిన పాటలే ఆమె అసలైన వారసత్వం. ఆ గొంతు సంగీత ప్రియుల గుండెల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.

