Shubhanshu Shukla : కోట్లు సంపాదిస్తారు వ్యోమగాములు, మరి శుభాంశు శుక్లాకు ఒక్క రూపాయి కూడా ఎందుకు అందదు?
మరి శుభాంశు శుక్లాకు ఒక్క రూపాయి కూడా ఎందుకు అందదు?

Shubhanshu Shukla : అంతరిక్ష ప్రపంచం ఎప్పుడూ సాహసాలతో నిండి ఉంటుంది. ఇప్పుడు ఈ అద్భుతమైన ప్రపంచంలో మరోసారి మన జెండా పాతేందుకు రెడీగా ఉన్నారు శుభాంశు శుక్లా. భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, ఆక్సియం-4 మిషన్తో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు. ఈ మిషన్ బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు స్పేస్‌ఎక్స్ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌తో ప్రారంభమైంది. స్పేస్‌ఎక్స్ తమ X పోస్ట్‌లో వాతావరణం 90% అనుకూలంగా ఉందని, అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉన్నాయని తెలిపింది. అయితే, ఈ మిషన్‌తో పాటు నాసా తన వ్యోమగాములకు ఎంత జీతం ఇస్తుంది. వారికి ఏయే సౌకర్యాలు లభిస్తాయో తెలుసుకుందాం.
నాసా ప్రపంచంలోనే అతిపెద్ద అంతరిక్ష సంస్థ. దాని వ్యోమగాములు స్టార్స్ లా మెరుస్తారు. నాసా తన సివిలియన్ వ్యోమగాములకు అమెరికన్ ప్రభుత్వం జనరల్ సర్వీస్ పే స్కేల్ ప్రకారం జీతం ఇస్తుంది. ఈ స్కేల్ GS-12 నుంచి GS-14 వరకు ఉంటుంది.
GS-13 గ్రేడ్: సంవత్సరానికి $81,216 నుండి $105,579 డాలర్లు. అంటే నెలకు సుమారు $8,798 డాలర్లు (దాదాపు రూ.7.5 లక్షలు), గంటకు $50.59 డాలర్లు.
GS-14 గ్రేడ్: సంవత్సరానికి $95,973 నుండి $124,764 డాలర్లు. అంటే నెలకు సుమారు $10,397 డాలర్లు (దాదాపు రూ.8.8 లక్షలు), గంటకు $59.78 డాలర్లు.
GS-15 గ్రేడ్: చాలా అనుభవజ్ఞులైన వ్యోమగాములకు వీరు సంవత్సరానికి $146,757 డాలర్లు (దాదాపు రూ.1.25 కోట్లు) వరకు సంపాదించవచ్చు.
సగటున ఒక వ్యోమగామి వార్షిక జీతం $1,52,258 డాలర్లు (సుమారు రూ.1.3 కోట్లు). అయితే, శుభాంశు శుక్లా లాగా వ్యోమగామి సైన్యం నుంచి వస్తే, వారికి పన్ను రహిత ఆదాయం, హౌసింగ్ అలవెన్స్, పెన్షన్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అంతరిక్షంలో మిషన్ సమయంలో ఎలాంటి ప్రత్యేక బోనస్ లభించదు.
ఇక యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) విషయానికొస్తే, ఈఎస్ఏ కూడా ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష సంస్థలలో ఒకటి. దీని వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌లో విస్తృతంగా పని చేస్తారు. ఈఎస్ఏలో కొత్త వ్యోమగాములకు A2 పే స్కేల్ లభిస్తుంది. ఇది దేశాన్ని బట్టి మారుతుంది.
ఫ్రాన్స్: నెలకు 5,845.25 యూరోలు (సంవత్సరానికి 70,143 యూరోలు, అంటే దాదాపు రూ.60 లక్షలు).
జర్మనీ: నెలకు 5,549.70 యూరోలు (సంవత్సరానికి 66,588 యూరోలు, అంటే దాదాపు రూ.57 లక్షలు).
యూకే: నెలకు 4,534.69 పౌండ్లు (సంవత్సరానికి 54,416 పౌండ్లు, అంటే దాదాపు రూ.58 లక్షలు).
ముఖ్యంగా, ఈఎస్ఏ జీతాలకు సభ్య దేశాలలో ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. అంటే, వారి నెట్ జీతం ప్రైవేట్ రంగంలో పని చేసే వారి కంటే ఎక్కువగా ఉంటుంది.
శుభాంశు శుక్లాకు ఎంత డబ్బు వస్తుంది?
శుభాంశు భారత వైమానిక దళంలో అధికారి. కాబట్టి, ఆయన జీతం ఆయన ర్యాంక్, సర్వీస్ ప్రకారం ఉంటుంది. ఈ మిషన్ కోసం ఆయనకు ఎలాంటి అదనపు జీతం లేదా అలవెన్స్ లభించడం లేదు. అయితే, భారతదేశం ఈ మిషన్ కోసం రూ.548 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తంలో శుభాంశు ట్రైనింగ్, శాస్త్రీయ ప్రయోగాలు, మిషన్‌కు సంబంధించిన ఇతర ఖర్చులు అన్నీ కలిసి ఉన్నాయి.
ఈ మిషన్ భారతదేశానికి ఒక పెద్ద ముందడుగు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారతదేశం భవిష్యత్తులో తన మానవ అంతరిక్ష మిషన్లను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. శుభాంశు ఈ మిషన్‌లో ఏడు భారతీయ శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు. అవి అంతరిక్షంలో పంటల సాగు, మైక్రోగ్రావిటీలో జీవ ప్రక్రియల అధ్యయనం వంటివి ఉన్నాయి.
శుభాంశు శుక్లా ఎవరు?
శుభాంశు ఉత్తరప్రదేశ్, లక్నోకు చెందినవారు. ఆయన తండ్రి యూపీ సచివాలయంలో ప్రధాన కార్యదర్శి పదవి నుంచి పదవీ విరమణ చేశారు. అయితే, శుభాంశు కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. 2006 జూన్ 17న ఆయన భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్ అయ్యారు. శుభాంశుకు 2,000 గంటలకు పైగా విమానాలు నడిపిన అనుభవం ఉంది. ఆయన Su-30 MKI, MiG-21, MiG-29, జాగ్వార్, హక్, డోర్నియర్, An-32 వంటి విమానాలను నడిపారు. 2019లో ఇస్రో ఆయనను గగన్‌యాన్ మిషన్ కోసం సెలక్ట్ చేసింది.
