ఏకంగా రూ,8.5 లక్షల లాభం

Atal Pension Yojana :తక్కువ ఆదాయం ఉన్న ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించిన అటల్ పెన్షన్ యోజన అత్యంత ప్రజాదరణ పొందుతోంది. 2025 అక్టోబర్ 31 నాటికి ఈ పథకంలో నమోదు చేసుకున్న వ్యక్తుల సంఖ్య ఏకంగా 8.34 కోట్లకు చేరింది. ఇందులో 4.04 కోట్ల మంది మహిళా సభ్యులు ఉండటం విశేషం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు. ఈ పథకంలో మొదటిసారిగా పెన్షన్ చెల్లింపులు 2035 సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి.

APY పథకంలో ఎవరు చేరవచ్చు?

APY పథకం ముఖ్య ఉద్దేశం, ఆదాయపు పన్ను పరిధిలోకి రాని సామాన్య ప్రజలకు భద్రత కల్పించడం. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయని ఏ భారతీయ పౌరుడైనా ఈ APY పథకాన్ని తీసుకోవచ్చు. పథకంలో చేరడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 40 సంవత్సరాలుగా నిర్ణయించారు. బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్లలో ఈ స్కీమ్‌ను పొందవచ్చు. సభ్యుడికి 60 ఏళ్లు నిండిన తర్వాత, వారు ఎంచుకున్న మొత్తాన్ని బట్టి నెలవారీ పెన్షన్ లభిస్తుంది.

పెన్షన్ ఎంత? ఎంత కట్టాలి?

అటల్ పెన్షన్ యోజనలో ఐదు రకాల పెన్షన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అవి: నెలకు రూ.1,000, రూ.2,000, రూ.3,000, రూ.4,000, రూ.5,000. మీరు ప్రతి నెలా కట్టవలసిన ప్రీమియం మీరు ఎంచుకున్న పెన్షన్ మొత్తం, మీరు పథకంలో చేరిన వయస్సుపై ఆధారపడి ఉంటుంది.

ఉదాహరణ 1: రూ.1,000 పెన్షన్ కోసం

మీరు 18 ఏళ్ల వయస్సులో పథకంలో చేరితే, నెలకు రూ.42 మాత్రమే కట్టాల్సి ఉంటుంది. 42 సంవత్సరాల కాలంలో మీరు కట్టే మొత్తం సుమారు రూ.21,168 అవుతుంది. 60 ఏళ్ల తర్వాత మీకు నెలకు రూ.1,000 పెన్షన్ లభిస్తుంది. మీరు మరణిస్తే, నామినీకి రూ.1.7 లక్షల పరిహారం లభిస్తుంది.

ఉదాహరణ 2: రూ.5,000 పెన్షన్ కోసం

మీరు 18 ఏళ్ల వయస్సులో చేరితే, నెలకు రూ.210 కట్టాల్సి ఉంటుంది. 42 సంవత్సరాల కాలంలో మీరు కట్టే మొత్తం సుమారు రూ.1,05,840 అవుతుంది. 60 ఏళ్ల తర్వాత మీకు నెలకు రూ.5,000 పెన్షన్ లభిస్తుంది. మీరు మరణిస్తే, నామినీకి రూ.8.5 లక్షల పరిహారం లభిస్తుంది. ఒకవేళ మీరు 40 ఏళ్ల వయస్సులో రూ.5,000 పెన్షన్ ప్లాన్ తీసుకుంటే, 20 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.1,454 చొప్పున పెట్టుబడి పెట్టాలి. ఈ పథకంలో ఈపీఎఫ్ లాగే ప్రభుత్వం కూడా నిధికి కొంత మొత్తాన్ని అందిస్తుంది. మొత్తం మీద ఈ పథకంలో చేసే పెట్టుబడి దాదాపు 8% నుంచి 8.50% CAGR వద్ద పెరుగుతుందని అంచనా.

PolitEnt Media

PolitEnt Media

Next Story