UPI : యూపీఐ లావాదేవీలలో సరికొత్త రికార్డు.. ఆగస్టులో 2000 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్స్
ఆగస్టులో 2000 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్స్

UPI : భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆగస్టు నెలలో యూపీఐ లావాదేవీల సంఖ్య 20 బిలియన్లు (అంటే 2,000 కోట్లు) దాటింది. గత నెల అంటే జూలైలో 19.47 బిలియన్ లావాదేవీలు జరిగాయి. అంతకంటే ఈ నెలలో లావాదేవీల సంఖ్య భారీగా పెరిగింది. ఈ గణాంకాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తన అధికారిక ప్లాట్‌ఫారమ్‌లో పంచుకుంది. లావాదేవీల సంఖ్యలో భారీ వృద్ధి కనిపించినప్పటికీ, వాటి మొత్తం విలువ మాత్రం స్వల్పంగా తగ్గింది. ఆగస్టులో మొత్తం రూ.24.85 లక్షల కోట్లు విలువైన లావాదేవీలు జరిగాయి. ఇది జూలై నెలలో జరిగిన రూ.25.08 లక్షల కోట్ల లావాదేవీల కంటే కొంచెం తక్కువ. అయినప్పటికీ, గత సంవత్సరం ఆగస్టుతో పోలిస్తే మొత్తం లావాదేవీల విలువలో 21% వృద్ధి కనిపించింది. అంటే, తక్కువ మొత్తంలో లావాదేవీలు ఎక్కువగా జరిగాయని దీని అర్థం.
ప్రతిరోజు సగటున రూ.80,177 కోట్ల లావాదేవీలు!
ఆగస్టులో జరిగిన మొత్తం లావాదేవీలను లెక్కలోకి తీసుకుంటే, రోజుకు సగటున 64.5 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి సగటు విలువ రోజుకు రూ.80,177 కోట్లుగా ఉంది. ప్రభుత్వం రోజుకు సగటున 100 కోట్ల యూపీఐ లావాదేవీలను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రస్తుత వృద్ధిలో ఇంకా 50% పెరుగుదల అవసరం. కానీ, ప్రస్తుత వేగాన్ని చూస్తే త్వరలో ఈ లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
NPCI రూపొందించిన యూపీఐ అనేది భారతదేశానికి చెందిన ఒక అద్భుతమైన డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్. ప్రపంచంలో ఏ దేశంలోనూ యూపీఐ లాంటి సమగ్రమైన వ్యవస్థ లేదు. ఇతర దేశాల్లో కూడా డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్ ఉన్నప్పటికీ, వాటి కార్యాచరణ, ఫీచర్లు పరిమితంగా ఉంటాయి. యూపీఐలో దాదాపు అన్ని బ్యాంకులనూ యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల లావాదేవీలు సులభంగా, వేగంగా జరుగుతాయి. ఇదే యూపీఐని భారతదేశంలో ఇంతగా ప్రాచుర్యం పొందేలా చేసింది.
