ఇండిగో, ఎయిర్ ఇండియా కష్టాలు తీర్చేందుకు ముందుకొచ్చిన కేంద్రం

Aviation News : ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరిగి, ఆర్థికంగా సతమతమవుతున్న దేశీయ విమాన సంస్థలకు భారత విమానాశ్రయాల ఆర్థిక నియంత్రణ సంస్థ తీపి కబురు అందించింది. దేశీయ విమానాల ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలలో మూడు నెలల పాటు 25 శాతం తగ్గింపు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా పాకిస్థాన్ గగనతలం మీదుగా వెళ్లేందుకు వీల్లేక, అదనపు దూరం ప్రయాణిస్తూ నష్టపోతున్న ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి సంస్థలకు ఇది పెద్ద ఊరట.

ఇండిగో షేర్ల జోరు

ఈ వార్త వెలువడగానే స్టాక్ మార్కెట్‌లో విమానయాన సంస్థల షేర్లు విపరీతంగా పెరిగాయి. బుధవారం నాటి ట్రేడింగ్‌లో ఇండిగో షేర్లు ఏకంగా 10 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్‎ను తాకాయి. అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల పాటు యుద్ధ విరామం ప్రకటించడం కూడా విమానయాన రంగానికి సానుకూలంగా మారింది. దీనివల్ల చమురు సరఫరా మెరుగుపడి, విమాన ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

జెట్ ఫ్యూయల్ ధరల గుబులు

అంతర్జాతీయ విమానయాన సంస్థ అధిపతి విలీ వాష్ స్పందిస్తూ.. యుద్ధ విరామం మంచిదే అయినప్పటికీ, విమాన ఇంధన ధరలు వెంటనే భారీగా తగ్గిపోవని అభిప్రాయపడ్డారు. ముడిచమురు ధరలు 16 శాతం వరకు తగ్గినప్పటికీ, విమాన ఇంధనం ఇంకా ఎక్కువ ధరకే దొరుకుతోందని, దీనివల్ల ప్రయాణికులపై విమాన టికెట్ల భారం ఇంకా కొంతకాలం కొనసాగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. విలీ వాష్ ఈ ఏడాది చివర్లో ఇండిగో సీఈఓగా బాధ్యతలు తీసుకోబోతుండటం గమనార్హం.

హోర్ముజ్ చిక్కులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో ఇరాన్‌తో కుదిరిన తాత్కాలిక ఒప్పందం వల్ల ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల కంటే కిందకు పడిపోయాయి. ఇరాన్ తన సముద్ర మార్గమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‎ను తెరిచేందుకు అంగీకరించింది. అయితే, అక్కడ ఇప్పటికే 800కు పైగా నౌకలు నిలిచిపోవడంతో సరఫరా మళ్ళీ గాడిలో పడటానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. అప్పటివరకు విమాన సంస్థలు పొదుపుగా వ్యవహరించక తప్పని పరిస్థితి.

PolitEnt Media

PolitEnt Media

Next Story