ఈ 3 తప్పులు చేస్తే అప్పుల పాలవడం ఖాయం

Credit Cards : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు ఒక ముఖ్యమైన ఆర్థిక సాధనంగా మారింది. ఆన్‌లైన్ షాపింగ్, బిల్లు చెల్లింపులు, ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌లు, రివార్డ్ పాయింట్స్ కారణంగా ముఖ్యంగా యువ ఉద్యోగుల్లో దీని వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే క్రెడిట్ కార్డును సరిగ్గా ఉపయోగించడం తెలియకపోతే, ఇది భారీ వడ్డీల భారం, అప్పుల ఊబిలోకి నెట్టేసి ఆర్థికంగా మిమ్మల్ని దివాలా చేసే ప్రమాదం ఉంది. కాబట్టి, క్రెడిట్ కార్డును తెలివిగా ఉపయోగించడానికి ఏయే తప్పులు చేయకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

చాలా మంది చేసే అతిపెద్ద తప్పులలో ఒకటి క్రెడిట్ కార్డు ఉపయోగించి ఏటీఎంలో నగదు విత్‌డ్రా చేయడం. మీరు కార్డు నుంచి డబ్బు తీసిన మరుక్షణం నుంచే (గ్రేస్ పీరియడ్ ఉండదు) అధిక వడ్డీ వసూలు చేయడం మొదలవుతుంది. ఈ వడ్డీ రేటు సాధారణ కొనుగోళ్ల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. వడ్డీతో పాటు, క్యాష్ అడ్వాన్స్ ఫీజు, ఇతర అదనపు ఛార్జీలు కూడా జోడించబడతాయి. అత్యవసరమైతే తప్ప, క్రెడిట్ కార్డును అస్సలు నగదు విత్ డ్రా కోసం ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇది మీకు ఆర్థికంగా అత్యంత నష్టదాయకమైన అలవాటు.

మీ క్రెడిట్ కార్డు లిమిట్‌ను ఎంత ఉపయోగిస్తున్నారు అనేదానిపైనే మీ క్రెడిట్ స్కోర్ ఆధారపడి ఉంటుంది. మీ క్రెడిట్ లిమిట్‌లో 50 శాతం కంటే ఎక్కువ ఖర్చు చేయకుండా చూసుకోవాలి. ఉదాహరణకు మీ లిమిట్ రూ. 50,000 అయితే, రూ. 25,000 దాటకుండా ఖర్చు చేయాలని నిపుణులు సూచిస్తారు. మీ ఖర్చు మొత్తం లిమిట్‌లో 30 శాతం కంటే తక్కువగా ఉంటే, మీ క్రిడిట్ యూటిలైజేషన్ రేషియో మెరుగ్గా ఉండి, మీ క్రెడిట్ స్కోర్ అద్భుతంగా పెరుగుతుంది. 50% దాటితే స్కోర్ దెబ్బతింటుంది. కాబట్టి, లిమిట్‌ను ఎప్పుడూ పూర్తిగా వాడకూడదు.

క్రెడిట్ కార్డు బిల్లు వచ్చినప్పుడు మొత్తం బకాయి చెల్లించకుండా కేవలం మినిమం డ్యూ మాత్రమే చెల్లించడం చాలా ప్రమాదకరం. మీరు మినిమం డ్యూ చెల్లించినప్పటికీ, మిగిలిన మొత్తం బకాయిపై అధిక వడ్డీ రేటు నిరంతరం పెరుగుతూ ఉంటుంది. ఈ వడ్డీ కారణంగా మీ అప్పు చాలా వేగంగా పెరుగుతుంది. కొన్ని నెలల్లోనే ఈ బకాయి మొత్తం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఈ వడ్డీ వలయం నుంచి బయటపడటం చాలా కష్టం. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు లేనంత వరకు ఎప్పుడూ పూర్తి బిల్లును చెల్లించడమే తెలివైన నిర్ణయం.

PolitEnt Media

PolitEnt Media

Next Story