Axis Bank : హాస్పిటాలిటీ రంగానికి యాక్సిస్ బ్యాంక్ గోల్డెన్ ఆఫర్.. స్పెషల్ లోన్లు, రాయితీలు
స్పెషల్ లోన్లు, రాయితీలు

Axis Bank : దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్, భారతీయ హాస్పిటాలిటీ రంగానికి కొత్త ఊపిరి పోసేందుకు నడుం బిగించింది. దేశంలోని హోటళ్లు, రెస్టారెంట్ల సమాఖ్య అయిన FHRAI (ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా)తో ఈ బ్యాంక్ చేతులు కలిపింది. నాగ్‌పూర్‌లో జరిగిన ఈ చారిత్రాత్మక ఒప్పందం ద్వారా, దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటక, హోటల్ వ్యాపారాలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందనున్నాయి. ఈ భాగస్వామ్యం ద్వారా యాక్సిస్ బ్యాంక్, FHRAI నెట్‌వర్క్‌లోని సభ్యులకు నేరుగా సేవలు అందించనుంది. ముఖ్యంగా హాస్పిటాలిటీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా స్పెషల్ కరెంట్ అకౌంట్లు, పీఓఎస్ మెషీన్లపై భారీ రాయితీలు, క్యాష్ మేనేజ్మెంట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. పేమెంట్ సొల్యూషన్స్ సెటప్ ఫీజులో కూడా భారీ మినహాయింపులు ఇవ్వడం వల్ల చిన్న, మధ్యతరహా హోటల్ యజమానులకు ఆర్థిక భారం తగ్గుతుంది. వ్యాపార స్థాయిని బట్టి కస్టమైజ్డ్ ఫైనాన్షియల్ ప్లాన్లను కూడా బ్యాంక్ డిజైన్ చేస్తోంది.
దేశంలో ప్రజల ఆదాయం పెరగడం, దేశీయ పర్యాటక రంగం జోరు అందుకోవడంతో హోటల్ రంగానికి ఫుల్ డిమాండ్ ఏర్పడిందని యాక్సిస్ బ్యాంక్ కమర్షియల్ బ్యాంకింగ్ హెడ్ విజయ్ శెట్టి తెలిపారు. ఈ రంగానికి మరింత దగ్గరవ్వడం ద్వారా కస్టమర్ల అవసరాలను గుర్తించి, సరైన సమయంలో లోన్లు మంజూరు చేయడం తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల పర్యాటక రంగంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని బ్యాంక్ భావిస్తోంది.
చిన్న, మధ్యతరహా పరిశ్రమల కిందకు వచ్చే హోటల్ వ్యాపారాలకు ఈ ఒప్పందం ఒక వరప్రసాదం. వీరికి టర్మ్ లోన్లు, వర్కింగ్ క్యాపిటల్, స్ట్రక్చర్డ్ ఫైనాన్సింగ్ వంటి సౌకర్యాలను యాక్సిస్ బ్యాంక్ కల్పిస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈవెంట్ మేనేజ్మెంట్, క్యాటరింగ్, బ్యాంక్వెట్ హాళ్ల వ్యాపారాలకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని బ్యాంక్ గుర్తించింది. ఈ రంగంలోని వ్యాపారులకు రిలేషన్ షిప్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తూ వ్యాపార విస్తరణకు బ్యాంక్ సహకరిస్తుంది.
కేవలం మెట్రో నగరాలకే కాకుండా, టైర్-2, టైర్-3 నగరాల్లో కూడా తమ సేవలను విస్తరించాలని యాక్సిస్ బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వేగంగా పెరుగుతున్న హోటల్,ఈవెంట్ పరిశ్రమను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దింపింది. దీనివల్ల స్థానిక వ్యాపారులకు బ్యాంకింగ్ లావాదేవీలు సులభతరం కావడమే కాకుండా, తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశం దక్కుతుంది. మొత్తం మీద ఈ ఒప్పందం భారత హాస్పిటాలిటీ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించనుంది.

