Bank Deposits : బ్యాంకుల్లో కుప్పలు తెప్పలుగా డబ్బు.. వారసుల కోసం ఎదురుచూస్తున్న రూ.74,580 కోట్లు
వారసుల కోసం ఎదురుచూస్తున్న రూ.74,580 కోట్లు

Bank Deposits : దేశంలోని వివిధ బ్యాంకుల్లో ఏళ్ల తరబడి ఎవరూ క్లెయిమ్ చేయకుండా పడి ఉన్న డబ్బు (అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు) కొండలా పేరుకుపోతోంది. ఈ మొత్తం ఏటా వేల కోట్ల రూపాయల మేర పెరుగుతుండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ లోక్‌సభలో వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2024 మార్చి 31 నాటికి బ్యాంకుల్లో ఉన్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల విలువ రూ.60,610 కోట్లుగా ఉంటే, కేవలం ఒక్క ఏడాదిలోనే అది రూ.74,580 కోట్లకు చేరుకుంది. అంటే కేవలం 12 నెలల వ్యవధిలోనే వేల కోట్ల రూపాయలు అదనంగా వచ్చి చేరాయి. ఈ అన్‌క్లెయిమ్డ్ మనీలో సింహభాగం (సుమారు 74%) ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ఉండటం గమనార్హం.
అసలు ఈ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఒక సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ వరుసగా 10 ఏళ్ల పాటు వాడకపోయినా (ఇన్‌యాక్టివ్), లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ మెచ్యూర్ అయిన తర్వాత 10 ఏళ్ల దాకా ఎవరూ తీసుకోకపోయినా.. దానిని అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్‌గా పరిగణిస్తారు. ఇలాంటి డబ్బును బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆధ్వర్యంలోని డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ (DEAF)కు బదిలీ చేస్తాయి. ప్రస్తుతం ఈ నిధులను అసలైన యజమానులకు లేదా వారి వారసులకు చేరవేయడానికి ఆర్బీఐ యుద్ధప్రతిపాదికన చర్యలు తీసుకుంటోంది.
ఈ క్రమంలో ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం పలు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాయి. 2025 అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ప్రోత్సాహక పథకం ప్రకారం.. ఏ బ్యాంకైనా పాత ఖాతాల యజమానులను గుర్తించి ఆ డబ్బును సెటిల్ చేస్తే, సదరు బ్యాంకుకు ఆ మొత్తంలో 5% నుంచి 7.5% వరకు ఇన్సెంటివ్ లభిస్తుంది. అలాగే, గతంలో ఉన్న ఒకే నామినీ నిబంధనను సవరిస్తూ.. బ్యాంకింగ్ నిబంధనల (సవరణ) చట్టం 2025 ద్వారా ఒక ఖాతాకు గరిష్టంగా నలుగురు నామినీలను నియమించుకునే వెసులుబాటును కల్పించారు. దీనివల్ల భవిష్యత్తులో వారసుల మధ్య గొడవలు లేకుండా డబ్బు సులభంగా బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వ ప్రయత్నాలు సత్ఫలితాలను కూడా ఇస్తున్నాయి. గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు చేపట్టిన మీ పెట్టుబడి - మీ హక్కు ప్రచార కార్యక్రమం వల్ల 2026 ఫిబ్రవరి 28 నాటికి సుమారు రూ. 5,777 కోట్ల అన్‌క్లెయిమ్డ్ నగదును అసలైన యజమానులకు తిరిగి ఇచ్చారు. బ్యాంకులు ప్రతి నెలా తమ వెబ్‌సైట్లలో ఇన్‌యాక్టివ్ ఖాతాల జాబితాను అప్‌డేట్ చేయాలని, ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా కస్టమర్లను సంప్రదించాలని ఆర్బీఐ ఆదేశించింది. మీ ఇంట్లో కూడా పెద్దలు మర్చిపోయిన పాత బ్యాంకు పాస్ బుక్కులు ఉంటే, వెంటనే ఒకసారి బ్యాంక్ కు వెళ్లి చెక్ చేసుకోవడం మంచిది.

