KYC Update : జన్ ధన్ ఖాతా ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఇంటి దగ్గరే KYC క్యాంపులు!
ఇంటి దగ్గరే KYC క్యాంపులు!

KYC Update : ప్రధానమంత్రి జనధన్ యోజన పథకం ప్రారంభమై పదేళ్లు పూర్తయింది. ఈ పథకం కింద తెరిచిన అనేక బ్యాంక్ ఖాతాలకు ఇప్పుడు రీ-కేవైసీ చేయడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో బ్యాంకులు ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ క్యాంపులు జులై 1 నుంచి ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతాయి.
క్యాంపులలో లభించే సేవలు
ఈ పంచాయతీ లెవల్ క్యాంపులలో కేవలం రీ-కేవైసీ మాత్రమే కాదు. మీ అకౌంట్‌కు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నా పరిష్కరించుకోవచ్చు. అలాగే, కొత్తగా అకౌంట్లు తెరవడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది. మీ ఇంటి దగ్గరే వచ్చిన ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని బ్యాంక్ సేవలు పొందవచ్చు.
రీ-కేవైసీకి ఏఏ డాక్యుమెంట్లు అవసరం?
మీ పేరు, అడ్రస్ మారకపోతే: మీ పేరు, చిరునామాలో ఎటువంటి మార్పులు లేకపోతే, మీరు ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ నింపితే సరిపోతుంది.
మీ పేరు, అడ్రస్ మారితే: ఒకవేళ మీ పేరు లేదా చిరునామాలో మార్పులు ఉంటే, దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఆర్‌బీఐ ప్రకారం, ఈ క్రింది వాటిలో ఏదైనా ఒక డాక్యుమెంట్ సరిపోతుంది:
* ఆధార్ కార్డు
* ఓటర్ ఐడీ
* నరేగా జాబ్ కార్డు
* డ్రైవింగ్ లైసెన్స్
* పాస్‌పోర్ట్
* నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ జారీ చేసిన లేఖ
రీ-కేవైసీ ఎందుకు ముఖ్యం?
ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు అందే నిధులు నేరుగా ఈ జనధన్ ఖాతాలలోకి బదిలీ అవుతాయి. ఒకవేళ ఈ ఖాతాలకు రీ-కేవైసీ పూర్తి చేయకపోతే, వాటిని నిరుపయోగంగా పరిగణించి, నిధుల బదిలీని నిలిపివేసే అవకాశం ఉంది. అందుకే మీ ఖాతాను యాక్టివ్‌గా ఉంచుకోవడానికి రీ-కేవైసీ తప్పనిసరి.
మరిన్ని సేవలు
ఈ క్యాంపులలో రీ-కేవైసీతో పాటు, ప్రజలకు మైక్రో ఇన్సూరెన్స్ పథకాలపై అవగాహన కల్పించే ప్రయత్నం కూడా జరుగుతుంది. అలాంటి పథకాల్లో డబ్బులు పెట్టుబడి పెట్టడానికి ప్రజలను ప్రోత్సహిస్తారు. అలాగే ఆర్‌బీఐ బాండ్ల గురించి కూడా వినియోగదారులకు వివరిస్తారు.
