ఆ ఒక్క లింక్ నొక్కితే అకౌంట్ ఖాళీ

Bank of Baroda Alert : బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న డిజిటల్ మోసాల పట్ల ప్రభుత్వ రంగ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా తన వినియోగదారులను, ముఖ్యంగా పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లను అప్రమత్తం చేసింది. రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా గడపాల్సిన వృద్ధుల కష్టార్జితంపై సైబర్ నేరగాళ్లు కన్నేశారని, రకరకాల కొత్త ఎత్తుగడలతో వారిని బురిడీ కొట్టిస్తున్నారని బ్యాంక్ హెచ్చరించింది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఒక సమగ్రమైన అడ్వైజరీని జారీ చేస్తూ, అనుమానాస్పద లింక్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ప్రస్తుతం సైబర్ కేటుగాళ్లు పెన్షనర్ కార్డ్ పేరిట ఫేక్ మెసేజ్లు, ఫోటోలను సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం లేదా బ్యాంక్ నుంచి కొత్తగా పెన్షనర్ కార్డులు జారీ అవుతున్నాయని నమ్మిస్తూ, ఆ కార్డును పొందడానికి కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేయాలంటూ వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ పంపుతున్నారు. ఈ లింక్ క్లిక్ చేయగానే వినియోగదారుల బ్యాంక్ ఖాతా వివరాలు హ్యాకర్ల చేతికి వెళ్తున్నాయి. అయితే, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలాంటి ఎలాంటి పెన్షనర్ కార్డులను సోషల్ మీడియా లింక్‌ల ద్వారా జారీ చేయడం లేదని, ఆ మెసేజ్‌లు పూర్తిగా నకిలీవని బ్యాంక్ యాజమాన్యం కుండబద్ధలు కొట్టింది.

జాలసాగులు అనుసరిస్తున్న సాధారణ పద్ధతులను బ్యాంక్ ప్రజల ముందు ఉంచింది. వీరు బ్యాంక్ అధికారులుగా లేదా ప్రభుత్వ ఉద్యోగులుగా నటిస్తూ ఫోన్ కాల్స్ చేస్తారు. పెన్షన్ ఆగిపోకుండా ఉండాలంటే వెరిఫికేషన్ చేయాలని లేదా పెన్షన్ అప్‌డేట్ చేయాలని నమ్మిస్తారు. ఆ క్రమంలో ఓటీపీ, పిన్, సీవీవీ, ఆధార్ లేదా పాన్ కార్డ్ వివరాలను సేకరిస్తారు. కొన్నిసార్లు మొబైల్‌లో కొన్ని రకాల యాప్స్ లేదా స్క్రీన్ షేరింగ్ సాఫ్ట్‌వేర్లను ఇన్‌స్టాల్ చేయమని కోరుతారు. వీటి ద్వారా మీ ఫోన్‌ను వారి నియంత్రణలోకి తీసుకుని నిమిషాల్లో అకౌంట్ ఖాళీ చేస్తారు.

వృద్ధులు, పెన్షనర్లు తమ సొమ్మును కాపాడుకోవడానికి బ్యాంక్ కొన్ని కీలక సూచనలు చేసింది. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్‌లను ఎప్పుడూ క్లిక్ చేయకూడదు. బ్యాంక్ ఎప్పుడూ తన కస్టమర్ల నుంచి రహస్య సమాచారాన్ని ఫోన్ ద్వారా అడగదు. మీకు ఏదైనా సందేహం వస్తే వెంటనే మీ సమీప బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌కు వెళ్లి నేరుగా అధికారులను సంప్రదించాలి. అలాగే, ఆన్‌లైన్‌లో ఏవైనా అపరిచిత యాప్స్ ఇన్‌స్టాల్ చేసే ముందు మీ కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం ఉత్తమం. ఏవైనా అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story