Data Leak : బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్ల డేటా లీక్.. ఖాతాదారులు వెంటనే చేయాల్సిన పనులివే
ఖాతాదారులు వెంటనే చేయాల్సిన పనులివే

Data Leak : మీకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో అకౌంట్ ఉందా? గత కొన్ని రోజులుగా డార్క్ వెబ్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన కస్టమర్ల భారీ డేటా లీక్ అయిందనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. హ్యాకర్ల వద్ద కస్టమర్ల లోన్ పత్రాలు, గుర్తింపు కార్డులు, ఇతర వ్యక్తిగత వివరాలతో కూడిన దాదాపు 1 టెరాబైట్ డేటా ఉందని ప్రచారం జరిగింది. దీనిపై జూలై 27న బ్యాంక్ యాజమాన్యం స్పందిస్తూ, భద్రతా లోపం జరిగిన మాట నిజమేనని ధృవీకరించింది. అయితే, కస్టమర్ల సొమ్ము పూర్తిగా సురక్షితంగా ఉందని స్పష్టం చేయడంతో ఖాతాదారులు ఊపిరి పీల్చుకున్నారు.
కస్టమర్ల సొమ్ము భద్రం.. ఆందోళన అనవసరం
డేటా లీక్ వార్తలు రాగానే కంగారు పడాల్సిన అవసరం లేదని బ్యాంక్ యాజమాన్యం, సైబర్ నిపుణులు స్పష్టం చేశారు. లావాదేవీలు జరిగే బ్యాంక్ కోర్ సిస్టమ్ అత్యంత సురక్షితంగా ఉందని, హ్యాకర్లు అక్కడి వరకు చేరుకోలేకపోయారని వెల్లడించారు. బ్యాంక్‌లోని ఒక ఉద్యోగి ఈమెయిల్ హ్యాక్ అవ్వడం వల్ల కొందరి పేర్లు, అకౌంట్ వివరాలు, గుర్తింపు కార్డుల సమాచారం బయటకు వచ్చిందని తెరిపారు. ట్రిపుల్ ఎక్స్ అనే హ్యాకింగ్ గ్రూప్ దీనికి బాధ్యత వహించింది. అయితే ఈ సమాచారం లీక్ అయినంత మాత్రాన మీ అకౌంట్‌లో ఉన్న డబ్బులు మాయం కావు.
లీక్ అయిన సమాచారంతో డబ్బులు తీయడం సాధ్యమా?
ఈ పరిస్థితిని సులువుగా అర్థం చేసుకోవాలంటే.. ఒక వ్యక్తికి మీ ఇంటి అడ్రస్ మాత్రమే తెలిసింది, కానీ ఇంటి తాళం చెవి ఇంకా మీ దగ్గరే భద్రంగా ఉంది. కేవలం మీ పేరు, ఆధార్ లేదా పాన్ కార్డ్ నంబర్ తెలిసినంత మాత్రాన ఎవరూ మీ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేయలేరు. అకౌంట్ నుంచి సొమ్ము డ్రా చేయాలంటే వారికి మీ ఏటీఎం పిన్, నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ లేదా ఫోన్‌కు వచ్చే ఓటీపీ అవసరం. ఈ రహస్య వివరాలేవీ లీక్ అవ్వలేదు. కాబట్టి ఇది వ్యక్తిగత సమాచార లీక్ మాత్రమే తప్ప, డబ్బుల దొంగతనం కాదు.
హ్యాకర్ల కంటే కేటుగాళ్ల కాల్స్‌తోనే అసలు ప్రమాదం
నిజానికి హ్యాకర్ల కంటే ఈ లీక్ అయిన డేటాను వాడుకుని మిమ్మల్ని మోసం చేసే సైబర్ నేరగాళ్లతోనే అసలు ప్రమాదం ఉంది. నేరగాళ్లు మీకు ఫోన్ చేసి మీ పేరు, బ్రాంచ్, అకౌంట్ చివరి నాలుగు అంకెలు సరిగ్గా చెప్పి, "మేము బ్యాంక్ సెక్యూరిటీ టీమ్ నుంచి మాట్లాడుతున్నాం, మీ అకౌంట్ బ్లాక్ అవుతోంది" అని భయపెట్టవచ్చు. మీరు కంగారుపడి వారు అడిగిన ఓటీపీ లేదా పిన్ నంబర్ చెబితే వెంటనే మీ ఖాతాలోని డబ్బులు ఊడ్చేస్తారు. గుర్తుంచుకోండి.. ప్రపంచంలో ఏ బ్యాంకు కూడా ఫోన్ లేదా మెసేజ్ ద్వారా ఓటీపీ, సీవీవీ, పాస్‌వర్డ్‌లను అడగదు.
మీ ఖాతాను సురక్షితంగా ఉంచుకోవడానికి 7 చిట్కాలు
బ్యాంక్ విచారణ ముగిసేవరకు ఆగకుండా, మీ ఖాతా రక్షణ కోసం వెంటనే ఈ 7 జాగ్రత్తలు తీసుకోండి:
* మీ నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్ పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చండి.
* బ్యాంక్ నుంచి వచ్చే ప్రతి ఎస్‌ఎమ్‌ఎస్, ఈమెయిల్ ట్రాన్సాక్షన్ అలర్ట్‌లను జాగ్రత్తగా గమనించండి.
* 'మీ కేవైసీ అప్‌డేట్ చేయండి' లేదా 'అకౌంట్ బ్లాక్ అయ్యింది' అంటూ ఫోన్‌కు వచ్చే ఎలాంటి లింక్‌లను క్లిక్ చేయకండి.
* అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా మీ ఆధార్ కార్డ్ బయోమెట్రిక్స్ లాక్ చేసుకోండి.
* మీ పేరు మీద ఎవరైనా కొత్తగా రుణాలు తీసుకున్నారేమో తెలుసుకోవడానికి CIBIL రిపోర్ట్ తనిఖీ చేయండి.
* మీ ఖాతాలో ఎలాంటి అనుమానాస్పద లావాదేవీ కనిపిస్తే వెంటనే బ్యాంకుకు తెలియజేసి, 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి.
* మీ బ్యాంకు ఖాతాలో మీ ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ అప్‌డేట్ అయి ఉండేలా చూసుకోండి.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాను మూసివేయాలా?
డేటా లీక్ భయంతో ఖాతాను మూసివేయాల్సిన అవసరం ఏమాత్రం లేదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో చాలా సమాచారం ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో ఇతర బ్యాంకులు లేదా కంపెనీలకు కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. కస్టమర్లు చేయాల్సిందల్లా అప్రమత్తంగా ఉండటమే. మీ పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు ఎవరికీ చెప్పకుండా భద్రంగా ఉంచుకుంటే మీ సొమ్ము ఎప్పటికీ సురక్షితంగానే ఉంటుంది.

