వరుసగా నాలుగో రోజు బ్యాంకులు బంద్?

Bank Strike Alert : వరుస సెలవులతో అల్లాడుతున్న బ్యాంకు కస్టమర్లకు మరో షాక్ తగిలేలా ఉంది. జనవరి 27న దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది. బ్యాంకు ఉద్యోగుల సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడమే దీనికి ప్రధాన కారణం. ఇప్పటికే వీకెండ్, గణతంత్ర దినోత్సవం (జనవరి 26) సెలవులతో బ్యాంకులు వరుసగా మూడు రోజులు పనిచేయలేదు. ఇప్పుడు జనవరి 27న సమ్మె గనుక జరిగితే, వరుసగా నాలుగో రోజు కూడా బ్యాంకింగ్ సేవలకు బ్రేక్ పడినట్లవుతుంది.

యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ జనవరి 27న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. బ్యాంకు ఉద్యోగుల ప్రధాన డిమాండ్ ఏంటంటే.. వారానికి ఐదు రోజుల పని దినాలను అమలు చేయడం. ప్రస్తుతం బ్యాంకులకు ప్రతి నెలా రెండో, నాలుగో శనివారాలు సెలవు ఇస్తున్నారు. అయితే, అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇందుకు ప్రతిగా ప్రతిరోజూ అదనంగా 40 నిమిషాలు పనిచేయడానికి కూడా సిద్ధమని వారు ప్రతిపాదించారు. గతంలో దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పటికీ, ఉత్తర్వులు జారీ చేయడంలో జాప్యం జరుగుతోందని యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ వివాదంపై లేబర్ కమిషనర్, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రతినిధులతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీనివల్ల జనవరి 27న సమ్మెకు వెళ్లడం ఖాయమని యూనియన్లు ప్రకటించాయి. ఇప్పటికే ఎస్బీఐ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ కస్టమర్లకు సమాచారం అందించాయి. సమ్మె జరిగితే బ్యాంకు బ్రాంచీల్లో సేవలు కుంటుపడవచ్చని, కాబట్టి అవసరమైన పనులను ముందే పూర్తి చేసుకోవాలని సూచించాయి. చెక్కుల క్లియరెన్స్, నగదు డిపాజిట్లు వంటి పనులపై ఈ సమ్మె ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

అయితే బ్యాంకులు మూతపడినా డిజిటల్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్, యూపీఐ లావాదేవీలు యథావిధిగా పనిచేస్తాయి. కానీ, ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వరుసగా మూడు రోజులు సెలవులు కావడంతో ఏటీఎంలలో నగదు త్వరగా ఖాలీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కస్టమర్లు తమకు కావాల్సిన నగదును ముందే డ్రా చేసి ఉంచుకోవడం మంచిది. బ్యాంకులకు వెళ్లేముందు మీ ప్రాంతంలోని బ్యాంకు బ్రాంచ్ పనిచేస్తుందో లేదో ఒకసారి కనుక్కోవడం ఉత్తమం.

PolitEnt Media

PolitEnt Media

Next Story