ఆ ఒక్క మెసేజ్ క్లిక్ చేశారో.. మీ అకౌంట్ ఖాళీ

SBI Alert : సైబర్ నేరగాళ్ల కన్ను ఇప్పుడు మీ బ్యాంకు ఖాతాపై పడింది. మీరు ఎంత చదువుకున్న వారైనా, ఎంత జాగ్రత్తగా ఉన్నా.. చిన్నపాటి అత్యాశను ఎరగా వేసి మీ కష్టార్జితాన్ని కొల్లగొట్టేందుకు పక్కా ప్లాన్ వేస్తున్నారు. తాజాగా దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులను ఉద్దేశించి ఒక అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా రివార్డ్ పాయింట్స్ పేరుతో వస్తున్న మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, లేదంటే ఒక్క క్లిక్‌తో మీ అకౌంట్ ఖాళీ అయిపోతుందని హెచ్చరించింది.

నేటి డిజిటల్ యుగంలో సైబర్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఎస్‌బీఐ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ.. ఖాతాదారులకు వస్తున్న నకిలీ మెసేజ్‌ల గురించి వివరించింది. మోసగాళ్లు ఎస్‌ఎంఎస్ లేదా వాట్సాప్ ద్వారా మీ అకౌంట్‌లో వేల సంఖ్యలో రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి, అవి ఈరోజే ఎక్స్‌పైర్ అయిపోతున్నాయి.. వెంటనే రిడీమ్ చేసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి అంటూ మెసేజ్ పంపిస్తారు. ఏదో ఉచితంగా వస్తుందన్న ఆశతో ఆ లింక్ క్లిక్ చేస్తే, అది మిమ్మల్ని ఒక నకిలీ వెబ్‌సైట్‌కు తీసుకెళ్తుంది. అక్కడ మీ డెబిట్ కార్డ్ వివరాలు, ఓటీపీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయమని అడుగుతారు. మీరు ఆ వివరాలు ఇచ్చారో.. ఇక మీ అకౌంట్లోని డబ్బులు మాయం అయినట్లే.

అసలు ఈ మెసేజ్ నిజమైనదా లేక నకిలీదా అని గుర్తించడం చాలా సులభమని ఎస్‌బీఐ తెలిపింది. సాధారణంగా ఇలాంటి ఫేక్ మెసేజ్‌లలో స్పెల్లింగ్ తప్పులు, వ్యాకరణ దోషాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా, బ్యాంక్ నుంచి వచ్చే అధికారిక కాల్స్ ఎప్పుడూ 1600తో ప్రారంభమయ్యే నంబర్ల నుంచే వస్తాయని గుర్తించుకోవాలి. అపరిచిత నంబర్ల నుంచి వచ్చే లింక్‌లను క్లిక్ చేయడం వల్ల మీ ఫోన్‌లోని డేటా కూడా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. బ్యాంకులు ఎప్పుడూ మీ వ్యక్తిగత వివరాలను లేదా కార్డ్ పిన్ నంబర్లను అడగవని ఎస్‌బీఐ స్పష్టం చేసింది.

ఒకవేళ పొరపాటున మీరు మోసపోయినట్లయితే లేదా మీ అకౌంట్ నుంచి అనధికారికంగా డబ్బులు కట్ అయినట్లయితే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలి. అలాగే cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. సాధ్యమైనంత త్వరగా ఫిర్యాదు చేయడం వల్ల మీ డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు ఎంత తెలివైన వారైనా, మనం జాగ్రత్తగా ఉంటే మన డబ్బును కాపాడుకోవచ్చు.

మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఓటీపీ, సీవీవీ, యూపీఐ పిన్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దు. బ్యాంక్ అధికారులు అని చెప్పి కాల్ చేసినా సరే, అలాంటి వివరాలు అడిగితే వెంటనే కాల్ కట్ చేయండి. ఏవైనా అనుమానాలు ఉంటే నేరుగా మీ హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి సంప్రదించడం ఉత్తమం. రివార్డ్ పాయింట్లు నిజంగా ఉంటే, అవి బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా మాత్రమే కనిపిస్తాయని గుర్తుంచుకోండి.

PolitEnt Media

PolitEnt Media

Next Story