జరిమానాల రూపంలో వేల కోట్లు కొల్లగొట్టిన బ్యాంకులు

Bank Charges : బ్యాంకు అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ లేదని సామాన్యుల జేబులకు బ్యాంకులు భారీగా కత్తెర వేస్తున్నాయి. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో (2022-23 నుంచి 2024-25 వరకు) ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకులు కేవలం జరిమానాల రూపంలోనే వేల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మార్చి 9, 2026న లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ దిగ్భ్రాంతికరమైన గణాంకాలను బయటపెట్టింది. నిరుపేదలు, రోజువారీ కూలీలు కనీస నిల్వ ఉంచుకోలేకపోతే బ్యాంకులు ఇలా శిక్షించడం ఎంతవరకు సమంజసమని విపక్షాలు ప్రశ్నించగా, ప్రభుత్వం దీనిపై పూర్తి డేటాను సమర్పించింది.

ప్రైవేట్ రంగ బ్యాంకుల విషయానికి వస్తే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. గత మూడు ఏళ్లలో ఈ బ్యాంక్ తన ఖాతాదారుల నుంచి ఏకంగా రూ.3,871.71 కోట్లను పెనాల్టీ రూపంలో వసూలు చేసింది. దీని తర్వాత యాక్సిస్ బ్యాంక్ రూ.2,705.97 కోట్లతో రెండో స్థానంలో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ కూడా రూ.1,224.79 కోట్లు వసూలు చేసి ఇన్వెస్టర్లు, ఖాతాదారుల నుంచి భారీగానే లాభపడింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే ప్రైవేట్ బ్యాంకులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాయని ఈ గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులపై అత్యధికంగా భారం వేసింది. మూడు ఏళ్లలో పీఎన్‌బీ రూ.1,577.87 కోట్లు వసూలు చేయగా, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.1,272.17 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ.1,166.27 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ కలిపి మూడు సంవత్సరాలలో మొత్తం రూ.8,092.83 కోట్లను ఖాతాదారుల నుంచి పిండుకున్నాయి. అయితే, అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్‌బీఐ గతంతో పోలిస్తే ఈ చార్జీలను కొంతవరకు తగ్గించినప్పటికీ, రూ.932 కోట్లకు పైగా వసూలు చేయడం గమనార్హం.

ఈ పరిణామాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. నిరుపేదలు, చిన్న పొదుపుదారుల కోసం ప్రభుత్వం జీరో బ్యాలెన్స్ ఖాతాల సదుపాయాన్ని కల్పిస్తోందని చెప్పారు. ముఖ్యంగా ప్రధాన మంత్రి జన ధన్ యోజన కింద తెరిచిన దాదాపు 72 కోట్ల ఖాతాలకు ఎలాంటి కనీస నిల్వ నిబంధన వర్తించదని, వాటిపై పైసా కూడా జరిమానా వేయరని స్పష్టం చేశారు. బ్యాంకింగ్ సేవలు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ప్లాన్ అమల్లో ఉందన్నారు. అంతేకాకుండా, 2025లో తొమ్మిది ప్రభుత్వ బ్యాంకులు పొదుపు ఖాతాలపై మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీని పూర్తిగా రద్దు చేశాయని, మరికొన్ని బ్యాంకులు ఈ చార్జీలను తగ్గించాయని ఆమె లోక్‌సభకు వివరించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story