Banking Stocks Crash : సోమవారం నాటి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ రంగానికి చెందిన షేర్లు భారీగా పతనమయ్యాయి. మార్కెట్లో ఇన్వెస్టర్లు ఆశించిన స్థాయిలో క్రెడిట్ గ్రోత్ ఉన్నప్పటికీ, అది బ్యాంకుల నికర లాభాల్లోకి మారకపోవడంతో మదుపరులు అమ్మకాలకు తెగబడ్డారు. దీని ప్రభావంతో దేశంలోనే దిగ్గజ బ్యాంకింగ్ సంస్థలైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు ఏకంగా 3.50 శాతం నుంచి 6 శాతానికి పైగా పడిపోయాయి. ఒక్క రోజులోనే ఈ మూడు బ్యాంకుల సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్ నుంచి ఏకంగా రూ.లక్ష కోట్లకు పైగా సొమ్ము తుడిచిపెట్టుకుపోయింది.

HDFC, యాక్సిస్, కోటక్ బ్యాంక్ షేర్లు డౌన్

ఈ పతనంలో అత్యధికంగా దెబ్బతిన్నది యాక్సిస్ బ్యాంక్. ఈ బ్యాంక్ షేరు ఏకంగా 6 శాతం పడిపోవడంతో దాదాపు రూ.25,000 కోట్ల మార్కెట్ వ్యాల్యూ నష్టపోయింది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు 5.56 శాతం క్షీణించడంతో ఇన్వెస్టర్లకు దాదాపు రూ. 65,000 కోట్ల మేర నష్టం వాటిల్లింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ షేరు కూడా 3.51 శాతం పడిపోయి రూ.14,000 కోట్ల మార్కెట్ క్యాప్‌ను కోల్పోయింది. అయితే, ఇదే సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు మాత్రం దాదాపు 1 శాతం లాభంతో ముగిసింది. దీన్ని బట్టి ఇన్వెస్టర్లు బ్లైండ్‌గా బ్యాంకింగ్ రంగాన్ని అమ్మడం లేదని, రుణాల వృద్ధి నాణ్యత, లాభదాయకత ఆధారంగానే ఎంపిక చేసిన షేర్లలో పెట్టుబడులు ఉంచుతున్నారని స్పష్టమవుతోంది.

లోన్ గ్రోత్ ఉన్నా దక్కని లాభాలు.

బ్యాంకింగ్ షేర్లు ఈ స్థాయిలో పడిపోవడానికి ప్రధాన కారణాలను విశ్లేషకులు స్పష్టంగా వివరించారు. ప్రస్తుతం బ్యాంకులలో కార్పొరేట్ రుణాలు వేగంగా పెరుగుతున్నాయి కానీ, ఎక్కువ లాభదాయకమైన రిటైల్ రుణాలు (వ్యక్తిగత, గృహ రుణాలు) మందగించాయి. సాధారణంగా కార్పొరేట్ రుణాలపై బ్యాంకులకు వచ్చే వడ్డీ రాబడి చాలా తక్కువగా ఉంటుంది. దీనికి తోడు కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ రూపంలో వచ్చే తక్కువ ఖర్చుతో కూడిన డిపాజిట్లు తగ్గుతుండటంతో, బ్యాంకులు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సిన టర్మ్ డిపాజిట్లపై ఆధారపడాల్సి వస్తోంది.

CASA డిపాజిట్లు తగ్గిపోవడమే కారణమా?

ఫలితంగా బ్యాంకుల నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ (NIM) - అంటే రుణాలు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయం, డిపాజిట్ల కోసం చెల్లించే వ్యయం మధ్య ఉండే నికర తేడాపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఈక్విరస్ సెక్యూరిటీస్ విశ్లేషణ ప్రకారం, ఒక్క ఐసీఐసీఐ బ్యాంక్ మినహా మిగిలిన ప్రధాన ప్రైవేట్ బ్యాంకుల మార్జిన్లలో గణనీయమైన క్షీణత నమోదు అయింది. కార్పొరేట్ రుణాలు పెరిగినప్పటికీ స్ప్రెడ్స్ (వడ్డీ తేడాలు) తగ్గడమే దీనికి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.

రిటైల్ లోన్స్ తగ్గడం వల్ల ప్రైవేట్ బ్యాంకులకు ఒత్తిడి

కంపెనీల వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు పెరగడం, కార్పొరేట్ బాండ్ల కంటే బ్యాంక్ రుణాల వైపే కంపెనీలు మొగ్గు చూపడంతో కార్పొరేట్ క్రెడిట్ గ్రోత్ బాగానే ఉన్నప్పటికీ, సాధారణ రిటైల్ రుణాల వృద్ధి ఎప్పుడు పుంజుకుంటుంది? నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్లు ఎప్పుడు మెరుగుపడతాయి? అనే ప్రశ్నలు ఇప్పుడు ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ అనిశ్చితి తేలేవరకు ప్రైవేట్ బ్యాంకింగ్ స్టాక్స్ కొద్దిరోజుల పాటు ఒత్తిడిలోనే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story