Indian Economy : ప్రభుత్వ ఖజానా నింపుతున్న బ్యాంకులు.. రెండు నెలల్లో ఏకంగా రూ.3లక్షల కోట్లు
రెండు నెలల్లో ఏకంగా రూ.3లక్షల కోట్లు

Indian Economy : కేంద్ర ప్రభుత్వ ఖజానా నిండుతోంది. మన దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ లాభాలను ఆర్జిస్తూ, ఆ లాభాల నుంచి పెద్ద మొత్తంలో డివిడెండ్‌లను ప్రభుత్వానికి అందిస్తున్నాయి. గత రెండు నెలల్లోనే ఈ బ్యాంకుల నుంచి కేంద్ర ప్రభుత్వానికి దాదాపు రూ.3 లక్షల కోట్లకు పైగా నిధులు చేరాయి. ఇది ప్రభుత్వానికి చాలా పెద్ద ఊరట అని చెప్పాలి. తాజాగా, ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఇండియన్ బ్యాంక్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1,616 కోట్లకు పైగా డివిడెండ్ చెక్కును కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ బినోద్ కుమార్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఈ డివిడెండ్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం. నాగరాజుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇండియన్ బ్యాంక్ తమ వాటాదారులకు, అంటే షేర్‌హోల్డర్లకు, ప్రతి షేరుకు రూ.16.25 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది. ఇది బ్యాంక్ బలమైన ఆర్థిక పనితీరుకు నిదర్శనమని, భారత ప్రభుత్వంతో సహా అందరి వాటాదారులకు దీర్ఘకాలిక విలువను సృష్టించాలనే తమ నిబద్ధతను చూపుతుందని బ్యాంక్ తెలిపింది.
డివిడెండ్ అంటే ఏమిటి? ప్రభుత్వానికి ఎలా లాభం?
సాధారణంగా, ఒక కంపెనీ లేదా బ్యాంక్ లాభాలు సంపాదించినప్పుడు, ఆ లాభంలో కొంత భాగాన్ని తమ షేర్‌హోల్డర్లకు పంచుతుంది. దీనినే డివిడెండ్ అంటారు. ప్రభుత్వ రంగ బ్యాంకులలో, ప్రభుత్వం పెద్ద మొత్తంలో వాటాలను కలిగి ఉంటుంది కాబట్టి, ఆ లాభాల నుంచి ప్రభుత్వానికి కూడా డివిడెండ్ రూపంలో ఒక వాటా అందుతుంది. బ్యాంకుల నుంచి ప్రభుత్వానికి వచ్చే ఈ డివిడెండ్, ప్రభుత్వ మొత్తం ఆదాయానికి గణనీయంగా తోడ్పడుతుంది. ఈ అదనపు నిధులు ప్రభుత్వానికి అభివృద్ధి పథకాల కోసం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం, సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు చేయడానికి మరింత వెసులుబాటును కల్పిస్తాయి.
ఏయే బ్యాంకులు ఎంతెంత ఇచ్చాయి?
తాజాగా అందిన సమాచారం ప్రకారం, కేవలం రెండు నెలల్లోనే పలు బ్యాంకులు కేంద్ర ప్రభుత్వానికి దాదాపు రూ.3 లక్షల కోట్లకు పైగా డివిడెండ్‌లు చెల్లించాయి.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ : 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ.2.69 లక్షల కోట్లను డివిడెండ్‌గా బదిలీ చేసింది. ఇది గతేడాది (రూ.2.1 లక్షల కోట్లు) కంటే గణనీయంగా ఎక్కువ.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ, 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వానికి రూ.8,076.84 కోట్లను డివిడెండ్‌గా ఇచ్చింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా : 2024-25 ఆర్థిక సంవత్సరానికి (మార్చి 31తో ముగిసిన) బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.2,762 కోట్లను డివిడెండ్‌గా చెల్లించింది.
కెనరా బ్యాంక్ : కెనరా బ్యాంక్ కూడా ప్రభుత్వానికి రూ.2,283.41 కోట్లను డివిడెండ్‌గా ఇచ్చింది.
ఈ భారీ డివిడెండ్‌లు దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, ప్రభుత్వ రంగ బ్యాంకులు మంచి లాభాలతో నడుస్తున్నాయని సూచిస్తున్నాయి. ఇది ప్రభుత్వ అభివృద్ధి లక్ష్యాలకు మరింత ఊతమిస్తుందని చెప్పొచ్చు.
