FRI System: ఆర్థిక మోసాలు, సైబర్ క్రైమ్ నివారణకు కొత్త FRI సిస్టమ్‌ను అమలు చేస్తున్న బ్యాంకులు
కొత్త FRI సిస్టమ్‌ను అమలు చేస్తున్న బ్యాంకులు

FRI System : ఈ రోజుల్లో ఫోన్, ఇంటర్నెట్ లేనిదే క్షణం గడవట్లేదు. అయితే, వాటితోపాటే సైబర్ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ఒక చిన్న తప్పు, లేదా తెలియకుండా ఒక లింక్ నొక్కడం... అంతే! మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ. ఇలాంటి సైబర్ నేరగాళ్ల ఆట కట్టించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త, పకడ్బందీ ప్లాన్ సిద్ధం చేసింది. అదే 'ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్' సిస్టమ్. దీని ద్వారా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైబర్ మోసాలను ముందుగానే కనిపెట్టి, మీ డబ్బును కాపాడబోతున్నాయి. 'FRI' సిస్టమ్ అంటే ఒక రకంగా సైబర్ మోసగాళ్లను ట్రాక్ చేసే ఒక నిఘా వ్యవస్థ. ఇది ముఖ్యంగా డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే ప్రభుత్వ విభాగం చూసుకుంటుంది. వీరి పని ఏంటంటే, సైబర్ నేరాల్లో వాడే మొబైల్ నంబర్లను కనిపెట్టి, వాటిని మూడు రకాలుగా విభజించడం.. మీడియం రిస్క్, హై రిస్క్, వెరీ హై రిస్క్
ఈ సమాచారం ఎక్కడ నుంచి వస్తుందంటే మీరు సైబర్ మోసం జరిగితే కంప్లైంట్ చేసే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ నుండి, అలాగే టెలికాం డిపార్ట్‌మెంట్ వారి చక్షు ప్లాట్‌ఫామ్ నుండి, ఇంకా బ్యాంకులు ఇచ్చే నిఘా రిపోర్ట్‌ల నుండి సేకరిస్తారు. ఈ FRI సిస్టమ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు , ఇంకా Google Pay, PhonePe లాంటి UPI సేవలు అందించే సంస్థలతో పంచుకుంటారు. ఒక మొబైల్ నంబర్ 'హై రిస్క్' లేదా 'వెరీ హై రిస్క్' కేటగిరీలో ఉంటే, ఆ నంబర్‌కు సంబంధించిన లావాదేవీలపై బ్యాంకులు ప్రత్యేకంగా నిఘా పెడతాయి.
మీరు పొరపాటున అలాంటి మోసపూరిత నంబర్‌కు డబ్బు పంపే ప్రయత్నం చేసినా, లేదా ఆ నంబర్ నుంచి మీకు డబ్బు వచ్చినా, బ్యాంకులు మిమ్మల్ని వెంటనే అలర్ట్ చేస్తాయి. "ఈ నంబర్‌తో ముడిపడిన అకౌంట్ సైబర్ మోసాలకు వాడినట్లు గుర్తించారు, జాగ్రత్త!" అని మీకు మెసేజ్ లేదా పాప్-అప్ అలర్ట్ రావచ్చు. దీనివల్ల మీరు మోసగాళ్ల వలలో పడకుండా ముందుగానే అప్రమత్తం అవ్వొచ్చు.
డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ కేవలం యాక్టివ్‌గా ఉన్న మొబైల్ నంబర్లనే కాదు, రద్దు చేసిన మొబైల్ నంబర్ల జాబితాను కూడా తయారు చేస్తుంది. సైబర్ నేరాలు, మోసాలు, తప్పుగా వాడటం, లేదా ఆధార్ సరిపోక రద్దయిన నంబర్లు ఇందులో ఉంటాయి. ఇలాంటి చాలా నంబర్లను మోసగాళ్లు గతంలో వాడి ఉంటారు. ఈ జాబితాను కూడా ఆర్థిక సంస్థలకు అందిస్తారు. సైబర్ నేరాల వల్ల ప్రజలు పడుతున్న కష్టాలను ప్రభుత్వం గుర్తించింది. అందుకే, ఈ కొత్త 'FRI' సిస్టమ్ వంటి చర్యలతో, సైబర్ మోసగాళ్లను కట్టడి చేయడానికి కఠినమైన చర్యలు తీసుకుంటోంది.
