SIP : రూ.50 వేల జీతంతోనూ కోటీశ్వరులు కావచ్చు.. నెలకు రూ.12 వేల SIPతో ఈజీగా రూ.కోటి
నెలకు రూ.12 వేల SIPతో ఈజీగా రూ.కోటి

SIP : నెల ఆరంభంలో జీతం రాగానే ఒకటో తారీఖు నుంచే ఎన్నో రకాల ఖర్చులు వచ్చి పడుతుంటాయి. ఇలాంటి సమయంలో రూ.కోటి సంపదను సృష్టించడం అనేది ఒక సామాన్యుడికి పెద్ద కలగానే అనిపిస్తుంది. నెలకు రూ.50,000 సంపాదించే వ్యక్తి ఇంత పెద్ద మొత్తం ఎలా పోగు చేయగలడనే అనుమానం రావడం సహజం. అయితే ఆర్థిక నిపుణుల ప్రకారం సరైన ప్రణాళిక, క్రమశిక్షణ, ఓపిక ఉంటే ఇది ఖచ్చితంగా సాధ్యమే. మొదట్లో రూ.కోటి నిధిని ఏర్పాటు చేసుకోవడానికే కాస్త ఎక్కువ సమయం పడుతుందని, ఆ తర్వాత చక్రవడ్డీ ప్రభావంతో మీ డబ్బు చాలా వేగంగా పెరుగుతుందని వారు చెబుతున్నారు.
రూ.50 వేల జీతం ఉన్నవారు ఏం చేయాలి?
కార్మిక్ వేల్త్ మెంటార్స్ డైరెక్టర్ కిరణ్ గాంధీ తెలిపిన వివరాల ప్రకారం.. రూ.50,000 సంపాదించే వ్యక్తి తన అనవసర ఖర్చులపై నియంత్రణ పాటిస్తూ క్రమబద్ధమైన పెట్టుబడులు పెడితే సులువుగా కోటీశ్వరుడు కావచ్చు. అందుకోసం ముందుగా తన నెలవారీ రాబడిలో కనీసం 20 నుంచి 30 శాతాన్ని క్రమం తప్పకుండా మ్యూచువల్ ఫండ్ ఎస్‌ఐపీలో పెట్టుబడి పెట్టాలి. అంతేకాకుండా జీవితంలో అనుకోకుండా వచ్చే అత్యవసర పరిస్థితుల కోసం ఒక ప్రత్యేక ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు పెట్టుబడులను మధ్యలోనే ఉపసంహరించుకోవాల్సిన అవసరం రాదు. అలాగే అనవసర అప్పులకు దూరంగా ఉంటూ, తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయనే ఆశతో మోసపోకుండా పెట్టుబడులను వేర్వేరు ఫండ్స్‌లో విభజించుకోవాలని సూచిస్తున్నారు.
నెలకు రూ.12,000 SIP లెక్కలు ఇవే
ఇప్పుడు రూ.కోటి సాధించే లెక్కలను పరిశీలిస్తే.. మీరు ప్రతి నెలా రూ.12,000 ఎస్‌ఐపీ ప్రారంభించారనుకుందాం. ఈ పెట్టుబడిపై ఏడాదికి సగటున 12 శాతం రాబడి లభిస్తే, వరుసగా 20 సంవత్సరాల పాటు పెట్టుబడి కొనసాగించడం ద్వారా మీ చేతికి దాదాపు రూ.కోటి ఫండ్ అందుతుంది. అంటే 25 నుంచి 30 ఏళ్ల వయస్సులో ఉద్యోగంలో చేరిన వెంటనే ఈ పెట్టుబడిని ప్రారంభించి, ఎటువంటి ఆటంకం లేకుండా 15 నుండి 20 ఏళ్ల పాటు కొనసాగిస్తే ఎలాంటి టెన్షన్ లేకుండా రూ.కోటి లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చు.
20 ఏళ్లు ఆగక్కర్లేకుండా స్టెప్-అప్ పద్ధతి
20 ఏళ్ల సమయం చాలా ఎక్కువ అని భావించే వారు ఈ లక్ష్యాన్ని త్వరగా చేరుకోవడానికి స్టెప్-అప్ ఎస్ఐపీ వ్యూహాన్ని అమలు చేయవచ్చు. అంటే ప్రతి సంవత్సరం మీ జీతం పెరిగిన కొద్దీ, మీ ఎస్‌ఐపీ పెట్టుబడి మొత్తాన్ని కూడా 10 నుంచి 15 శాతం వరకు పెంచుకుంటూ పోవాలి. ప్రతి ఏటా మీరు చేసే ఈ చిన్న పెంపు వల్ల 20 సంవత్సరాల కంటే చాలా ముందే మీ కోటి రూపాయిల కల నెరవేరుతుంది.
మ్యూచువల్ ఫండ్స్‌పై పెరుగుతున్న ప్రజల నమ్మకం
ఇది కేవలం కాగితాల మీద లెక్కలు మాత్రమే కాదు, ప్రస్తుతం భారతీయ సామాన్య ప్రజలు కూడా ఈ తరహా పెట్టుబడులపై అమితమైన నమ్మకాన్ని చూపుతున్నారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) విడుదల చేసిన జూన్ 2026 నివేదిక ప్రకారం.. చిన్న పెట్టుబడిదారుల భాగస్వామ్యం భారీగా పెరిగింది. జూన్ 2026 నెలలోనే ఎస్‌ఐపీల ద్వారా రూ.31,781 కోట్ల రికార్డు స్థాయి పెట్టుబడులు వచ్చాయి. ఇది మే 2026 కంటే 2.7 శాతం, గత ఏడాది జూన్ 2025 తో పోలిస్తే 16.5 శాతం ఎక్కువ. దేశంలో ఎస్‌ఐపీ ఖాతాల సంఖ్య 8.64 కోట్లనుంచి ఏకంగా 9.78 కోట్లకు చేరింది. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలోని ఎస్‌ఐపీ అసెట్స్ రూ.17.70 లక్షల కోట్లకు చేరడం విశేషం.

