Beer Prices : మందుబాబులకు షాక్.. బీర్ ధరలు పెరగనున్నాయా? యుద్ధం ఎఫెక్ట్ మామూలుగా లేదుగా
యుద్ధం ఎఫెక్ట్ మామూలుగా లేదుగా

Beer Prices : మధ్యప్రాచ్యంలో రాజుకున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు కేవలం సరిహద్దులకే పరిమితం కాలేదు. గ్లోబల్ మార్కెట్‌ను చుట్టేస్తూ.. నేరుగా సామాన్యుడి సరదా పై దెబ్బకొట్టేలా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా తలెత్తిన ఇంధన సంక్షోభం, గ్యాస్ కొరత కారణంగా త్వరలోనే భారత్‌లో బీర్ మరియు ఇతర మద్యం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ముడి సరుకుల ధరలు పెరగడం, రవాణా కష్టాలు తోడవడంతో మద్యం తయారీ కంపెనీలు బెంబేలెత్తిపోతున్నాయి. యుద్ధం మనకు వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్నా, దాని ప్రభావం మాత్రం మన ఇంట్లోని గ్యాస్ స్టవ్ నుంచి బార్‌లోని బీర్ బాటిల్ వరకు కనిపిస్తోంది. భారత్ తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 90 శాతాన్ని వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇందులో సగం వాటా హోర్ముజ్ జలసంధి అనే ఇరుకైన సముద్ర మార్గం గుండానే వస్తుంది. ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణలకు ఇది ప్రధాన కేంద్రంగా మారింది. దీనికి తోడు కతర్, సౌదీ అరేబియా నుండి వచ్చే ఎల్‌పీజీ సరఫరాకు ఆటంకం కలగడంతో గ్యాస్ లభ్యత తగ్గిపోయింది. ఈ గ్యాస్ కొరత మద్యం తయారీ కర్మాగారాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
మద్యం ధరల పెంపునకు కేవలం లిక్విడ్ కారణం కాదు, దాని ప్యాకేజింగ్ కూడా పెద్ద సమస్యగా మారింది. బీర్ బాటిళ్లను తయారు చేసే గాజు ఫ్యాక్టరీలకు గ్యాస్ చాలా అవసరం. గ్యాస్ కొరత వల్ల గాజు బాటిళ్ల తయారీ ఖర్చు 20 శాతం పెరిగిందని బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అలాగే అల్యూమినియం క్యాన్‌ల సరఫరా కూడా దెబ్బతింది. బాటిళ్లపై వేసే లేబుళ్లు, ప్యాకింగ్ చేసే కార్టన్ బాక్సులు, టేపుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో కంపెనీలకు ఉత్పత్తి ఖర్చు భారం కావడంతో ధరలు పెంచడం తప్ప వేరే మార్గం లేని పరిస్థితి నెలకొంది.
యునైటెడ్ బ్రూవరీస్ (హెనెకెన్), కార్ల్స్‌బర్గ్, ఏబీ ఇన్ బెవ్ వంటి దిగ్గజ కంపెనీలు ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాయి. పాత ధరలకే మద్యం అమ్మడం వల్ల భారీ నష్టాలు వస్తున్నాయని బ్రూవర్స్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ వినోద్ గిరి తెలిపారు. అందుకే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి, మద్యం ధరలను 12 నుండి 15 శాతం వరకు పెంచాలని కోరుతున్నారు. వేసవి కాలం వస్తుండటంతో బీర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, సరిగ్గా ఇదే సమయంలో ధరలు పెరగడం మందుబాబులకు పెద్ద దెబ్బే అని చెప్పాలి.
భారత మద్యం మార్కెట్ పరిస్థితి ఏంటి?
భారత్‌లో మారుతున్న జీవనశైలి కారణంగా మద్యం విక్రయాలు ఏటా పెరుగుతున్నాయి. 2024 లెక్కల ప్రకారం భారత మద్యం మార్కెట్ విలువ సుమారు రూ.73,800 కోట్లు (7.8 బిలియన్ డాలర్లు). 2030 నాటికి ఇది రెట్టింపు అవుతుందని అంచనా. అయితే ఇలాంటి అంతర్జాతీయ సంక్షోభాలు ధరలపై ప్రభావం చూపడం వల్ల మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మద్యంపై పన్నులు ఎక్కువగా ఉన్నాయి, ఇప్పుడు ఈ పెంపు కూడా తోడైతే సాధారణ మధ్యతరగతి వ్యక్తికి మద్యం ఒక ఖరీదైన వ్యవహారంగా మారనుంది.

