Beer Industry : యూపీలో బీర్ ఫ్యాక్టరీల జాతర.. రూ. 5,500 కోట్ల పెట్టుబడులు.. వేలాదిగా కొత్త ఉద్యోగాలు
రూ. 5,500 కోట్ల పెట్టుబడులు.. వేలాదిగా కొత్త ఉద్యోగాలు

Beer Industry : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీర్ పరిశ్రమ భారీ పెట్టుబడుల దిశగా అడుగులు వేస్తోంది. రాబోయే మూడేళ్లలో సుమారు రూ.5,500 కోట్ల పెట్టుబడులతో కొత్త తయారీ కేంద్రాలు, అనుబంధ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. యూపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 2026-27 ఎక్సైజ్ పాలసీ చాలా ప్రగతిశీలకంగా ఉందని, ఇది పరిశ్రమ వృద్ధికి ఎంతో దోహదపడుతుందని బీఏఐ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీఏఐ డైరెక్టర్ జనరల్ వినోద్ గిరి సమాచారం ప్రకారం.. ఇప్పటికే రూ.1,500 కోట్ల వ్యయంతో రెండు కొత్త బ్రూవరీల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటితో పాటు మరో రూ.2,000 కోట్లతో రెండు భారీ అల్యూమినియం క్యాన్ తయారీ ప్లాంట్లు, ఇంకో రూ.2,000 కోట్లతో గ్లాస్ బాటిల్ ప్రొడక్షన్ యూనిట్లు పైప్‌లైన్‌లో ఉన్నాయి. కేవలం తయారీ కేంద్రాలే కాకుండా, పేపర్ బాక్సుల తయారీ, మాల్టింగ్ యూనిట్ల ఏర్పాటుపై కూడా కంపెనీలు దృష్టి సారించాయి. ఈ భారీ పెట్టుబడుల వల్ల రాష్ట్రంలో వేల సంఖ్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కొత్త ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
దిగ్గజ కంపెనీల వ్యూహాత్మక అడుగులు
యునైటెడ్ బ్రూవరీస్, ఏబీ ఇన్ బెవ్, కార్ల్స్‌బర్గ్ వంటి దిగ్గజ కంపెనీలకు బీఏఐ ప్రాతినిధ్యం వహిస్తోంది. దేశవ్యాప్తంగా అమ్ముడయ్యే బీర్లలో ఈ కంపెనీల వాటానే ఏకంగా 85 శాతంగా ఉంది. యూపీ సర్కార్ తెచ్చిన కొత్త విధానం వల్ల లైసెన్సింగ్ ప్రక్రియలో పారదర్శకత పెరిగిందని, పంపిణీ, పన్నుల విషయంలో స్పష్టత వచ్చిందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బీర్ వినియోగంలో భారత్ 13వ స్థానంలో ఉండగా, ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ల నుంచి విపరీతమైన డిమాండ్ వస్తోంది.
ధరలు మారవు.. ఆదాయం తగ్గదు
కొత్త ఎక్సైజ్ పాలసీలో ప్రభుత్వం ఒక తెలివైన నిర్ణయం తీసుకుంది. స్ట్రాంగ్ ఆల్కహాల్ కలిగిన మద్యంపై స్వల్పంగా పన్నులు పెంచినప్పటికీ, బీర్ ధరలను మాత్రం యథాతథంగా ఉంచింది. దీనివల్ల వినియోగదారులు తక్కువ ఆల్కహాల్ ఉండే బీర్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. 180 మి.లీ లిక్కర్ సీసాపై ధర సుమారు రూ.10 వరకు పెరిగే అవకాశం ఉండగా, బీర్ ప్రియులకు మాత్రం ఆ భారం లేదు. ఈ బ్యాలెన్సింగ్ విధానం వల్ల అటు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గకుండా, ఇటు పరిశ్రమకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

