Cancer : క్యాన్సర్ నిర్ధారణకు కుక్కలు.. బెంగళూరు స్టార్టప్ వినూత్న ప్రయోగం!
బెంగళూరు స్టార్టప్ వినూత్న ప్రయోగం!

Cancer : కుక్కలకు కొన్ని స్పెషల్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి. వాటికి వాసన గ్రహించే సామర్థ్యం చాలా ఎక్కువ. ఒక వ్యక్తిని కేవలం వాసనతోనే గుర్తించగల శక్తి వాటికి ఉంది. అందుకే, నేర పరిశోధనలలో, బాంబులు, డ్రగ్స్, మృతదేహాలను గుర్తించడానికి కుక్కలను ఉపయోగిస్తారు. ఇప్పుడు బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ కుక్కల ఈ ప్రత్యేక సామర్థ్యాన్ని క్యాన్సర్ వంటి వ్యాధులను గుర్తించడానికి ఉపయోగిస్తోంది. ఈ స్టార్టప్ పేరు డాగ్నాసిస్ (Dognosis). డాగ్నాసిస్ సంస్థ కుక్కల ప్రత్యేక వాసన గ్రహించే శక్తితో పాటు కృత్రిమ మేధస్సు (AI) టెక్నాలజీని ఉపయోగించి మనుషులలోని క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించడానికి కృషి చేస్తోంది. కేవలం క్యాన్సర్ మాత్రమే కాదు, కోవిడ్, క్షయ వంటి వ్యాధులను కూడా కుక్కల ద్వారా ఈ యంత్రం గుర్తించగలదు.
ఈ విధానంలో వ్యాధి నిర్ధారణ చేయాల్సిన వ్యక్తికి 10 నిమిషాల పాటు ఒక మాస్క్ ధరిస్తారు. ఈ సమయంలో ఆ వ్యక్తి శ్వాస ద్వారా విడుదలయ్యే వివిధ రసాయనాలు మాస్క్‌కు అంటుకుంటాయి. ఈ మాస్క్‌ను డాగ్నాసిస్ ల్యాబ్‌కు పంపిస్తారు. డాగ్నాసిస్ ల్యాబ్‌లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన కుక్కలు ఉంటాయి. ఆ మాస్క్ శాంపిల్‌ను ఈ కుక్కలకు వాసన చూపిస్తారు. కుక్కలు వాసన చూస్తున్నప్పుడు వాటికి డాగ్‌సెన్స్ అనే ఈఈజీ హెడ్‌సెట్‌ను పెడతారు. మాస్క్‌ను వాసన చూసినప్పుడు కుక్కల మెదడు నుంచి వచ్చే న్యూరల్ సిగ్నల్స్‌ను ఈ హెడ్‌సెట్‌లు సంగ్రహిస్తాయి.
ఆ తర్వాత, ఈ ఈఈజీ డేటాను డాగ్ఓఎస్ అనే ఒక ఏఐ ప్లాట్‌ఫారమ్‌కు పంపిస్తారు. ఈ తెలివైన సాఫ్ట్‌వేర్ ఆ డేటాను విశ్లేషించి, ఆ శాంపిల్‌లో క్యాన్సర్ కారక కణాలు లేదా ఇతర వ్యాధుల కణాలు ఉన్నాయా అని గుర్తిస్తుంది. కాగ్నిటివ్ సైంటిస్ట్ అయిన ఆకాష్ కుల్‌గోడ్, మాజీ ఇజ్రాయెలీ కమాండర్ ఇటమర్ బిటాన్ డాగ్నాసిస్ కంపెనీ వ్యవస్థాపకులు. వీరి స్టార్టప్‌లో న్యూరోసైన్స్, ఇంజనీరింగ్, క్లినికల్ ఆపరేషన్స్, సాఫ్ట్‌వేర్ రంగాలకు చెందిన నిపుణుల బృందం పనిచేస్తోంది. శ్వాస, మూత్రం, చెమటలలోని రసాయన మార్పులను కుక్కలు గుర్తించగలవని చాలా పరిశోధనలు నిరూపించాయి. ఈ ఆధారంగా డాగ్నాసిస్ తమ పరీక్షా విధానాన్ని అభివృద్ధి చేసింది. నివేదిక ప్రకారం, డాగ్నాసిస్ దాదాపు 10 రకాల క్యాన్సర్లను 98% వరకు కచ్చితత్వంతో గుర్తించగలదని చెబుతున్నారు.
